పోలీస్ గస్తీ @ జీపీఎస్
తాడేపల్లిగూడెం : రాత్రి వేళ వీధుల్లో గస్తీకి వెళ్లే పోలీసులు నిర్దేశిత మార్గాల్లో తిరుగుతున్నారా లేదా అనే విషయూన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. శనివారం తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనివల్ల గస్తీ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఐదు మొబైల్ ఫోన్లు ఇస్తామన్నారు. బీట్‌కు వెళ్లే పోలీసులు వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
ఏలూరులో కంట్రోల్ రూమ్ నుంచి జీపీఎస్ విధానంలో వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారనే విషయూన్ని గుర్తిస్తామన్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ సిద్ధమవుతోందని చెప్పారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు తేలికే అరుునప్పటికీ, నిర్వహణ కాస్త కష్టంగా ఉందన్నారు. వీటి నిర్వహణలో దుకాణాల యజమానులను భాగస్వాములుగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కోసం ఇంజినీరింగ్ అధికారుల సాయంతో కసరత్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
రహదారులపై తేలికగా, ప్రమాదాలకు లోను కాకుండా వాహన చోదకులు, పాదచారులు ఎలా వెళ్లాలనే విషయాలపై కార్యాచరణ రూపొం దించనున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ విషయంలో హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయ నం చేసి, ఇక్కడ అమలు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ విధానాలను తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసే యోచన ఉందని చెప్పారు. స్కీమ్‌లు, వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటి విడిభాగాలను విజయవాడ ఆటోనగర్, గుంటూరు మాయాబజార్‌కు తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
వాహనాలను కొనే సందర్భంలో వాటి తాలూకా కాగితాలతోపాటు, ఇంజిన్, చాసిస్ నంబర్లను సరిచూసుకోవాలని సూచిం చారు. వాహనాల తనిఖీల విధుల్లో ఉండే పోలీ సులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, నేమ్ ప్లేటు తగిలించుకోవాలన్నారు. ఎవరైనా అందుకు విరుద్ధంగా తనిఖీలకు వస్తే వారి ఐడెంటిటీ కార్డులు చూపించమని అడగాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి రెండు మూడు రోజులపాటు బయటకు వెళ్లేవారు తాళాలు వెనుకకు ఉండేలా జాగ్రత్తపడాలని, వరండాలో రాత్రి పూట లైట్లు వెలిగే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అలారంలను ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. తాము ఊరు వెళ్తున్న విషయూన్ని పోలీసులకు తెలి యజేస్తే ఆ ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
బాణసంచా విక్రయాలపై నిఘా
దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ చెప్పారు. బాణసంచా తయారీ, నిల్వలు, అమ్మకాలను లెసైన్సు కలిగిన వ్యాపారులే చేయాలన్నారు. వీటికి సంబంధించి రెవెన్యూ. పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.