
బాధితుడు నాగముని చెంపపై కనిపిస్తున్న పోలీసు బూటు ముద్ర
సాక్షి, పుట్లూరు: అమాయకుడిపై పోలీసు అధికారి ప్రతాపం చూపిన ఘటన వెలుగు చూసింది. పోలీసుస్టేషన్‌లో అదుపులో ఉన్న యువకులను కిటికీలోంచి తొంగి చూశాడన్న నెపంతో లోనికి పిలిచి ముఖంపై బూటు కాలితో మూడుసార్లు తన్నడంతో బాధితుడు అవమానభారంతో కన్నీటిపర్యంతమయ్యాడు. అకారణంగా తనపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. వివరాల్లోకెళ్తే... పుట్లూరు మండలం అరకటివేముల ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ తనపై శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారని శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాలనీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చారు.
తొంగి చూడటమేమైనా నేరమా..?
దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను విచారణ నిమిత్తం తీసుకొచ్చారని తెలిసి అదే కాలనీకి చెందిన నాగముని అనే దళితుడు స్టేషన్ వద్దకు వచ్చాడు. యువకులను ఉంచిన గదిలోకి నేరుగా వెళ్లకుండా కిటికీలో నుంచి చూస్తున్న నాగమునిని పోలీసులు గమనించి.. లోనికి పిలిపించారు. అనుమతి లేకుండా కిటికీలోంచి ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా.. తమ గ్రామస్తులను చూడటానికి వచ్చానని చెప్పాడు. అంతే.. ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. మద్యం తాగి లోపలికి వస్తావా అంటూ బూటుకాలితో నాగముని ముఖంపై తన్నారు. అలా మూడుసార్లు తన్నారు. తనేమీ నిందితుడు కాకపోయినా.. దురుసుగా మాట్లాడకపోయినా తన్నడాన్ని నాగముని అవమానంగా భావించాడు. తన ముఖంపై పడిన బూటు ముద్రను విలేకరులకు చూపుతూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తనపై అకారణంగా దాడిచేసిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాడు.
డీఎస్పీ విచారణ
అమాయకుడిపై పోలీసు బూటుకాలితో తన్నిన ఘటన గురించి మీడియాలో రావడంతో తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు శనివారం సాయంత్రం అరకటివేముల ఎస్సీ కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పుట్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసు సిబ్బందితో సమావేశమై ఘటనకు సంబంధించి ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment