వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : అర్బన్ పరిధిలో దొంగతనాల నియంత్రణకు గతంలో చోరీలకు పాల్పడిన స్థానిక నేరస్తులను గుర్తించి, వారిపై నిఘా పెట్టాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు అర్బన్ పోలీసు అధికారులను ఆదేశించారు. అర్బన్ పోలీస్ విభాగ పనితీరుపై శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్బన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు హాజరైన ఈ సమావేశంలో ఆయూ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, కేసుల పరిశోధన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతితోపాటు, నేరస్తులు అరెస్టు చేయలేకపోవడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చే నెలలో మేడారం జాతరతోపాటు అర్బన్ పరిధిలో నిర్వహించే ఆగ్రహంపహాడ్, అమ్మవారిపేట, లింగంపల్లి గ్రామాల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరపై ఆయన సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. వచ్చే నెల రెండో తేదీన జిల్లాలో నిర్వహించే వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షకు అర్బన్ పరిధిలో ఏర్పాటు చేసిన 200 కేంద్రాల్లో సుమారు 81 వేల మంది హాజరుకానున్నారని, ఇందుకోసం అధికారులు తమ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించడంతోపాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్దేశించిన సమయాల్లో చేరేందుకు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
రాబోయే ఎన్నికలను అర్బన్ పరిధిలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత విభాగం అధికారులకు కావాల్సిన సమాచారం అందజేయడంతోపాటు అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. అనంతరం శాంతిభద్రతలను సమీక్షిస్తూ మహిళలపై దాడులకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ బి. ఉమమహేశ్వర్‌రావు, డీఎస్పీలు మల్లారెడ్డి, రాజిరెడ్డి, ప్రకాశ్‌రావు, రవికుమార్, రమేశ్, ట్రైనీ డీఎస్పీ శిరీషారాఘవేందర్ పాల్గొన్నారు.
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
Published Sun, Jan 26 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement