
చిక్కారు.. పారిపోయారు..
- పోలీసుల అదుపులో నుంచి పరారైన గంజాయి రవాణాదారులు
- ఇద్దరిని నైజీరియన్లుగా గుర్తించిన పోలీసులు
- సెల్‌లో నుంచి ఉడాయించి కారు డ్రైవర్
- బయటపడిన పోలీసుల అసమర్థత
దొరవారిసత్రం : గంజాయి తరలిస్తూ కారుతో సహా పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నైజీరియన్లతో పాటు కారు డ్రైవర్ సీమురగన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. జాతీయ రహదారిపై కారు అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించిన కొందరు స్థానిక ఎస్సై జీ సుబ్బారావుకు సమాచారం అందించారు. ఎస్సై స్టేషన్‌లో అందుబాటులో లేకపోవడంతో ఏఎస్సై, కానిస్టేబుళ్లు గ్రామస్తుల సాయంతో చెన్నై వైపు వెళ్తున్న చావర్లెట్ కారు (టీఎన్07 ఏయూ 2236)ను ఆపి తనిఖీలు చేపట్టారు.
అందులోని వారు పరదేశీయులుగా గుర్తించిన పోలీసులు కారు డిక్కీలో గంజాయి బస్తాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారు డ్రైవర్‌తో పాటు, ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుని కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు నైజీరియన్లను సెల్ వేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని స్టేషన్ బయటనే కూర్చోబెట్టారు. ఇంతలో పోలీసుల కళ్లు కప్పి అటూ ఇటూ తిరుగుతూ కారు లో ఉన్న వారి పాస్‌పోర్టులను తీసుకుని పోలీ సులు, స్థానికులు చూస్తుండగానే పరుగులు తీసి పారిపోయారు. వారి పట్టుకునేందుకు స్థానిక యు వకులు వెంబడించినా ఫలితం లేకుండాపోయిం ది. నిందితులు పెళ్లకూరు, నాయుడుపేట వైపు వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చునని స్థాని కులు భావిస్తున్నారు. అయితే పోలీస్‌స్టేషన్ సెల్ లో ఉన్న కారు డ్రైవర్ మురగన్ కూడా పోలీసుల కళ్లు కప్పి మరి కొద్ది క్షణాలకే పారిపోయాడు.
విశాఖ నుంచి చెన్నైకు..
విశాఖపట్నం నుంచి చెన్నైకు గంజాయిని తరలిస్తున్నట్లు కారు డ్రైవర్ మురగన్ పోలీసులకు తెలిపాడు. నైజీరియన్లు ఇద్దరు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచానూర్‌లో కేఎస్‌ఆర్ కళాశాలలో చదువుతున్నట్లు కారు డ్రైవర్ చెప్పినట్లు తెలిసింది. పట్టుబడిన వీరిని పోలీసుల పూర్తిస్థాయిలో విచారించి ఉంటే గంజాయి రాకెట్ గుట్టురట్టు అయి ఉండేది. పోలీసుల అసమర్థ వల్లే పట్టుబడిన గంజాయి రవాణాదారులు పరారీ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కారులో రెండు బస్తాల్లో గంజాయి ఉంది. ఎన్ని కేజీలు ఉంటాయో కూడా పోలీసులు ఇంత వరకు గుర్తించలేదు.