సాక్షి ప్రతినిధి, విజయనగరం: పోలీస్ శాఖలోని స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ప్రక్షాళన చేశారు. పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ పేరు చెప్పగానే అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుడుతుంది. తప్పుచేసినోళ్లు తప్పించు కోలేరనే వాదన ఉంది. అసాంఘిక శక్తులకు ఎవరంటే భయమో వారే..కంచే చేను మేసిన చందాన తప్పుదారి పడుతున్నారు. పాస్‌పోర్టు పరిశీలనకని, ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తన విచారణకని కొందరు భారీగా డబ్బులు గుంజుతున్నారు. దీనిపై పలు కేస్ స్టడీలతో గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన ‘సాక్షి’లో ‘స్పెషల్ వసూళ్లు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పట్లో ఈ కథనం పోలీసు వర్గాల్లో సంచలనమే కాదు చర్చనీయాంశమయ్యింది.
నాటి నుంచి స్పెషల్ బ్రాంచ్‌పై నిఘా పెట్టిన ఎస్పీ ఆ మధ్య ఒకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ ఒక్కరితో ఆగదని భావిస్తూ ఏకంగా ప్రక్షాళనకు దిగారు. అందులో భాగంగానే స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న 10మందిని తాజాగా ఒకేసారి బదిలీ చేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. స్పెషల్ బ్రాంచ్‌లో ఎట్టకేలకు ఎస్పీ ప్రక్షాళన చేయడంతో అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే పోలీస్ వర్గాల్లో మాత్రం హర్షంతో పాటు కొంత ఆక్షేపణ కూడా విన్పిస్తోంది. అక్రమార్కుల్ని,దీర్ఘకాలికంగా తిష్ఠ వేసిన వారిని బదిలీ చేయడం సరైనదేనని,కాకపోతే అవినీతి ఆరోపణలు లేకుండా ఏడాది కూడా పూర్తి చేసుకోని వారిని కూడా అందరితో పాటు బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.
దీనివల్ల అందర్నీ ఒకే గాటన కట్టేస్తారని, తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. అలాగే, బదిలీ చేసిన వారి స్థానంలో కొత్తగా నియమితులైన వారిలో పలువురు స్టేషన్ రైటర్లుగా పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొ న్నారని, అలాంటి నలుగురైదుర్ని ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు తీసుకోవడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌లో అవినీతి ఆరోపణలున్న వ్యక్తులను నియమిస్తే మరింత చెలరేగిపోతారని,ఆ విభాగం మరింత అప్రతిష్ట మూట గట్టుకోవాల్సి వస్తుందంటున్నారు.
‘స్పెషల్’ బదిలీ
Published Mon, Jan 26 2015 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM
Advertisement
Advertisement