ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్టు పనులను పక్కకు నెట్టి.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా జిల్లా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబునాయుడు కుట్రలను ఇక్కడ సాగనిచ్చేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హెచ్చరించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసేవరకూ తమ పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరిట జిల్లా రైతుల ప్రయోజనాలకు గండికొట్టి ఇతర జిల్లాలకు గోదావరి జలాలను తరలిం చుకుపోవడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఈ పథకం ద్వారా కడపకు నీరు ఇస్తామని చంద్రబాబు, అనంతపురంతోపాటు రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పొంతనలేని ప్రకటనలు చేస్తూ రైతులను తికమక పెడుతున్నారన్నారు. ఈ పథ కం వల్ల జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లలేకపోతున్నారని, తమ నాయకునికి ఈ విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తమతోపాటు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇతర జిల్లాలకు నీరు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, ఇక్కడి రైతుల అవసరాలు తీరేవరకూ అటువంటి చర్యలకు పాల్పడితే ఎదుర్కొంటామని అన్నారు.
మరో వారంలో ఈ పథకానికి శంకుస్థాపన చేసే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనిని నిలుపుదల చేయించడానికి తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించామని చెప్పారు. ఈ పథకం కారణంగా జిల్లా రైతులకు, ప్రజలకు కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణా జిల్లాలోని బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఈ పథకానికి రూపకల్పన చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా అనేక జిల్లాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికే పట్టిసీమ పథకాన్ని రూపకల్పన చేశారని నాని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు జిల్లా ప్రజలకు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన రూ.1,700 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
అసలు పోలవరం ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పాలని నాని ప్రశ్నించారు. కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ జిల్లాకు ఇంత నీరిస్తాం, ఈ జిల్లాకు ఇంత నీరిస్తాం అని ప్రకటిస్తున్నారే తప్ప మన జిల్లా రైతులకు ఎంత నీరిస్తారో చెప్పకపోవడం వెనుక మర్మమేమిటో స్పష్టం చేయాలని కోరారు. జిల్లా రైతుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పోరాట మార్గాన్ని ఎంచుకున్నామని, వారం పది రోజుల్లో పట్టిసీమపై ఉద్యమిస్తామని చెప్పారు. తొలుత జిల్లాలో సుమారు 25-30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రైతులు ఏం కోల్పోతున్నారనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. దీనిపై దీర్ఘకాలిక పోరాటాలు చేయడానికి వెనుకాడబోమన్నారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు అఖిలపక్ష కూట మిని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, అన్ని పార్టీలూ రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమాలకు ముందుకు రావాలని కోరారు.
టీడీపీ ఆగడాలు పెచ్చుమీరాయ్
అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ.. మాఫియాను తలపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాల కారణంగా సామాన్యులకు ఇల్లు కట్టుకునే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయన్నారు. జిల్లా ప్రజల సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా వారికి చీమకుట్టినట్టైనా లేకపోవడం ప్రజల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్ర, జీఎస్ రావు, ముఖ్య నాయకులు ఘంటా మురళి, ఇందుకూరి రామకృష్ణంరాజు, నియోజకవర్గాల కన్వీనర్లు గ్రంధి శ్రీనివాస్, తోట గోపీ, చీర్ల రాధయ్య, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, తలారి వెంకట్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
రైతులకు అండగా పోరాడతాం
Published Tue, Feb 24 2015 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement