
రికార్డు అసిస్టెంట్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు
దేవుడి దగ్గరకో.. దేవత దగ్గరకో వెళ్లి కోరికలు కోరుతాం.. దక్షిణలు సమర్పిస్తాం.. కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటాం..తానూ దేవుడినని ఫీలయ్యాడేమో గానీ.. సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలోనే ఓ అధికార దేవుడు తన కోసమే ఓ హుండీ పెట్టేశాడు.. లంచాల దక్షిణలు అందులో వేయాలని తన కింది ఉద్యోగులనే ఆదేశించాడు..అసలు దేవుడు దక్షిణలు సమర్పించకపోయినా.. మనసారా ప్రార్థిస్తే భక్తులను కాపాడతాడు, కోరికలు తీరుస్తాడు..కానీ ఈ అధికార దేవుడు మాత్రం తన కింద పనిచేసే వారే అయినా.. తన సహోద్యోగులన్న స్పృహ కూడా లేకుండా పీఆర్‌సీ బకాయిలు కావాలంటే లంచాల దక్షిణలు సమర్పించాల్సిందేనని పీక మీద కత్తి పెట్టాడు.. మీటింగ్ పెట్టి మరీ రేట్లు ఫిక్స్ చేశాడు. కొంతమంది గత్యంతరం లేక అతని హుండీలో దక్షిణలు వేసేశారు. అయితే కొద్దిమంది మాత్రం సహనం నశించి.. ఏసీబీకి ఉప్పందించారు. వారు వల పన్నారు. రూ.60 వేల లంచం తీసుకుంటుండగా సదరు లంచావతారాన్ని.. అతని తాబేదారు రికార్డు అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. ఆ లంచావతారమే పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ఈవో సత్యనారాయణ. కాగా గతంలోనూ పోలమాంబ దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అప్పటి ఈవో మూర్తిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
విశాఖ క్రైం: దేవుడి సన్నిధిలో చిన్న తప్పు చెయ్యడానికి కూడా భయపడుతున్న రోజుల్లో... కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ దేవాలయంలోనే లంచాల హుండీ తెరిచేశాడు. ఆ అమ్మవారి హుండీలో భక్తులు దక్షిణ వేయకపోయినా.... ఈయన హుండీలో ఆలయ ఉద్యోగులు మాత్రం లంచాల సొమ్ము జమ చేయాల్సిందే. లేకుంటే మాత్రం ఉద్యోగుల పరిస్థితి ఊహించుకోలేం. ఎక్కడెక్కడ ఆమ్యామ్యాలు దొరికే ఛాన్స్ ఉంటే అక్కడ పట్టుబట్టి మరీ పైసలు పిండుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈయనకు రైట్ హ్యాండ్‌గా రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివ వ్యవహరిస్తూ గుడిలోనే చక్రం తిప్పేవారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బందికి న్యాయంగా దక్కాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం భారీగా లంచం డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకూ వాటాలివ్వాలని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేశారు. సొమ్ము వసూలు చేసే బాధ్యతను రికార్డ్ అసిస్టెంట్‌కు అప్పగించేశారు. వీరిద్దరూ కలిసి ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు... ఇంకా ఎవరు బాకీ ఉన్నారనే జాబితానే తయారు చేసేసుకుని సిబ్బందిని వేధించుకు తింటున్నారు. వీరి వేధింపులు భరించలేని ఓ అర్చకుడు, వాచ్‌మెన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సంప్రదించడంతో... లంచావతారులను ఏసీబీ అధికారులు గుడిలోనే రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించేశారు.
ఒక్కొక్కరికీ ఒక్కో ధర నిర్ణయించేసి...
ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలియజేసిన వివరాల ప్రకారం... దేవస్థాన ఉద్యోగులకు 2015 పీఆర్‌సీ అమలు చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 27న ఉద్యోగులు, సిబ్బందితో ఈవో సమావేశం ఏర్పాటు చేశారు. పీఆర్‌సీ బకాయిలు రావాలంటే అర్చకులు రూ.30 వేలు, సన్నాయిమేళం, వాచ్‌మెన్, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమని సిబ్బంది మొరపెట్టుకోగా.. రూ.5వేలు తగ్గించి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొందరు కొద్దిరోజుల కిందట రూ.1.45లక్షలు సమర్పించేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అర్చకుడు శ్రీనివాస్ చక్రవర్తి, వాచ్‌మెన్ ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈవో సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్ శివపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం ఉద్యోగుల నుంచి తీసుకున్న లంచం సొమ్ము రూ.60వేలు ఈవో చాంబర్‌లో రికార్డ్ అసిస్టెంట్ శివ లెక్కిస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, మూర్తి, ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈవో సత్యనారాయణతో పాటు రికార్డు అసిస్టెంట్ శివని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అవినీతి వసూళ్లకు సంబంధించి లంచావతారులు ఇద్దరూ నిర్వహిస్తున్న ఓ రికార్డును స్వాధీనం చేసుకున్నారు.
11 మంది నుంచి లంచాలు వసూలు
ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ అర్చకులు, ఇతర సిబ్బంది ఈవోకు డబ్బులు అందించే ముందు తమను సంప్రదించారని, ఇద్దరు అర్చకులు రూ.50 వేలు, ఓ వాచ్‌మెన్ రూ.10వేలు లంచం గురువారం ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన లంచాన్ని ఈవో చాంబర్‌లో రికార్డు అసిస్టెంట్ లెక్కపెడుతుండగా పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఈవో ఇప్పటికే చాలా మంది నుంచి సొమ్ము సేకరించారని, ఇంకా ఇవ్వాల్సిన వారి వివరాలు పుస్తకంలో రాసుకున్నారని తెలిపారు. సుమారు రూ.1.45లక్షలను ఉద్యోగులు కొద్దిరోజుల కిందట ఈవోకి ఇచ్చారని... అందులో నుంచి రూ.1.20లక్షలను రాజమండ్రిలో ఉంటున్న రీజినల్ జాయింట్ కమిషనర్‌కు చెల్లించినట్లు ఈవో అంగీకరించారని, మొత్తం 11 మంది ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకున్నారని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 7 – ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మద్ది అప్పలరెడ్డి ఇంట్లో రూ.38వేలు స్వాధీనం
కరకచెట్టు పోలమాంబ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పెదవాల్తేరుకు చెందిన మద్ది అప్పలరెడ్డి ఇంట్లో అవినీతి సోమ్ము రూ.38 వేలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పోలమాంబ ఆలయంలో రెండోసారి ఏసీబీ దాడి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పెదవాల్తేరులో గల శ్రీ కరకచెట్టు పోలమాంబఅమ్మవారి దేవస్థానంలో విధులు నిర్వర్తించే కార్యనిర్వహణాధికారులు వారి తీరు మార్చుకోవడం లేదు. లంచాలు రుచి మరిగి సిబ్బంధిని వేధిస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆలయానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ దేవస్థానంలో 2016వ సంవత్సరంలో ఈఓ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన సత్యనారాయణ తాజాగా ఏసీబీకి చిక్కారు. ఈయ న నర్సీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన మరో ఐదు దేవస్థానాలకు ఇన్‌ఛార్జి ఈఓగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ 2016లో 2015 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని సర్కులర్ జారీ చేశారు. ఇదే ఆ శాఖలోని ఈవోలు, ఇతర ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిపిస్తోం దనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు ఈవోలు ఏసీబీకి చిక్కి సస్పెండ్ కావడం భక్తులను విస్మయపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment