
శింగనమల : పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేయడం తగదని అన్నారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా పోలీసుల ద్వారా అడ్డు తగులుతూనే ఉన్నారన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందస్తుగా నేతలను గృహనిర్బంధం, ముందస్తు అరెస్టులతో అణచివేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల వంటివే కాకుండా జిల్లా అంతటా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.
పోలీసుల రాజ్యంలో ఉన్నామా.. లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల చేత ఎన్నికయ్యారా అని విమర్శించారు. ముచ్చుకోట వద్ద ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకున్నా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, పార్లమెంటు సమన్వయకర్తలతో కలిసి పోలీసుల తీరుపై డీజీపీ, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థను కించపరిచినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే ఎంతోమంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వస్తున్నారని.. మీకు అధికార పార్టీపై అభిమానం ఉంటే ఖాకీ చొక్కాలు విప్పి పచ్చ చొక్కాలు వేసుకుని రావాలని హితవు పలికారు.
పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం : కేతిరెడ్డి
జిల్లాలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మేము ఏమైన రాళ్లు రువ్వుతున్నామా.. ఎవరో తాడిపత్రి ఎమ్మెల్యే, ఎంపీ చెబితే మీరు వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తాడిపత్రి ఎమ్మెల్యే తిమ్మంపల్లిలో పర్యటిస్తే 500 మంది పోలీసులతో బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. తాము ప్రజాసమస్యల కోసం పాదయాత్ర చేస్తామంటే పోలీస్‌స్టేషన్‌లో పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. అదే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులను అవమానకర రీతిలో దూషించినా ఆయనపై ఎటువంటి కేసూ నమోదు చేయరన్నారు.
నీరు రాకుండా జేసీ సోదరుల అడ్డుకట్ట
శింగనమల: ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయకపోవడంతో పాటు వర్షపునీరు కూడా డ్యాంలోకి చేరకుండా జేసీ సోదరులు అడ్డుకట్ట వేశారని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని, పెద్దారెడ్డిని శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాంలో నీరు ఉంటే పెద్దపప్పూరు మండలంలోని 20 గ్రామాల్లో భూగర్భజలం పెరుగుతుందన్నారు. తద్వారా రైతులు పంటలు పండించుకుంటే.. ఇక జేసీ ఇంటి వద్దకు ఎవరూ తిరిగి చూడరని 30 సంవత్సరాలుగా రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని తాము కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ లేదని, అక్కడ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారన్నారు. ప్రబోధానందాశ్రమంపై జేసీ సోదరులు, వారి అనుచరులు దాడి జరిపితే పోలీసులు సుమోటోగా కూడా కేసు నమోదు చేయలేదన్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ధైర్యముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
శింగనమల పోలీస్‌స్షేన్‌లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరిసాంబశివారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్‌బాషా, తాడిపత్రి, యల్లనూరు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పరామర్శించారు.
మధ్యాహ్నం కేతిరెడ్డి పెద్దారెడ్డి విడుదల
తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని మధ్యాహ్నం సొంత పూచికుత్తపై విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు పోయిన తరువాత తాడిపత్రికి వెళ్లకూడదని డీఎస్పీలు రామకృష్ణ, చిన్నికృష్ణలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని నిలిపి అభ్యంతరం చెప్పారు. రోడ్డుపైనే పోలీస్‌స్టేసన్ మందు అనుచరలు అందోళన చేస్తామని చెప్పడంతో వాహనాలను పంపించి వేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు నిరంజన్‌రెడ్డి, ప్రసాద్‌రావు, ఎస్‌ఐ కరీం బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment