అమెరికా: అమెరికాలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని తన ముగ్గురు కుమారులపై కనికరం లేకుండా కాల్పులు జరిపి కడతేర్చాడు. అంతకంటే ముందు అతని దురుద్దేశాన్ని గ్రహించిన ఆ పిల్లల తల్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. అతని కుమార్తె మాత్రం ఎలాగోలా అక్కడి నుండి బయటపడిన ప్రాణాలు దక్కించుకుంది. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అందరినీ ఒకేచోట..
ఓహియో ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల చాడ్ డోర్ మాన్ తన ముగ్గురు మగ పిల్లలను నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపాడు. వారి వయసులు 3, 4, 7 సంవత్సరాలు. మొదట ఇద్దరిని కాల్చి చంపగా మూడో కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ తండ్రి అతడిని విడిచిపెట్టలేదు. పొలాల్లోకి వెళ్లి కుమారుడిని వెంటాడి మరీ పట్టుకుని తీసుకొచ్చి అదే ఇంట్లో కాల్చి చంపాడు. అంతకుముందే పిల్లల తల్లి వారిని చంపవద్దని వారించినందుకు ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. ఆమె అక్కడే కుప్పకూలింది.
ప్లాన్ ప్రకారమే..
ఇంతటి ఘోర మారణకాండను కళ్లారా చూసిన కుమార్తె మాత్రం బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. మా నాన్న అందరినీ చంపేస్తున్నాడని చుట్టుపక్కలవారికి సమాచారం అందించింది. దీంతో స్థానికులు పోలీసులకు కబురు పెట్టగా వారు వచ్చి అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో డోర్ మాన్ ఎప్పటినుంచో పిల్లలను చంపాలనుకుంటున్నట్లు, ప్రణాళిక ప్రకారమే వారిని చంపినట్లు తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment