మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన
► జిల్లా పోలీసులుగుంటూరులోని బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
►అదే సందర్భంగా గుంటూరులో తుపాకీ కలకలంతో ఉలికిపాటు
►నల్లమలలోనూ కొనసాగుతున్న కూంబింగ్
సాక్షి, గుంటూరు: జిల్లా పోలీసులు ఆదివారం రాత్రినుంచి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ.. మావోయిస్ట్ కదలికలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగరంలోనైతే బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్‌లలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు హడలిపోయారు.
అసలు పోలీసులు ఇంత హడావుడి ఎందుకు చేశారంటే ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతుండటమే. దీనిపై ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరంతా అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ వదలి వెళ్ళడంతో ఇదేమైనా మావోయిస్ట్‌ల పనా.. అనే దానిపైనా పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఉపాకీ గురించి వివరాలు అడగడంతో అర్బన్ ఓఎస్డీ జగన్నాథ్‌రెడ్డి హుటాహుటిన అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తుపాకీని పరిశీలించి, అది ఎయిర్‌గన్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఊపిరి పీల్చుకున్నారు.
గత నెలలో ఎన్‌కౌంటర్ కూడా కారణమే...
జిల్లాలో మావోయిస్ట్ కదలికలు లేవని చెబుతూనే గత నెలలో నల్లమల అటవీ ప్రాంతంలోని గుంటూరు- ప్రకాశం బోర్డర్‌లో గుంటూరు ఏఎన్‌ఎస్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్ట్ ముఖ్య నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్ట్ జిల్లాకమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో మావోయిస్ట్ విక్రమ్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు నల్లమలను జల్లెడపడుతున్నప్పటికీ ఇంత వరకూ విక్రమ్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీనికితోడు జాన్ బాబూరావు రిక్రూమెంట్ చేసేందుకే బయటకు వచ్చాడని తేలడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ఆగస్టు మూడు వరకూ వారోత్సవాలు
ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మండల కేంద్రాల్లో పోలీసులు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బంధీ నిర్వహించారు. గ్రామాల్లో మావోయిస్ట్ సానుభూతిపరులుగా అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచారు. గుంటూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లలో ఫ్లాట్‌పామ్‌లు, పార్శిల్ కార్యాలయం, వ్యాపార సముదాయాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు.
పోలీస్ అలర్ట్
Published Tue, Jul 29 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement
Advertisement