![Police Get Weekly Off In Coming YSRCP Government Promised Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/26/pol.jpeg.webp?itok=3O6aPWNg)
సాక్షి, కడప అర్బన్/ ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులందరికీ వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. వారం రోజుల పాటు విధుల్లో అలసిపోయిన ఉద్యోగులు ఆదివారం రోజు భార్యా పిల్లలతో పార్కులకు, ఇతర వినోద ప్రదేశాలకు వెళ్లి సంతోషంగా గడుపుతారు. పోలీసు ఉద్యోగమంటేనే కత్తి మీద సాము లాంటిది. ఉదయం ఇంటి నుంచి స్టేషన్‌కు బయలుదేరితే రాత్రి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. బందోబస్తు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు ఎన్ని రోజులకు తిరిగి వస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇలా రాత్రనక, పగలనక విధులు నిర్వహించే పోలీసులకు వీక్లీహాఫ్(వారాంతపు సెలవు)లు లేవంటే వినేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది.
అయినా ఇది నిజం. ఆఫీసర్ స్థాయిలో ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లే అవకాశం ఉంటుందేమో.. కానీ కింది స్థాయిలో ఉన్న పోలీసులకు మాత్రం వీక్లీ హాఫ్‌లు ఉండవు. వారికున్న సెలవులు పెట్టుకుంటామన్నా ఒక్కోసారి ఉన్నతాధికారి నుంచి అనుమతి రాదు. వీక్లీహాఫ్‌లు లేకపోవడంతో పోలీసులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పోలీసుల కష్టాలను చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి వీక్లీహాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇస్తూ జీవో జారీ చేస్తామని సోమవారం తాడిపత్రిలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. జగన్ ప్రకటనతో పోలీసు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక మిగతా ఉద్యోగుల మాదిరే తాము కూడా వారంలో ఒక రోజు భార్యా పిల్లలతో సంతోషంగా గడిపేయచ్చని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ముఖ్యమైన పనికి పోలీసుల అవసరం ఉంటుంది. పోలీసులు లేనిదే ఏ కార్యక్రమం ముందుకు సాగదు. అయినా ప్రభుత్వం వారి సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు. వారి కష్టాలను చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీక్లీహాఫ్ ఇస్తామని ప్రకటించడంతో పోలీసు సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న సివిల్ విభాగంలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐ స్థాయి వరకు వున్న సిబ్బంది దాదాపు 3200 మంది, ఏఆర్ విభాగంలో 1800 మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment