సాక్షి, విజయనగరం: అసలే కరోనా... అందులోనూ లాక్ డౌన్... ఖాళీగా ఇంట్లో ఉండలేక కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసగాళ్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఇప్పటికే ఏటీఎమ్‌ల వద్ద డబ్బులు విత్ డ్రాలు చేసేటప్పుడు మోసాలు ఎక్కువయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా ఫలానా బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని, కేవైసీ వివరాలు కావాలంటూ వచ్చిన మెసెజ్‌లన్నింటినీ జాగ్రత్తగా కూపీలాగి వేలకు వేలు విత్‌డ్రా జరిగిపోతున్న కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఆన్‌లైన్‌లో వాహనాల క్రయవిక్రయాల పేరుతో డబ్బులు దోచేస్తున్న ఉదంతాలు ఇటీవల జిల్లాలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ మోసాల పరంపరలో మరో ముందడుగు పడింది. డేటింగ్ సైట్ల విషసంస్కృతి జిల్లాలోనూ ప్రవేశించింది.
డేటింగ్ పేరుతో దోపిడీ
ఆన్‌లైన్‌లో అమ్మాయిలతో చాటింగ్‌లు, డేటింగ్‌లు చేసేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేశాడో ప్రబుద్ధుడు. ఆన్‌లైన్ ద్వారా అమ్మాయిల ఫొటోలు ఎరవేసి, వారితో చాటింగ్ చేయడానికి, డేటింగ్‌కు నేరుగా ఆన్‌లైన్ ద్వారా వారితో మాట్లాడించి, డబ్బులు అకౌంట్‌లో వేయించుకోవడం, డబ్బులు ఖాతాలో పడిపోగానే సెల్ స్విచ్చాఫ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇప్పటికే ఇలా కొందరి ఖాతాలు ఖాళీ చేశాడు. జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ నరేష్ చాటింగ్ చేస్తూ తన ఖాతా నుంచి రూ. 8,500 వేయడానికి ఒప్పందం కుదుర్చుకుని, ఆ తర్వాత పొరపాటున రూ. 85 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. తప్పు తెలుసుకుని తన ఖాతాలోకి తిరిగి డబ్బులు పంపించాలని వేడుకున్నా, ఫలితం లేక పోయింది. డేటింగ్ సైట్ నిర్వాహకుడి సెల్ స్విచ్చాఫ్ అయిపోయింది. దిక్కు తోచని స్థితిలో ఆ బాధితుడు జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి ఈ నెల 11న ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయనగరంలోని రింగురోడ్డు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నడుపుతున్న ఆన్ లైన్ డేటింగ్ వ్యవహారంలో మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి.
ఆన్‌లైన్‌లో తలదూరిస్తే... అంతే!
ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ‘లొకొంతో‘ పేరుతో డేటింగ్ వెబ్‌సైట్ యాడ్‌లు వస్తుంటాయి. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు పెంచుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వడం వంటివి చోటు చేసుకుంటుంటాయి. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి జార్ఘండ్ రాష్ట్రం నుంచి కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి స్థిరపడిన కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన విజయనగరం రింగురోడ్డు సమీపంలో నివాసముంటున్నాడని పోలీసులు కనుగొన్నారు. అంతేకాదు రామనారాయణం ప్రాజెక్ట్ సమీపంలో ఒక ఆలయాన్ని ఆయన కట్టించినట్లు తేలింది.
తద్వారా సమాజంలో గౌరవప్రదమైన పెద్దమనిషిగా చెలామణీ అవుతున్నాడు. కుమార్‌కు ఇద్దరు భార్యలు కాగా వారిలో రెండో భార్య అతని కార్యకలాపాలకు పూర్తిసహకారం అందిస్తోందని విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతమంది బాధితులు కుమార్ ఆన్‌లైన్ ద్వా రా మోసపోయారు, వారి సెల్ నెంబర్లు, ఫోన్‌కాల్స్, చాటింగ్‌లపై కూపీలాగుతున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కొంత నగదు చేతులు మారిందని, ఒక ఎస్‌ఐ, ఒక సీఐ ఈ కేసును నీరుగార్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు.
చురుగ్గా కేసు విచారణ
ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ద్వారా పురుషులకు వల చేసి, డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చింది. కేసు విచారణలో ఉంది. పారదర్శకంగా విచా రణ జరిపేందుకు ఈ కేసుకు ప్రత్యేకాధికారిగా విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డిని నియమించాం. త్వరలోనే పూర్తివివరాలు వెల్లడిస్తాం.
-బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment