సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార పార్టీకి దాసోహమయ్యారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. పోలింగ్ సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు తమను ఏరి కోరి బదిలీలపై తెచ్చుకున్న అధికారపార్టీ నేతల పట్ల స్వామిభక్తి చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీకి నష్టం కలింగించేలా పోలీసులు చూపిన అత్యుత్సాహం ఆ శాఖకే మాయని మచ్చగా మిగిలింది. నిఘా విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి పచ్చనేతలకు బాగా సహకరిస్తూ విధులు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
టీడీపీ నేతలకు సహకారం
అధికార పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఎన్నికల్లో నెగ్గుకురావడం కష్టంగా భావించిన కొందరు టీడీపీ అభ్యర్థులు పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ నష్టం కలించేలా కుట్రలు పన్నారు. ఈక్రమంలో కొందరు పోలీసుల అధికారులను ప్రలోభపెట్టి వారి ద్వారా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యనాయుడు పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీకి పూర్తి స్థాయిలో బలమున్న పోలింగ్ బూత్‌ల వద్ద అలజడులు సృష్టించారు. పోలీసుల చేత ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేలా పక్కా పథకం వేసి అమలు చేశారు. ఆత్మకూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంత మండలమైన మర్రిపాడు మండలంలోని ఆయన స్వగ్రామం బ్రహ్మణపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలను టార్గెట్ చేసి మునుపెన్నడూ లేనివిధంగా డీఎస్పీ స్థాయి అధికారులతోపాటు అధిక స్థాయిలో పోలీసు బలగాలను మొహరించేలా చేయించారు.
ఆయా గ్రామాల్లోనే బొల్లినేని బ్రదర్స్ తిష్టవేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆపై పోలీస్ అధికారుల ద్వారా ఆయా గ్రామాల ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేయించారు. పోలీస్ శాఖకు మర్రిపాడును టార్గెట్ చేయించిన బొల్లినేని తన సొంత మండలమైన చేజర్లలో పోలీస్ బలగాలను తగ్గించేలా పైరవీలు చేశారు. ఆ మండలంలోని పులనీళ్లపాడులో పోలింగ్‌బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను బయటకు లాగి రిగ్గింగ్ చేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా బలగాలు లేకుండా చేశారు. పుల్లనీళ్లపాడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటిపై దాడి జరిగినా పోలీసులు స్పందించిన తీరు బాగోలేదన్న విమర్శలున్నాయి. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలోని పలువురు పోలీసులు టీడీపీ అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. మండలంలోని అంకుపల్లిలో కండలేరు డ్యామ్ ఎస్సై నరసింహారావు టీడీపీకి ఏకపక్షంగా వ్యవహరించారు.
టీడీపీకి అనుకూలంగా
సూళ్లూరుపేట సీఐ కిషోర్‌బాబు ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీ నాయకులు చెప్పినట్లు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్ అమలు నుంచి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ద్వితీయశ్రేణీ నేతలను టార్గెట్ చేసి అధికమందిపై బైండోవర్ చేసి భయభ్రాంతులకు గురిచేశారని చెబుతున్నారు. టీడీపీ నాయకులు నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోకుండా స్వామిభక్తి చాటుకున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ గౌరవా«ధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో నాయుడుపేటకు మార్పు చేయాల్సి వచ్చింది. అలాగే పోలింగ్ రోజు కూడా ఏకపక్ష నిర్ణయాలతో వైఎస్సార్‌సీపీకి నష్టం కలింగించేలా వ్యహరించడంపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి.
ఆయన కనుసన్నల్లోనే..
నిఘా విభాగంలో పనిచేసే కీలక అధికారి టీడీపీ కోసం పని చేశారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. టీడీపీ అధినేత సామాజికవర్గానికి చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక నుంచి అసంతృప్తుల విషయం వరకు ప్రతి దాంట్లో తన వంతు పాత్ర పోషించారని విమర్శలున్నాయి. ఆ అధికారి కనుసన్నల్లోనే టీడీపీ అభ్యర్థులు నగదు పంíపిణీ వ్యవహారం నడిచిందని చెబుతున్నారు. సర్వేలు కూడా చేయించి ముఖ్యనాయకులకు సమాచారం ఇచచ్చి స్వామిభక్తి చాటుకున్నారని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment