ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన జన్మభూమి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులు సుభిక్షంగా ఉంటారని చంద్రబాబు చెప్పారు. గోదావరి జిల్లాలు ఒకప్పుడు అన్నంపెట్టిన జిల్లాలని అన్నారు.
అంతకుముందు ఆయన తూర్పు గోదావరి జిల్లా అంగరలో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చంద్రబాబు అన్నారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. రుణమాఫీకి ఆర్బీఐ కూడా అడ్డుపడిందని బాబు అన్నారు.
ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకుని సాయం చేసేందుకు కేంద్రం కూడా వెనకడుగు వేసిందన్నారు. రైతులను రుణ విముక్తులను చేసే బాధ్యత తనదేనన్నారు. రైతు సాధికార సంస్థకు వివిధ మార్గాల ద్వారా నిధులు సమకూరుస్తామని చంద్రబాబు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు అందిస్తామని, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న హామీని నిలుపుకొంటామన్నారు.