అగ్రిగోల్డ్‌ బాధితులను వీడని కష్టాలు | police are not listing Agrigold bond details | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులను వీడని కష్టాలు

Published Fri, Nov 3 2017 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM

police are not listing Agrigold bond details - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు వారి వివరాలను పోలీస్‌స్టేషన్లలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం గతనెల 12వ తేదీన ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు చూపించిన ఆధారాలను పూర్తి స్థాయిలో నమోదు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో పాటు ఆయా జిల్లాల ఎస్పీలు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించి అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఇచ్చిన చెక్కులు, 2012లో ఇచ్చిన పరివార్‌ బాండ్ల వివరాలను పోలీసులు నమోదు చేయడం లేదు. 2014 డిసెంబర్‌లోపు తేదీలతో ఉన్న వివరాలను మాత్రమే నమోదు చేస్తామంటూ పోలీసులు తిరకాసు పెడుతున్నారు. అయితే అగ్రిగోల్డ్‌ సంస్థ 2014 డిసెంబర్‌లో ఖాతాదారులకు మెచ్యురిటీ బాండ్లకు సంబంధించిన చెక్కులు, పరివార్‌ బాండ్లును ఇచ్చింది. ఈ బాండ్లు, చెక్కులు 2015 జనవరి నుంచి మార్చి లోపు మార్చుకోవాలని తేదీలు వేసి సూచించింది. ఇదే విషయాన్ని పోలీస్‌స్టేషన్లలో ఖాతాదారులు వివరించి చెప్పడంతో పాటు సంబంధిత చెక్కులు, బాండ్లు చూపించినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోతున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 6 వేల మంది ఖాతాదారులకు సంబంధించి రూ.90 కోట్ల విలువ చేసే చెక్కులున్నాయి. ఇక 2012లో అగ్రిగోల్డ్‌ సంస్థ 2 వేల మంది ఖాతాదారులకు ఇచ్చిన పరివార్‌ బాండ్లున్నాయి. అప్పట్లో లక్ష డిపాజిట్‌ చేస్తే 12 శాతం వడ్డీతో నెల నెలా వడ్డీ చెల్లించేలా అగ్రిగోల్డ్‌ ఈ పథకాన్ని నెలకొల్పింది. ఇందులో కూడా వేల మంది రూ.కోట్లు డిపాజిట్‌ చేశారు.

3 లక్షల మంది సమస్య
ఇక ఏపీ, తెలంగాణ పరిధిలో 3 లక్షల మంది ఖాతాదారుల వద్ద రూ.700 కోట్ల మేర చెక్కులు, రూ.600 కోట్ల మేర పరివార్‌ బాండ్లు ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో పెద్ద మొత్తంలో బాండ్లు, చెక్కులున్నట్లు సమాచారం. సీఐడీ ఇచ్చిన నివేదిక మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిధిలో 32 లక్షల మంది ఖాతాదారులకు రూ.6,350 కోట్లు అగ్రిగోల్డ్‌ చెల్లించాలని కోర్టుకు వివరించింది. వీటికి సంబంధించిన ఖాతాదారుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. సదరు వివరాలతో అగ్రిగోల్డ్‌ బాధితులు చూపిస్తున్న చెక్కులు, పరివార్‌ బాండ్ల వివరాలను సరి చూసుకుంటే సరిపోతుందని ఖాతాదారులు పేర్కొంటున్నారు. కానీ పోలీసులు అవేమీ పట్టించుకోకుండా 2014 డిసెంబర్‌ లోపు ఉన్న బాండ్లు, చెక్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అడ్డం తిరుగుతున్నారు.

చెక్కులు, పరివార్‌ బాండ్ల వివరాలు పరిగణనలోకి తీసుకోవాలి
అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించిన చెక్కులు, పరివార్‌ బాండ్లను 2014 డిసెంబర్‌ లోపే ఇచ్చింది. అయితే 2015 జనవరి నుంచి మార్చి వరకు పోస్ట్‌డేట్‌ వేసి చెక్కులు మార్చుకోవాలని స్పష్టంగా చెప్పింది. సంస్థ ఇచ్చిన చెక్కులు చూస్తే ఈ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పోలీస్‌స్టేషన్లలో అధికారులు ఈ వివరాలు నమోదు చేయడం లేదు. తక్షణం ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. – వి.మోజెస్‌ అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement