
హత్యకు గురైన మహేంద్రసింగ్ (ఫైల్)
నెల్లూరు (క్రైమ్): జిల్లాలో సంచలనం రేకెత్తించిన రాజస్థాన్ వ్యాపారి మహేంద్రసింగ్ హత్య కేసులో చిక్కుముడిని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇది కిరాయి హత్యేనని తమ విచారణలో తేల్చిన పోలీసులు సూత్రదారిని అదుపులోకి తీసుకుని పాత్రదారుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) ఈ నెల 3వ తేదీన తుపాకీలతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. రాజ్‌పురోహిత్ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు.
ఫత్తేఖాన్‌పేట రైతుబజారు సమీపంలోని అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్న ఆయన తన కుమార్తె కోమల్ పేరుతో సంతపేటలో, ఫత్తేఖాన్‌పేటలో, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ పేరిట దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్‌పురోహిత్ చూస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూతవేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఆయనపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు
హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. తొలుత నగదు కోసం దుండగలు హత్య చేశారా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్య జరిగిన సమయంలో మృతుడి వద్ద రూ. 1.50 లక్షలు నగదు ఉండడంతో నగదు కోసం కాదని నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో ఆయన బావమరిది ఆత్మహత్య చేసుకోగా, మృతిపై అనుమానాలు ఉన్నాయనీ మహేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ఈ హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలోని స్థానిక సర్పంచ్‌తో గొడవలు పడేవారని ఈ నేపథ్యంలో ఏమైనా హత్య జరిగి ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తమవడంతో ఆ దిశగా సైతం విచారణ చేపట్టారు. మృతుడి సెల్‌ఫోను కాల్ డిటైల్స్‌ను పరిశీలించారు. బిహార్‌కు చెందిన వ్యక్తితో గొడవలు ఉన్నాయని తేలడంతో అతన్ని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో విచారణ చేపట్టినా ఎక్కడా చిన్నపాటి ఆధారాలు కూడా పోలీసులకు చిక్కలేదు.
లోతైన దర్యాప్తులో వీడిన చిక్కుముడి
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను విచారించే క్రమంలో మృతుడి సమీప బంధువు ఒకరు పొంతన లేని సమాధానాలు చెబుతుండటతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఈ కేసులోని చిక్కుముడి దాదాపుగా వీడిపోయినట్లు సమాచారం. ఆస్తి విషయాల్లో నెలకొన్న విభేదాలే హత్యకు దారితీసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయంలో పలుమార్లు హతుడు తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, స్వగ్రామంలోని ఆస్తిని పంచకుండా అడ్డుకుంటున్నాడని, మరో కారణంతో మహేంద్రసింగ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిందితుడు నిశ్చయించుకున్నట్లు తెలిసింది. నిందితుడు రాజస్థాన్‌లోని తన స్నేహితులతో కలిసి మహేంద్రసింగ్ హత్యకు పథక రచన చేసినట్లు, హత్యకు రూ.8 లక్షలు కిరాయి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. దీంతో నిందితుడి స్నేహితులు (హంతకులు) రెక్కీ వేసి మహేంద్రసింగ్‌ను ఈ నెల 3వ తేదీ రాత్రి తుపాకీతో కాల్చిచంపినట్లు తెలిసింది.
కిరాయి హంతకుల కోసం గాలింపు
మహేంద్రసింగ్‌ను హత్య చేసిన కిరాయి హంతకుల కోసం ప్రత్యేక బృందాలు రాజస్థాన్, ముంబైల్లో గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద హత్య కేసులో చిక్కుముడి దాదాపు వీడడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులను వివరణ కోరగా వారు ధ్రువీకరించలేదు. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment