సాక్షి, అమరావతి, పోలవరం, ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డు సృష్టించారు. పోలవరం ప్రాజెక్టు పునాదిని (డయాఫ్రం వాల్) జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రిగా ఆయన సరికొత్త చరిత్రను లిఖించారు. ప్రపం చంలో ఇది తొమ్మిదో వింతగా పార్టీ వర్గాలే అభివర్ణిస్తుండటం గమనార్హం. పోలవరానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు శంకుస్థాపనలు నిర్వహించారు. కాఫర్ డ్యామ్‌కు ఒకసారి, కాంక్రీట్ పనులకు మరోసారి, గేట్లు తయారైనప్పుడు ఇంకోసారి శంకుస్థాపనలు చేశారు. ఇక నాబార్డు నుంచి నిధులు విడుదలైనప్పుడు ప్రాజెక్టు కట్టేశామనే రీతిలో దేశ రాజధానిలో పెద్ద కార్యక్రమమే నిర్వహించి రక్తి కట్టించారు. ఈ కోవలో తాజాది 5వ కార్యక్రమం కావటం గమనార్హం.
నేనే ముఖ్య కారణం...
పోలవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 10.50 గంటలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయన యాగశాలలో పూజలు చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం రైతులతో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లేందుకు తానే ముఖ్య కారణమని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం గురించి ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టుకు ఎవరు ప్రారంభోత్సవం చేశారనే విషయం గురించి కానీ, శంకుస్థాపన గురించి కానీ కనీసం కూడా ప్రస్తావించకపోవటం గమనార్హం.
బ్రిటీష్ హయాంలోనే ప్రతిపాదనలు..
పోలవరం నిర్మాణం తనవల్లే ముందుకు సాగుతోందని చంద్రబాబు చెప్పారు. 11,158 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేశామని తెలిపారు. పోలవరాన్ని 1941లోనే మద్రాసు ప్రెసిడెన్సీలో చర్చించి నిర్మాణం చేద్దామని భావించారని, మరోమారు ధవళేశ్వరం బ్యారేజీ కట్టినప్పుడు కూడా నిర్మిద్దామని అనుకున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపకుంటే తాను సీఎంగా ప్రమాణం చేయబోనని ప్రధానికి చెప్పి తన పదవినే అడ్డుపెట్టి విలీనం చేయించానని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమల తరహాలో దర్శించాలి
పోలవరంపై గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని కార్యక్రమానికి హాజరైన రైతులకు ముఖ్యమంత్రి సూచించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎలా వెళ్తున్నారో అదేవిధంగా పోలవరాన్ని కూడా సందదర్శించాలన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే 2019 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తాను స్వీకరిస్తానని చంద్రబాబు చెప్పారు.
55.12 శాతం పనులు పూర్తి...
పోలవరం ప్రాజెక్టుకు రూ.57 వేల కోట్లు అవసరం కాగా ఇప్పటివరకూ రూ.14 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. 55.12 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్ నిర్మాణానికి కృషి చేసిన ఉద్యోగులు, అధికారులు, ఇంజనీర్లను చంద్రబాబు సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, కె.శివరామరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్ వచ్చినా నీళ్లేవి?
గతేడాది గణతంత్ర దినోత్సవాన చుక్క నీటిని తోడకుండానే పది నిముషాలపాటు ఉత్తినే రెండు మోటార్లను ఆడించి.. రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు జాతికి అంకితం చేసి అప్పట్లో ఓ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు 2018 ఖరీఫ్ రానే వచ్చింది. పోలవరం ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామన్న చంద్రబాబు హామీ మాత్రం నీరుగారిపోయింది. దీనిపై ప్రజల దృష్టి మరల్చడానికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది(డయా ఫ్రమ్ వాల్) పనులను భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వర్చువల్ రివ్యూలతో హడావుడి
2014 జూన్ 8 నుంచి నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకూ అంటే 2016 సెప్టెంబరు 7 వరకూ పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. 2016 సెప్టెంబరు 8న పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5535.41 కోట్లకు పెంచేసి, ప్రధాన కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులు అన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్ల పర్వానికి తెర తీశారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రతి సోమవారం వర్చువల్ రివ్యూలతో హడావుడి చేస్తున్నారు.
పోలవరంలో ఇది ఐదోసారి...
పోలవరానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు శంకుస్థాపనలు నిర్వహించారు. కాఫర్ డ్యామ్‌కు ఒకసారి, కాంక్రీట్ పనులకు మరోసారి, గేట్లు తయారైనప్పుడు ఇంకోసారి శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్టు కట్టేశామనే రీతిలో హడావుడి చేశారు. కాఫర్ డ్యామ్(మట్టికట్ట)ల ద్వారా నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని అప్పుడు సీఎం ప్రకటించడంపై నిపుణులు నిర్ఘాంతపోయారు. ప్రధాన ఆనకట్ట(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మించడానికి వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కట్టే కాఫర్ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ చేయాలన్న సీఎం నిర్ణయాన్ని వింతల్లో కెల్లా వింతగా అభివర్ణించారు. ఇక 2016 డిసెంబర్ 26న నాబార్డు నుంచి నిధులు విడుదలైనప్పుడు కూడా ఢిల్లీ వేదికగా ప్రాజెక్టు పూర్తైన తరహాలో డ్రామాకు తెర తీశారు. ఇప్పుడు ఐదోసారి... కేవలం ప్రాథమిక పని అయిన ప్రాజెక్టుకు పునాది గోడ లాంటి డయాఫ్రం వాల్‌ను జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించటంపై జలవనరుల నిపుణులు విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment