ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఒక ప్యాకెట్ కొంటే రెండు ఉచితం అంటూ ఖమ్మంనగరంలోని యూపీహెచ్ కాలనీలో నకిలీ సర్ఫ్ విక్రయిస్తున్న ఎనిమిది మందిని ఖమ్మం అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికు ల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం స్థానిక యూపీహెచ్ కాలనీ వీధుల్లో కొందరు సేల్స్‌మెన్‌లు తిరుగూ సర్ఫ్ విక్రయం చేపట్టారు. కంపెనీ ప్రచారం కోసమని, రూ.120 చెల్లించి ఒక కేజీ సర్ఫ్ కొంటే రెండు కేజీలు ఉచితంగా ఇస్తున్నామని విక్రయాలు చేపట్టారు. కాలనీలోని ఓ మెకానిక్ షెడ్డు వారు ఈ సర్ఫ్‌ను కొనుగోలు చేసి ప్యాకెట్ చింపి చేతులు కడుక్కునేందుకు యత్నించారు. కానీ సర్ఫ్ నురుగు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వారిని ఈ విషయంపై గట్టిగా ప్రశ్నించడంతో ‘తాము నెలకు రూ.5 వేల వేతనంపై సర్ఫ్ విక్రయిస్తున్నామని, తమకు ఏమీ తెలియదని పోలీసులకు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విజయవాడ కేంద్రంగా ఈ సర్ఫ్ తయారు చేస్తున్నట్లు తెలిసింది.
వీరిచ్చిన సమాచారం మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన కటుకూరి నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్థానికులు వారి వద్ద కొన్న సర్ఫ్‌ను తిరిగి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నారు. పోలీసులు ఈ ఎనిమిది మంది వద్ద రూ. 8వేల నగదుతో పాటు మూడు బస్తాల్లో ఉన్న 225 సర్ఫ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎస్సై గణేష్‌ను వివరణ కోరగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కటుకూరి నాగరాజును మాత్రమే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
సర్ఫ్ పేరుతో దగా..
Published Mon, Sep 30 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement