తిరుపతి రూరల్: నేను చెప్పిందే వేదం. చేసిందే శాసనం. ఎన్నికల కోడ్ ఉంటే నాకేంటి? అంటున్నారు చిత్తూరు జిల్లా పోలీసు బాస్. ఎన్నికల నియామావళిని తుంగలో తొక్కి మౌఖిక ఆదేశాలతోనే ఓ ఎస్‌ఐని బదిలీ చేసి అధికార పార్టీపై తనకు ఉన్న స్వామి భక్తిని చాటుకున్నారు. రెండు గంటల్లోనే ఉన్నచోటు నుంచి రిలీవ్ చేసి ఇతర విధులకు పంపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పూర్వాపరాలు విశ్వసనీయం సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలంలోని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కోట్లాది రూపాయల నగదును సిద్ధం చేయాలని టీడీపీ నిర్ణయించింది.
ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తనిఖీల్లో నగదు పట్టుబడకుండా ఉండేందుకు ఎస్కార్ట్‌గా వెళ్లాలని కింది స్థాయి సిబ్బందిని పీలేరు రూరల్ సీఐ ఆదేశించారు. అయితే తమ ఉద్యోగాలు పణంగా పెట్టి ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు వారు నిరాకరించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన తానే స్వయంగా టీడీపీ నగదుతో ఉన్న ఇన్నోవా వాహనంలో కూర్చుని టీడీపీ గ్రామస్థాయి ఇళ్లకు చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నగదు ఉన్న వాహనంలోనే సీఐ ముందు సీట్లో కూర్చుని ఉండటం గమనించిన వైఎస్సార్‌సీపీ యువత ఆ వాహనాన్ని వెంబడించారు.
వారు ఒకరు, ఇద్దరు మాత్రమే ఉండటంతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. టీడీపీ నగదు తరలింపును పూర్తి చేసుకుని స్టేషన్‌కు వచ్చిన సీఐ, ఎర్రావారిపాళెం ఎస్‌ఐ కృష్ణయ్యను తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు, ఈ పని తాను స్వయంగా చెప్పింది కాదని, పోలీసు బాసు ఆదేశంతోనే చేయమన్నానని అన్నట్లు తెలిసింది. పోలీసు బాస్, ఎస్‌బీ డీఎస్పీ చెప్పినా తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించనని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని పణంగా పెట్టలేనని కృష్ణయ్య తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో సీఐ కేఎన్ మూర్తి చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌కు ఫిర్యాదు చేసి ఎస్‌ఐ కృష్ణయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
నా దృష్టికి రాలేదు: ఆర్‌ఓ
ఎర్రావారిపాళెం ఎస్‌ఐ కృష్ణయ్యను చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ బదిలీ చేసినట్లు తన దృష్టికి రాలేదని చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉన్నా...
ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని శాఖల పాలనపరమైన అంశాలు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పరిధిలోనే వెళ్లిపోతాయనేది జగమెరిగిన సత్యం. కానీ చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోడ్‌ను తుంగలో తొక్కారు. ఎస్‌ఐ కృష్ణయ్యను నోటిమాటతో బదిలీ చేస్తూ ఏఆర్ డీఎస్పీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని ఎస్‌ఐ కృష్ణయ్య జీడీ ఎంట్రీలో రాశారు. అక్కడ నుంచి అతన్ని మదనపల్లి నుంచి ఖైదీలకు ఎస్కార్ట్‌గా వెళ్లమని ఆదేశించినట్లు సమాచారం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రజాసంఘాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment