ఆయనో పోలీస్ అధికారి. శాంతిభద్రతలు పరిరక్షించడం... సమాజానికి మంచి చేయడం... ఆపన్నులను ఆదుకోవడం... అతని కనీస ధర్మం. కానీ తన కింద పనిచేసే సిబ్బందిని అమితంగా వేధిస్తున్నారంట. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవడం లేదంట. ఎక్కడ డ్యూటీ వేసినా...అక్కడ విధిగా వివాదాలు తెచ్చిపెడుతున్నారంట. ఇదీ జిల్లాలో ఆయన గురించి వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఆయన వేధింపులు తాళలేక ఓ హోంగార్డు ఏకంగా ఆత్మహత్యకు యత్నించగా... మరో ఎస్‌ఐ ఆయన బారినపడి తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఆ అధికారి వ్యవహారం సొంత శాఖలోనే తలకాయ నొప్పి తెచ్చిపెడుతోంది.
సాక్షి, విజయనగరం: పెద్ద చదువు. అంతే పెద్ద ఉద్యోగం. అంతకు మించి హోదా. సంఘంలో గౌరవం. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఎలా ఉండాలి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వీలైతే నలుగురికి మంచి చేస్తూ బాధ్యతగా మెలగాలి. కానీ తనకున్న అధికారాన్ని చూసుకుని, తోటివారిని, కిందవారిని, పైవారిని కూడా లెక్కచేయకుండా ఇష్టానుసారం నడుచుకుంటే వారిని ఏమనాలి. ఇలాంటి పెత్తందారులు చాలా ప్రభుత్వ శాఖల్లో ఉంటారు. పోలీస్ శాఖలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటారు. జిల్లాలో అలాంటి ఓ అధికారి వల్ల కొందరు సిబ్బంది పడుతున్న అవస్థలు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఆయన వేధింపులు భరించలేం
పార్వతీపురం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ ఉన్నతాధికారి వేధింపులతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటీవల పార్వతీపురంలో ఒక హోమ్ గార్డ్ మనస్థాపానికి గురై మెడపై కోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేశారు. తాను ఆ అధికారి వేధింపులు భరించలేకే చనిపోవాలనుకుంటున్నానంటూ లేఖ మరీ రాసి పోలీస్ స్టేసన్‌లోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అదృష్ట వశాత్తూ అక్కడున్న పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇదంతా బయటకు వస్తే ఆ అధికారికి ఇబ్బంది వస్తుందని భావించి, హోంగార్డ్‌కు నచ్చజెప్పి విషయాన్ని తొక్కిపెట్టేశారు. తాజాగా తనను ఆ అధికారి తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఓ ఎస్సై ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నారు. ఇవి బయటకు వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆ అధికారికి భయపడి ఆయన గురించి మాట్లాడటానికి కూడా పోలీసులు ఎవరూ ధైర్యం చేయడం లేదు.
ప్రజాప్రతినిధులన్నా లెక్కలేదు
ప్రజాప్రతినిధులను కూడా ఆ అధికారి లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల భవన నిర్మాణ కార్మికులు పార్వతీపురంలో ఆందోళన చేపట్టి న సందర్భంలో వారికి నచ్చజెప్పాల్సింది పోయి లాఠీ చార్జి చేసేందుకు ఆ అధికారి ఉపక్రమించారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే స్వయంగా కల్పించుకుని, ఆందోళన చేస్తున్నవారితో సంప్రదింపులు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ సాలూరులో పర్యటించినపుడు కూడా ఈ అధి కారి కొంచెం అతి చేస్తూ అనుమతి ఉన్నవారిని కూడా అడ్డుకోవడం, స్వయంగా ఎమ్మెల్యే చెప్పినా ససేమీరా అనడంతో విమర్శలపాలయ్యారు. జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పైడితల్లి అమ్మవా రి జాతరలో ఆ అధికారి తీరు ప్రజల్లో ఏవగింపును కలిగించింది. సిరిమానోత్సవానికి ముందు రోజు రాత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన పూజా రిని అడ్డుకున్నారు. తాను తెల్లారి సిరిమానును అధిరోహించే పూజరినని చెప్పినా వినిపించుకోకపోవడంతో మనస్థాపం చెంది ఆ పూజారి వెనక్కి వెళ్లిపోయారు. మర్నాడు అమ్మదర్శనానికి ఘటాలు నెత్తిన పెట్టుకుని వచ్చిన భక్తులను కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఆ సమ యంలో అటుగా వచ్చిన ఎస్పీ కల్పించుకుని భక్తుల ను అనుమతించాల్సి వచ్చింది. ఇలా ఇటు సొంతశా ఖ వారితోనూ , అటు ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సఖ్యంగా ఉండలేకపోతున్న ఆ అధికారి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యవ్తమవుతోంది.
పనిచేయమంటే వేధింపులంటున్నారు
రూల్స్ ప్రకారం పనిచేయమంటే వేధిస్తున్నామనుకుంటున్నారు. క్లోజ్ మానిటరింగ్, సూపర్‌విజన్, పనిఒత్తిడి వల్ల అలా అంటున్నారు. అది ఒత్తిడిగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా ఫీలవ్వాలి. వేధించడం ఏమీ లేదు. ఇక ప్రజలతో సఖ్యతగా ఉండాలని పదే పదే చెబుతున్నాం. పరివర్తన, స్పందనలో వివరిస్తున్నాం. ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటాం.
– బి.రాజకుమారి, ఎస్‌పీ, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment