అక్రమ అరెస్టును నిరసిస్తూ అర్ధరాత్రి పోలీసుస్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణుల ధర్నా
అనంతపురం న్యూసిటీ: ఓటమి భయంతో టీడీపీ నేతలు పోలీసులను అస్త్రంగా చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినా తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే జన్మభూమి గ్రామసభలో ప్రజల తరపున నిలిచిన వైఎస్సార్‌సీపీ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కనీస విచారణ చేపట్టకుండా.. ఎస్పీకి వాస్తవాలు తెలియకుండా.. ఉన్నఫళంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం చూస్తే టీడీపీ కుట్ర స్పష్టంగా అర్థమవుతోంది. పైగా శని, ఆదివారాలతో పాటు పండగ సెలవుల దృష్ట్యా బెయిల్‌కు అవకాశం లేకుండా చేయడం చూస్తే టీడీపీ ముఖ్యనేత ఒత్తిళ్లకు ఏ స్థాయిలో తలొగ్గారో ఇట్టే తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోగటం శ్రీదేవి ప్రజా సమస్యలపై మాట్లాడారు.
ఆ డివిజన్‌కు ఎలాంటి సంబంధం లేని కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి జోక్యం చేసుకుని గతంలో పింఛన్ తీసుకునే వారంతా దొంగలని సంబోధించాడు. దీనిపై జన్మభూమి కార్యక్రమంలో ఉన్న కోగటం విజయభాస్కర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. కార్పొరేటర్ అడిగిన ప్రశ్నలకు జావాబుదారీగా ఎమ్మెల్యే, మేయర్ సమాధానమివ్వాలని, నీవెందుకు జోక్యం చేసుకుంటున్నావని నిలదీశారు. ఈ క్రమంలో త్రీటౌన్ సీఐ బాలమద్దిలేటి, ఎస్సై క్రాంతికుమార్ ‘కోగటం’ను అడ్డుకుని బయటకు పంపారు. సాయంత్రం కోగటం విజయభాస్కర్‌రెడ్డి తన వ్యక్తిగత పని మీద మూడో రోడ్డులో ఉన్న ఆడిటర్ గంగిరెడ్డిని కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి అనుచరులు మిస్సమ్మ కాలనీ నాగరాజు, గోవిందు.. ‘‘లక్ష్మిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. కోగటం డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే కోగటం పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఆయన అనుచరుడు రవి మూడో రోడ్డు మీదుగా ఆడిటర్ వద్దకు వెళ్లబోయాడు. మార్గమధ్యంలో మిస్సమ్మ కాలనీ నాగరాజు, గోవిందు(తప్పతాగి ఉన్నారు) రవిపై కర్రతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఫిర్యాదుకెళితే దుర్భాషలు
కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, వారి అనుచరుల గొడవ నేపథ్యంలో కోగటం ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఎస్సైలు జయపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనంతరం కోగటం తన భార్య కార్పొరేటర్ కోగటం శ్రీదేవితో కలసి కేసు నమోదుకు త్రీటౌన్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొనే ప్రయత్నం చేయగా సీఐ బాలమద్దిలేటి ‘‘ఏయ్ లెయ్ ఫస్ట్. నీవేం రౌడీషీటర్‌లా వ్యవహరిస్తున్నావ్. ఏమనుకున్నావ్’’ అంటూ దుర్షాషలాడారు. కోగటం దంపతులు తాము ఫిర్యాదు చేసేందుకు వచ్చామని, మీకు ఇష్టం లేకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పగా సీఐలు రాజశేఖర్, ఆరోహణరావు, ఎస్సై క్రాంతికుమార్ కోగటం విజయభాస్కర్ రెడ్డిని నోటికొచ్చి నట్లు మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో కోగటం శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
రాత్రికి రాత్రి అట్రాసిటీ కేసు
టీడీపీ వర్గీయుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కోగటం విజయభాస్కర్‌రెడ్డిపై కుట్రపూరితంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కనీస విచారణ చేపట్టకుండానే పోలీసులు ఇలాంటి కేసు నమోదు చేయడం వెనుక టీడీపీ ముఖ్య నేత హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాత్రికి రాత్రి పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఇదిలాఉంటే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు అనంత వెంకటరామిరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, వైటీ శివారెడ్డి, పెన్నోబిలేసు, వెన్నపూస రవీంద్రారెడ్డి, శ్రీదేవి తదితరులు పోలీసుస్టేషన్‌కు చేరుకొని త్రీటౌన్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment