ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు : జిల్లాలో మట్కా, పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇటీవల ఎక్కువైంది. వీటిని అరికట్టకుండా కొందరు పోలీసులు..జూదరులకు సహకరిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లతో జతకడుతున్నారు. పోలీసుల పనితీరు విషయంలో ఎస్పీ ఫక్కీరప్ప గట్టిగా వ్యవహరిస్తున్నా కొందరు ఎస్‌ఐలు, సీఐలు..అక్రమార్జన కోసం గాడి తప్పుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు. వీరిపై ఎస్పీకి ఇటీవల ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బనగానపల్లె సర్కిల్ విషయంలో ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ కొందరు ఎస్‌ఐలు ఏకంగా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో స్టేషన్‌కు నెలకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ మామూళ్లు వస్తున్నట్లు సమాచారం. ఫలితంగా మట్కారాయుళ్లు చీటీలు రాస్తున్నా, వారు ఎక్కడ రాస్తున్నారనే కచ్చితమైన సమాచారం ఉన్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి..
పంచాయితీలు ఎక్కువే..
బనగానపల్లె సర్కిల్‌లోని పోలీసులపై ఇతర ఆరోపణలు కూడా అధికంగానే ఉన్నాయి. చనుగొండ్ల గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందితే పంచాయితీ చేయగా.. ఎస్‌ఐకి రూ.60వేలు ముట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఓ రైస్‌మిల్లు వ్యాపారి చౌక బియ్యాన్ని మిల్లులోకి సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారు. మిల్లు తనిఖీ చేయకుండా రూ.50వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత నెల 17న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే కేసు నమోదైన తర్వాత సెక్షన్ మార్చేందుకు రూ.50వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రామాపురానికి చెందిన ఓ మట్కా బీటర్ నుంచి రూ.60వేలు..బనగానపల్లె సర్కిల్ కార్యాలయానికి ముట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను ఓ కానిస్టేబుల్ ద్వారా బీటర్ చేర్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా మట్కా జోరు..
కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా మట్కా నడుస్తోంది. గతంలో రతనాల్ మట్కా.. వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి ఆన్‌లైన్‌లో వస్తాయి. ఇవి కాకుండా కర్నూలులో కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఉత్కంఠతో వేచి చూస్తుంటారు.
కర్నూలు వన్‌టౌన్, త్రీటౌన్‌లో పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం ఇక్కడి పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, ఫోర్త్ టౌన్ స్టేషన్లలో కూడా మట్కా నడుస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడి కానిస్టేబుళ్లు ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్నారు. దీంతో బీటర్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. సీఐలు ఆరా తీసిన సందర్భాల్లో కానిస్టేబుళ్లు కచ్చితమైన సమాచారం కూడా స్టేషన్‌కు ఇవ్వడం లేదు. ఈ ఊబిలో కూరుకుపోయిన వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు, మహిళలు కూడా ఉన్నారు.
యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్
క్రికెట్‌బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలులో కూడా బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఇండియా టీ–20 సిరీస్ మొదలైంది. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు జోరు పెంచారు. ఆదివారం ఇండియా–బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌పై బెట్టింగ్ వేసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ. 25లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు.
క్రికెట్ బెట్టింగ్ ఊబిలో స్టూడెంట్స్ కూడా చిక్కుకుపోయారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించడంతో చాలామంది కోచింగ్‌సెంటర్లకు వెళుతున్నారు. ఫీజుల పేరుతో భారీగా తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వీరు బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లపై పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మొక్కుబడిగా కొందరిని అరెస్టు చేయడం మినహా బుకీలు, సబ్‌బుకీలపై పోలీసులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పేకాట కూడా జోరుగా నడుస్తోంది. క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో వీరంతా కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్నారు.
సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ ప్రాంతాల్లో కూడా బంకీని కడుతున్నారు. చూసేవాళ్లకు విహారయాత్రకు వెళ్లినట్లు అన్పించినా వారు వెళ్లేది పేకాటకు. వీరంతా లక్ష నుంచి రూ. 2 లక్షల బ్యాంక్ వరకూ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఎస్పీ గట్టిగానే ఉన్నారు. చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు ధనార్జనే ధ్యేయంగా అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారు. వీరికి ఎస్పీ కళ్లెం వేయకపోతే మరింత పెరిగి, నేరాలు పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment