* వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విజయమ్మపై కాంగ్రెస్ మంత్రుల బురద రాజకీయం
* మంత్రులు ఉత్తమ్, జానా ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు
* నల్లగొండలో అడుగుపెట్టకుండా విజయమ్మను అడ్డుకున్న ఖాకీలు
* ఖమ్మం జిల్లాలో పర్యటన సాఫీగా సాగినా, ఉద్రిక్త పరిస్థితులు లేకున్నా పోలీసుల అత్యుత్సాహం
* రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు
* విజయమ్మను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
* కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, నేతల గృహ నిర్బంధం
సాక్షి ప్రతినిధులు, నల్లగొండ, ఖమ్మం: భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ఓదార్చి బతుకుపై భరోసా కలిగించేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటనపైనా కాంగ్రెస్ మంత్రులు రాజకీయాస్త్రం ప్రయోగించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని తాము పిలుపునిచ్చినా.. గురువారం ఖమ్మం జిల్లాలో ఆమె పర్యటన ప్రశాంతంగా సాగడంతో జీర్ణించుకోలేని మంత్రులు ఆమెను నల్లగొండ జిల్లాలో అడ్డుకోవడానికి పోలీసుల్ని పురమాయించారు. ఖద్దరు ఆదేశాలే తమ చట్టమన్నట్టుగా వందల మంది పోలీసులు రంగంలోకి దిగారు. నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తే శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లుతుందంటూ విజయమ్మను జిల్లా సరిహద్దులోనే అడ్డుకున్నారు.
ఖమ్మం జిల్లాలో విజయమ్మ పర్యటన చాలా ప్రశాంతంగా సాగిందని ఆ జిల్లా ఎస్పీ సైతం ప్రకటించగా.. నల్లగొండ జిల్లా పోలీసులు మాత్రం శాంతిభద్రతల సాకు చూపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆరుగాలం కష్టపడి కన్నబిడ్డలా సాకిన పంట మొత్తం వర్షాలకు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వారికి ధైర్యం చెప్పేందుకు విజయమ్మ వస్తుంటే.. అడ్డుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. తాము ఎంత చెప్పినా పోలీసులు వినకపోవడంతో విజయమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
‘సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ జిల్లాల్లో పర్యటించడానికి వస్తే.. శాంతి భద్రతలంటూ ఇలాగే ఆయన్ను అడ్డుకుంటారా? ఇదేమైనా పాకిస్థానా.. బంగ్లాదేశా?’ అంటూ మండిపడ్డారు. ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం పై నుంచి వచ్చిన ఆదేశాలనే తాము పాటిస్తున్నామంటూ పోలీసులు విజయమ్మకు చెప్పారు. రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించడానికి వెళ్లకపోగా.. తాము వెళుతుంటే రాజకీయాలు చేయడమేంటని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
మంత్రులు ఆదేశించారు.. పోలీసులు పాటించారు..
గురువారం ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆ తర్వాత నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో బాధిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించాల్సి ఉంది. అయితే బుధవారం నుంచే జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు విజయమ్మ పర్యటనను అడ్డుకోవడానికి ప్రణాళిక రచించారు. సమైక్యవాదమంటున్న విజయమ్మ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలంటూ ప్రజలను రెచ్చగొట్టడానికి యత్నించారు. వీలైన చోటల్లా ఏదో రకంగా అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పురమాయించారు.
అయితే గురువారం ఖమ్మం జిల్లాలో విజయమ్మ పర్యటనా ప్రశాంతంగా సాగడం, రైతులు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ తరఫున పోరాడాలని కోరారు. అక్కడక్కడా ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు మాత్రమే ఆమెను అడ్డుకుంటామంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత విజయమ్మ నల్లగొండ జిల్లాకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా మంత్రులు పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మోహరించారు.
ఖమ్మం జిల్లాలో ఇద్దరు డీఎస్పీలతో పాటు నలుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 72 మంది పోలీసులు విజయమ్మ పర్యటనకు బందోబస్తుగా ఉంటే.. సరిహద్దులో మాత్రం నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు డీఎస్పీలతో పాటు సుమారు 250 మంది పోలీసులు మకాం వేశారు. నల్లగొండ జిల్లాలో విజయమ్మ పర్యటన జరగకుండా చూడటమే ధ్యేయంగా పోలీసులు ఆ జిల్లాలో 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు.
బైఠాయించిన విజయమ్మ
సరిహద్దులోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్దకు విజయమ్మ చేరుకోగానే.. నల్లగొండ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కదలనీయబోమని పోలీసులు అనడంతో ఆమె అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విజయమ్మతో పాటు జిల్లా పార్టీ నాయకులు బీరవోలు సోమిరెడ్డి, గున్నం నాగిరెడ్డి, పాదూరి కరుణ, ఖమ్మం జిల్లా పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం తదితర నాయకులంతా ధర్నాకు దిగారు. అర్ధగ ంటకు పైగానే ఈ నిరసన సాగింది. దీంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి స్టేషన్‌కు తరలించారు.
నేలకొండపల్లిలో టెన్షన్..టెన్షన్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలుసుకొన్న కొద్ది సేపట్లోనే నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి నేలకొండపల్లి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విజయమ్మను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అర్ధగంట పాటు ఆమెను పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఖమ్మం-కోదాడ రహదారిపై కార్యకర్తలు ధర్నా చేశారు.
వారిని చేదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వెరువకుండా నినాదాలు చేశారు. ముందస్తుగా ఈ పరిస్థితిని ఊహించిన పోలీసులు ఖమ్మం జిల్లా నుంచి విజయమ్మకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారి వాహనాలను నేలకొండపల్లిలోనే అడ్డుకున్నారు. పోలీసులు తీరును నిరసిస్తూ వారంతా నేలకొండపల్లి పెట్రోల్‌బంక్ సమీపంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
విజయమ్మపై కోదాడ రూరల్‌స్టేషన్ లో కేసు నమోదు
నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు యత్నించినందుకు వైఎస్ విజయమ్మపై కేసు నమోదైంది. శాంతి భద్రతల దృష్ట్యా ‘295/13 అండర్ సెక్షన్ 151 సీఆర్‌పీసీ’ ప్రకారం విజయమ్మపై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు హుజూర్‌నగర్ కోఆర్డినేటర్, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు బందోబస్తు పెట్టి గృహనిర్బంధం చేశారు. సాయంత్రం అరెస్టు చేసి చిలుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రైతుల ఆగ్రహం
వర్షం తాకిడితో పంటలు దెబ్బతిన్న నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ రైతులంతా.. బాధలో ఉన్న తమను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ వస్తున్నారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆమె రాకతో జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి మరింత వివరంగా తెలిసే అవకాశం ఉండడంతో పాటు, తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో వారున్నారు. తీరా విజయమ్మ పర్యటన జరగకుండా పోలీసుల రూపంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అడ్డం పడడంతో రైతులు, బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉత్తమ్‌కుమార్ భార్య హల్‌చల్..
విజయమ్మ పర్యటనను అడ్డుకునే ఏర్పాట్లను జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం ఉదయమే ఆమె కోదాడకు చేరుకుని పట్టణంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పార్టీ పాత కార్యాలయానికి పిలిపించారు. ఎట్టి పరిస్థితుల్లో విజయమ్మను కోదాడ దాటనివ్వద్దంటూ వారికి నూరిపోశారు. పార్టీ కార్యకర్తలతో కోదాడ-ఖమ్మం రోడ్డుపై ఉన్న వంతెన వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే వారికి టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు జత కలిశారు. దాదాపు అరగంట సేపు ఆమె అక్కడే ఉండి వారికి ఆదేశాలిచ్చి వెళ్లిపోయారు. అయినప్పటికీ జనం పలుచగా ఉన్నారని భావించిన నాయకులు కోదాడ పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను కొందరిని అక్కడికి తరలించారు. ఇంతలోనే ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన పైనంపల్లి వద్ద విజయమ్మను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అందడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి ర్యాలీగా ఖమ్మం క్రాస్‌రోడ్డు చేరుకున్నారు.
మంత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు..
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటనను అడ్డుకునేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరూ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల ద్వారా బెదిరించి ఆటోలు పెట్టకుండా కట్టడి చేశారు. రాత్రికి రాత్రే రెండు నియోజకవర్గాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ధ్వంసం చేయించారు. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, అధికారులను ఆటాడించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ విజయమ్మను జిల్లా సరిహద్దు దాటి రానీయవద్దని హుకుం జారీ చేశారు. అయితే స్థానిక ప్రజలు సహకరిస్తారో లేదోనన్న అనుమానంతో ఆయన నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి కోదాడలో మోహరింపజేశారు. హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, రామాపురం క్రాస్‌రోడ్డు, ఖమ్మం క్రాస్‌రోడ్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో తన అనుచరులు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని సిద్ధంగా పెట్టుకున్నారు. పోలీసులను పెద్దసంఖ్యలో తీసుకువచ్చి భయోత్పాత వాతావరణం సృష్టించారు. మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు చేసేదేమీ లేక అవసరానికి మించి బలగాలను తరలించారు. పూర్తిగా రాజకీయ, వ్యక్తిగత అజెండాతో జనాలను ఉసిగొల్పిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
రెండు నియోజకవర్గాలోవైఎస్ విగ్రహాల ధ్వంసం
విజయమ్మ నల్లగొండ జిల్లా పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందకు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. కోదాడ పట్టణంలోని ప్రమీల టవర్స్ సమీపంలోనూ, మండల పరిధిలోని గుడిబండ, చిలుకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నిప్పు పెట్టారు. హుజూర్‌నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ, మేళ్లచెర్వు మండల కేంద్రంతో పాటు దొండపాడు గ్రామంలోనూ, నేరేడుచర్ల మండల కేంద్రంలోనూ, గరిడేపల్లి మండల పరిధిలోని ఎల్‌బీ నగర్‌లోనూ వైఎస్ విగ్రహాలపై టైర్లు వేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.
పలకరింపు నిషేధం!
Published Fri, Nov 1 2013 3:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement