
తివ్వాకొండల నుంచి దిగి వస్తున్న కూంబింగ్ పార్టీలు
శ్రీకాకుళం, భామిని: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సాయుధ పోలీసు బలగాల బూట్లు చప్పుడుతో దద్దరిల్లుతున్నాయి. ఏవోబీలో కీలకమైన సరిహద్దు తివ్వాకొండల్లో ఎస్‌టీఎఫ్, గ్రేహాండ్స్ దళాలతో జల్లెడ పడుతున్నారు. అరకులో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను బహిరంగంగా మావోయిస్టులు కాల్చివేసిన నేపథ్యంలో అప్రమత్తమై కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఒడిశా సరిహద్దు నుంచి తప్పించుకున్న మావోయిస్టులు సేఫ్టీ జోన్‌లోకి సురక్షితంగా చేరుకుంటున్నారనే సమాచారంతో ప్రత్యేక దళాలు చుట్టుముడుతున్నాయి.
సాయుధ పోలీసు బలగాల మోహరింపుతో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు పోలీసు స్టేషన్లకు గిరిజన ప్రాంతాల నుంచి సానుభూతిపరులను రప్పించి మావోల కదలికలపై ఆరా తీస్తున్నారు. కొండ ప్రాంతాలకు కొత్తగా వస్తున్న అనుమానిత వ్యక్తులపై వాకబు చేస్తున్నారు. రోజూ కూంబింగ్ పార్టీలు గిరిజన గూడల దాటి వెళ్తుండటంతో పోడు వ్యవసాయానికి కూడా వెళ్లడానికి గిరిజనులు భయపడుతున్నారు. ఏ క్షణమైనా ఉపద్రవం రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment