మహిళను బలవంతంగా వాహనం లోకి ఎక్కిస్తున్న పోలీసులు
మంత్రి పరిటాల సునీతకు తన రాజకీయ జీవితంలో చవిచూడని ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆర్భాటంగా ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం నిర్వహించాలనుకున్న ఆమెకుఅడుగడుగునా అడ్డుంకులే ఎదురయ్యాయి. ఆదివారం తోపుదుర్తి వెళ్లిన సునీతను.. డ్వాక్రా మహిళలుఅడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘నిన్ను నమ్మం సునీతమ్మా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో చేసిన మోసం చాలనీ, ఇప్పుడు కొత్తగామళ్లీ స్మార్ట్‌ఫోన్ రూ.10 వేల పేరుతో మాయచేయడం మానుకోవాలన్నారు. మహిళల ప్రతిఘటన..పోలీసుల బలవంతపు అరెస్టులతో తోపుదుర్తి గ్రామం అట్టుడికింది.
అనంతపురం, ఆత్మకూరు : మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి పరిటాల సునీత నిర్ణయించుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు రెండురోజుల కిందటే సమావేశమయ్యారు. మంత్రి సునీత, టీడీపీ సర్కార్ చేసిన మోసానికి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం మంత్రి గ్రామానికి వస్తున్నట్లు తెలిసి రోడ్డుపై బైఠాయించారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చాలక మళ్లీ ఇప్పుడు రూ.10వేలు ఇస్తామని పోస్ట్‌డేటెట్ చెక్కులు(మూన్నెల్ల తర్వాత చెల్లేలా తేదీ వేసిన చెక్కులు) ఇచ్చి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే మంత్రిని గ్రామంలోనికి అడుగుపెట్టనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఇదంతా తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత గ్రామంలోకి కచ్చితంగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ బాబుతో పాటు సీఐలు, ఎస్‌ఐలు, సుమారు 400 మంది పోలీసులను గ్రామంలో మొహరించారు.
మహిళలపై పోలీసు జులుం
గ్రామానికి వస్తున్న మంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతామని మహిళలు భీష్మించారు. దీంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ‘వజ్ర’ వాహనాలను రప్పించారు. 11 గంటలకు మంత్రి కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలోనే మహిళలు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. చివరకు పోలీసులు అందరినీ అరెస్టు చేశారు.
గంటన్నర గ్రామం బయటే...
గ్రామంలోని పరిస్థితి తెలుసుకున్న మంత్రి సునీత గ్రామం బయటే వేసి చూశారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లారు. అయితే పరిస్థితి అదుపులోకి రాలేదని తెలిసి దారిలోని గంటన్నరేపు కాన్వాయ్ నిలిపేశారు. దీంతో ఎస్పీ అశోక్‌కుమార్ గ్రామానికి వచ్చి పోలీసు బలగాలతో మహిళలను అరెస్టు చేసి తరలించారు. ఆ తర్వాత మంత్రి కాన్వాయ్ గ్రామంలోకి రాగానే పోలీసులు రెండువైపులా రక్షణగా ఉండి గ్రామంలోకి అనుమతించారు. అయినప్పటికీ గ్రామస్తులు మంత్రి కాన్వాయ్‌పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు.
తోపుదుర్తి మహిళల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని కూడా బలవంతంగా అరెస్టు చేశారు.
రోడ్డుపై బైఠాయించి మంత్రి సునీతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తోపుదుర్తి గ్రామ మహిళలు
వడ్డీ మాఫీ కాలేదు
మహిళా సంఘాల్లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవుతుందని ఆశపడ్డాం. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రుణాలు కాదు కదా...వాటికి సంభందించిన వడ్డీలు కూడా మాఫీ కాలేదు. అలాంటప్పుడు మోసపూరిత హామీలు ఎందుకివ్వాలి. – భావమ్మ, తోపుదుర్తి
పోలీసుల అండతో వచ్చారు
డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలం నిలదీస్తామని తెలియడంతో మంత్రి సునీత గ్రామంలోకి పోలీసులు అండతో వచ్చారు. నిజంగా హామీలు నెరవేర్చి ఉంటే మహిళలు ఎందుకు నిలదీస్తారు. ఇప్పుడు ‘పసుపు –కుంకుమ’, సెల్‌ఫోన్ అంటూ మళ్లీ మోసం చేస్తూ.. చెక్కులను అందజేస్తున్నారు. – చంద్రకళ, తోపుదుర్తి
మహిళలకుఅన్యాయం చేసిన మంత్రి
డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని పరిటాల సునీత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ రుణమాఫీ కాదు కదా కనీసం వడ్డీ కూడా కట్టలేదు. పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తే.. ఆ డబ్బును బ్యాంకోళ్లు వడ్డీ కింద జమ చేసుకున్నారు. మహిళలకు అన్యాయం చేసిన మంత్రి మాకు వద్దేవద్దు.– అక్కమ్మ, తోపుదుర్తి
Comments
Please login to add a commentAdd a comment