పోలాకి: సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ సెగ్ అధికారులకు తగిలింది. థర్మల్ ప్రాజెక్టుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుండటంతో ప్రజలు ప్రత్యక్షంగా తమ వ్యతిరేకతను వెళ్లగక్కేందుకు వెనుదీయడం లేదు. ఫలితంగా ప్లాంట్ ఏర్పాటుకు ప్రాథమిక భూసర్వే చేపట్టిన అధికార బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సర్వే ప్రక్రియను స్థానికులు అడ్డుకోవడంతో వారు వెనుదిరగక తప్పలేదు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించిన పోలాకి మండలం తోటాడ పరిసర ప్రాంతాల్లో జెన్‌కో ఏఈ డి.వి.మధు ఆధ్వర్యంలోని బృందం జీపీఆర్‌ఎస్ విధానంలో భూములు వివరాలపై ప్రాథమిక సర్వే చేపట్టింది. మొదట తోటాడ వెళ్లిన బృందం సభ్యులు అక్కడి నుంచి చీడివలస గ్రామానికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న చీడివలస, ఓదిపాడు, సన్యాసిరాజుపేట, గవరంపేట గ్రామాలకు చెందిన వందలమంది ప్రజలు ఒక్కసారిగా వారిని అడ్డుకున్నారు. ‘ఎవరిని అడిగి మా పొలాల్లో కొలతలు చేస్తున్నారని’ ప్రశ్నిస్తూ తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మరోసారి మా ప్రాంతాల్లో పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముక్తకంఠంతో హెచ్చరించారు. దాంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా అక్కడున్న విలేకరులతో జెన్‌కో ఏఈ మధు మాట్లాడుతూ స్థానిక ప్రజల వ్యతిరేకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ ఇప్పటివరకూ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా సర్వేలు నిర్వహించడం ఏమిటని మండిపడ్డారు. జపాన్ కంపెనీ నిర్మించతలపెట్టిన నాలుగు వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ మెగా థర్మల్ పవర్‌ప్లాంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై సోమవారం మండల కేంద్రానికి ర్యాలీగా వెళ్లి గ్రీవెన్స్‌లో అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంబంధిత పంచాయితీల సమావేశాల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని వివరించారు.
వద్దంటే.. ఎందుకొచ్చారు?
Published Mon, Mar 30 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement