వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ నిజాయితీపరుడని ఆయన కానీ, ఆయన తరఫున టీడీపీ నాయకులు కానీ ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజనకాలనీకి చెందిన జాతీయ ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నెల్లూరు నగర అధ్యక్షుడు బాగి వెంకటరమణ, ఆయన సంబంధీకులు వందమందితో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. అనిల్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మంత్రి నారాయణ హౌస్ ఫర్ ఆల్ పథకంలో రూ.600 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఆ డబ్బుతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే బ్యాంకు అప్పు పూర్తిగా మాఫీ చేసి ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా హౌస్ ఫల్ ఆల్ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి 9 అంకణాల స్థలంలో ఇళ్లు కట్టించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. నారాయణ కళాశాలల్లో ఇప్పటివరకు 80 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదన్నారు. నారాయణ ఆస్పత్రిలో ఒక్క రూపాయి తగ్గినా వైద్యం అందించని మంత్రి నెల్లూరును నగర ప్రజలకు ఏవిధంగా సేవ చేస్తాడో అర్థం కావడంలేదన్నారు. జగనన్న సీఎం అయ్యాక నవరత్నాలను పార్టీలకు అతీతంగా అందిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఆదిశేషమ్మ, ప్రమీల, బుజ్జమ్మ, కంపా భాస్కర్, కె.రాజేష్, వంశీ, దాసరి రమణయ్య, నరేష్, సుధాకర్, బుజ్జయ్య, శేఖర్, కిషోర్, చిరంజీవి తదితరులున్నారు. కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ అశోక్, దార్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment