పోలీస్ + రెవెన్యూ గోడ వివాదం | Police Revenue wall dispute | Sakshi
Sakshi News home page

పోలీస్ + రెవెన్యూ గోడ వివాదం

Published Mon, Jan 20 2014 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Police Revenue wall dispute

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  కాలనీ ప్రజలకు రహదారి లేకపోవడం తో కలెక్టర్ ఆదేశాల మేరకు కల్యాణ మండపం ప్రహరీని తొలగించడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల మధ్య వివాదం రేగింది. ప్రహరీ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధపడగా, పోలీసు అధికారులు అడ్డుపడ్డారు. విజయనగరం పట్టణంలోని పోలీసులకు చెందిన దండుమారమ్మ కల్యాణ మండపం గోడను తొలగించేందుకు ఆర్డీఓ వెంకటరావు, విజయనగరం తహశీల్దార్ పెంటయ్య, మున్సిపల్ ఇంజినీర్ ఎం.బాబు కల్యాణమండపం వద్దకు ఆదివారం మధ్యాహ్నం పొక్లెయినర్‌తో చేరుకుని గోడను కూల్చేందుకు సిద్ధపడ్డారు.  జిల్లాకు బందోబస్తు కోసం వచ్చి కల్యాణ మండపంలో ఉంటున్న బీఎస్‌ఎఫ్‌కు చెందిన కానిస్టేబుళ్లు అడ్డంగా నిలుచుని గోడను కూలగొట్టకుండా అడ్డుకున్నారు. ఈ దశలో ఆర్డీఓ, అక్కడున్న పోలీసు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. మీరుకాని, మీ అధికారి గాని  ఏదైనా మాట్లాడాలనుకుంటే, కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని ఆర్డీఓ సూచించారు. పావుగంట సమయం కావాలని పోలీసులు అడిగారు.  అరగంటైనా పోలీసు అధికారులు రాకపోవడంతో గోడను కూల్చేయాలని ఆర్డీఓ ఆదేశించా రు. 
 
 పొక్లెయినర్‌తో ప్రహరీ పక్కనే ఉన్న మట్టిని తొలగిస్తు న్న సమయంలో ఒకటో పట్టణ సీఐ కె.రామారావు సంఘట న స్థలానికి వచ్చి ఆర్డీఓ వెంకటరావుతో మాట్లాడి కొంత సమయం కావాలని ఎస్పీతో మాట్లాడతామని కోరారు. ఈలోగా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ ఒకటో పట్టణ సీఐకి ఫోన్‌చేసి ఆర్డీఓకు ఫోన్ ఇవ్వాలని కోరారు. ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆర్డీఓ అనంతరం  కలెక్టర్ వద్దకు వెళ్లారు.  విజయనగ రం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని  పరిస్థితులను ఆరా తీశారు. దండుమారమ్మకాలనీకి వెళ్లేందుకు దారి చూపి మీరే న్యాయం చేయాలని స్థానిక మహిళలు డీఎస్పీని అడిగారు. గోడను తొలగించి మాకు దారి చూపించకుండా పొక్లెయినర్‌ను వెళ్లనీయబోమంటూ అడ్డుకున్నారు. ఒకటో పట్టణ సీఐ మాట్లాడుతూ మీకు ఏదైనా సమస్య ఉంటే ఆర్డీఓకు తెలపాలని ఇలా అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. దీంతో స్థానికులు పొక్లెయినర్‌ను విడిచిపెట్టి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. 
 
 ఏడాదిగా నలుగుతున్న వివాదం
 దండుమారమ్మ కాలనీలో నివాసం ఉండే ప్రజలు ఎస్.కోట రోడ్డు  వైపు  వెళ్లేందుకు గతంలో తోవ ఉండేది. ఆ తోవలో స్థలం  ఉన్న యజమాని రామారావు ప్రహరీ  కట్టేయడంతో  వీరికి రహదారి లేకుండా పోయింది. కల్యాణ మండపం గోడ తొలగించి తమకు దారి చూపించాలని దండుమారమ్మకాలనీ వాసులు అప్పట్లో జాయింట్ కలెక్టర్,ఆర్డీఓకు   వినతిపత్రం అందించారు. అప్పటినుంచి గ్రీవెన్స్‌సెల్‌లో అనేకమార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. దీంతో దండుమారమ్మ కల్యాణ మండపం ప్రహరీ గోడను కొంత తొలగించి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. మున్సిపల్ అధికారులు అనేకమార్లు తొలగించడానికి వెళ్లినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.
 
 మంత్రి వద్దకు పంచాయితీ 
 దండుమారమ్మకాలనీవాసులసమస్య మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. రెవెన్యూ,పోలీస్ వర్గాలను పిలిచి ఆయన మాట్లాడి నెలరోజుల్లో పరిష్కార మార్గాన్ని చూపించాలని చెప్పినట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement