సాక్షి, గుంటూరు: క్రమ శిక్షణకు మారు పేరుగా చెప్పుకునే పోలీస్‌శాఖలో కొందరి కారణంగా ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మద్యం తాగితే గుట్టు చప్పుడు కాకుండా ఉండాల్సిన కొందరు పోలీసులు, హోంగార్డులు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి దాడులకు యత్నించడం, ఘర్షణలకు పాల్పడటం లాంటి సంఘటనలు కారణంగా పోలీసులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. గడిచిన రెండు నెలల్లో జిల్లాలోని గుంటూరు, వినుకొండ, నరసరావుపేట పట్టణాల్లో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాజధాని జిల్లాలోనే పోలీసులు క్రమశిక్షణ పాటించక పోవడంపై ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, ఆర్ జయలక్ష్మిలు సీరియస్‌గా పరిగణిస్తూ సస్పెండ్‌లు చేస్తున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రాక పోవడం విచారకరం.
సస్పెండ్‌లు కొనసాగిందిలా...
రెండు నెలల వ్యవధిలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించిన కానిస్టేబుళ్లను వరుసగా ఎస్పీలు సస్పెండ్ చేస్తూ వచ్చారు. గుంటూరులో గాడ్జిల్లా గ్లాసులు రోడ్డు పక్కన విక్రయించే చిరు వ్యాపారి వద్దకు ఓ కానిస్టేబుల్ మద్యం తాగి వెళ్లి డబ్బు ఇవ్వకుండా గాడ్జిల్లా గ్లాసు సెల్‌ఫోన్‌కు వేయాలంటూ దుర్బాషలాడిన సంఘటనపై అర్బన్ ఎస్పీ విచారణ చేపట్టి అతనిని సస్పెండ్ చేశారు. ఇటీవల మరో కానిస్టేబుల్ పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగి విధులకు హాజరైన కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు.
నరసరావుపేటలో అర్ధరాత్రి దాటాక కూడా బార్‌లో మద్యం తాగేందుకు అనుమతించాలంటూ బారు యజమానిపై దాడికి యత్నించిన సంఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం వినుకొండలో ఓ ప్రయివేటు ఫంక్షన్‌కు హాజరైన కానిస్టేబుళ్లు, హోంగార్డులు మద్యం సేవిస్తూ ఘర్షణకు పాల్పడటం ఆపై సీఐకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోక పోగా సీఐ చిన్నమల్లయ్య తనను దుర్బాషలాడారంటూ హోంగార్డు స్వేచ్చా కుమార్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఎస్పీ జయలక్ష్మి నరసరావుపేట డీఎస్పీని ఆదేశించారు.
పోలీస్‌బాస్‌లు గస్తీలపై దృష్టి సారించాలి...
రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న గస్తీలపై పోలీస్‌బాస్‌లు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పోలీస్‌శాఖలోని ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు బాధ్యతలను కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అప్పగించి వెళుతుండటంతో వారు కూడా రికార్డుల్లో సంతకాలకు పరిమితం కావడంతో రాత్రి తనిఖీల్లో కొందరు కానిస్టేబుళ్లు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటేనే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment