పోలీస్ ఫైట్ | police fight | Sakshi
Sakshi News home page

పోలీస్ ఫైట్

Published Sat, Sep 28 2013 5:00 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

police fight

 వరంగల్, న్యూస్‌లైన్
 పోలీస్ శాఖలో రెండు బ్యాచ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది. వీరి మధ్య విభేదాలు రచ్చకెక్కారుు. 1991 బ్యాచ్‌కు చెందిన ఓ అధికారి సీఐగా, డీఎస్పీగా రెండుసార్లు యాగ్జిలరీ పదోన్నతి పొందారు. ఆయన చేసిన ఒకే ఎన్‌కౌంటర్‌ను రెండుసార్లు చూపించి, రెండుసార్లు యాగ్జిలరీ ప్రమోషన్లు తీసుకున్నారని ఆరోపిస్తూ 1989 బ్యాచ్‌కు చెందిన సీఐలు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలను కలిసి ఫిర్యాదు చేశారు. తాము కూడా పదోన్నతికి అర్హులమేనని విన్నవించారు. అరుుతే, తన యాగ్జిలరీ పదోన్నతిపై ఫిర్యాదు చేశారన్న ఆక్రోశంతో 1991 బ్యాచ్ డీఎస్పీ 1989 బ్యాచ్‌పై కక్ష కట్టారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నతాధికారులను బతిమిలాడుకుని పరకాల డీఎస్పీగా వచ్చిన ప్రభాకర్‌ను కేవలం 41 రోజుల్లోనే బదిలీ చేయించడం, ఆ స్థానంలోకి తన బంధువునే తీసుకురావడంలో ఆ డీఎస్పీ కీలకంగా వ్యవహరించి సీనియర్ బ్యాచ్‌కు సవాల్ విసిరారు. దీంతో విభేదాలు మరింత ముదిరాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలంతా ఏకమయ్యారు. ఏసీబీ కేసులుండడంతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను కోరుకున్న చోటుకు బదిలీ చేస్తున్నారని, ఎలాంటి కేసులు లేని వారికి కనీసం పదోన్నతి కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్న వివాదానికి తెరలేపారు. ఇక్కడ మొదలైన లొల్లి ఫిర్యాదుల పరంపరకు దారితీసింది. 1989 బ్యాచ్‌లో ఏడుగురు సీఐలు, 1991 బ్యాచ్‌లో ఆరుగురు సీఐలతో పాటు పలువురు పోలీసులు ఉన్నతాధికారులను కలిసి పోలీసు శాఖలో కొందరి అక్రమాస్తులు, యూగ్జిలరీ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు.
 
 ఆస్తులెంత... ఎక్కడెక్కడ
 పక్క జిల్లాలో లూప్‌లైన్‌లో ఉన్న డీఎస్పీతో పాటు మరో ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలపై ఆధారాలతో ఉన్నతాధికారులకు వివరించారు. గతంలో వారు పనిచేసిన ప్రాంతాల్లో ఏసీబీ కేసులు, మద్యం ముడుపుల వ్యవహారంలో లింకులు, తప్పించుకున్న తీరుపై వివరంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు డీఎస్పీ, సీఐలపై రహస్య విచారణ మొదలుపెట్టారు. వరంగల్, హసన్‌పర్తి, మామునూర్, మడికొండ ప్రాంతాలతో పాటు, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్ ప్రాంతాల్లో కొందరు పోలీసు అధికారులు కొనుగోలు చేసిన ఎకరాల కొద్దీ భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఎల్కతుర్తి శివారులో ఏకంగా నలుగురు పోలీస్ అధికారులు ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసిన విషయం విచారణలో తేలింది. వీరికి బినామీలు సైతం ఉన్నట్లు గుర్తించారు.
 
  అంతేకాకుండా ప్రధాన నగరాల్లో వ్యాపారులు, ఇళ్లు, ప్లాట్ల స్థలాలపై సైతం దృష్టి పెట్టారు. మద్యం ముడుపులు, ఏసీబీ కేసుల్లో ఉన్న ఈ పోలీసు అధికారులు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని, కానీ... వారికే మంచి పోస్టింగ్‌లు కల్పిస్తున్నారని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో క్రైం మీటింగ్‌లోనే పోలీసుల పనితీరును గుర్తించి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. డబ్బుల సంచులు పట్టుకుని రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’ అని ఓ సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉన్నతాధికారులే పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మాలాంటి వాళ్లకు పోస్టింగ్ రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్. పరిస్థితులకనుగుణంగా మేం కూడా దిగజారాల్సి వస్తోంది..’ అంటూ మరో సీఐ చెప్పారు. 1999 నుంచి 2007 వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలు, ఎస్సైలు ప్రధాన స్టేషన్లలో పాగా వేశారు. కానీ, ఇప్పుడు వారి మధ్య అంతర్గత పోరుతో వర్గాలుగా వీడిపోయి చివరకు అక్రమ ఆస్తుల బండారాలను బయటపెట్టుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పుడిదే హాట్ టాపిక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement