మైనర్ బాలికపై హోంగార్డు అత్యాచారం..
మైనర్ బాలికపై హోంగార్డు అత్యాచారం..
Published Tue, Jul 18 2017 9:38 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
♦ హోంగార్డుపై నిర్భయ, అట్రాసిటీ తదితర పలు కేసులు నమోదు
మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రక్షించాల్సిన ఓ పోలీసే మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జిల్లాలోని మండపేటలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితునితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు మహిళలపైనా కేసులు నమోదు చేశారు. కె గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన పంపన రామకృష్ణ మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
విజయనగరం జిల్లా కురిపెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక ఈ నెల 8వ తేదీన మండలంలోని ఏడిదలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు రాత్రి ఏడు గంటల సమయంలో మండపేటకు చేరుకుంది. అప్పటికే మండపేట బస్టాండులో ఉన్న సత్య, కృష్ణవేణి అనే ఇద్దరు మహిళలు బాలిక వద్దకు వచ్చి ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్లలేవని, రాత్రికి తమ ఇంటి వద్ద ఉండి ఉదయాన్నే వెళ్లిపోదువుగానంటూ నమ్మించి పార్థసారథి నగర్‌లోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఏసమ్మ అనే మహిళ ఇద్దరు యువకులను వెంటబెట్టుకుని తీసుకువచ్చి వారితో వెళ్లమని బలవంతం చేసింది. తర్వాత కొద్దిసేపటికి హోంగార్డు రామకృష్ణ వారి ఇంటికి చేరుకున్నాడు.
సత్య అనే మహిళతో కలిసి బలవంతంగా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తర్వాత ఇంటికి తీసుకువచ్చి రెండు రోజులుపాటు బాలికను ఇంట్లోనే నిర్బంధించారు. ఆమె ఏడుపు విని పక్కంటి వారు తలుపుతీయడంతో తప్పించుకొని జరిగిన సంఘటనను బంధువులకు తెలిపింది. ఈ విషయాన్ని చర్చి ఫాదర్ ప్రేమ్ కుమార్‌కు తెలిపి ఆయన సహకారంతో ఆదివారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ గీతా రామ కృష్ణ ప్రధాన నిందితునిగా ఉన్న రామకృష్ణపై అత్యాచారం, నిర్భయ, అట్రాసిటీ తదితర కేసులు నమోదు చేశారు. బాలికను నమ్మించి వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించిన సత్య, కృష్ణవేణి, ఏసమ్మలపైన కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిమిత్తం బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement