* గుంటూరు ప్రభుత్వాస్పత్రికి విజయమ్మ తరలింపు
* దీక్షా వేదికపై రణరంగం సృష్టించిన పోలీసులు
* అడ్డుపడిన నేతల్ని, కార్యకర్తల్ని దీక్షా వేదికపై నుంచి విసిరేసిన వైనం
* ఆపై విజయమ్మను అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ జీపులో ఎక్కించే యత్నం
* జీజీహెచ్ ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి దింపి ఇబ్బంది పెట్టిన పోలీసులు.. నీరసంతో పడిపోయిన విజయమ్మ
* ఆపై ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయింపు
* ఐసీయూలో చేర్చినా వైద్యానికి నిరాకరణ... దీక్ష కొనసాగింపు
* జగన్ ఫోన్ చేసి కోరడంతో దీక్ష విరమణ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఐదు రోజులపాటు, వంద గంటలకు పైగా చేపట్టిన అకుంఠిత ఆమరణ నిరాహార దీక్షను వ్యూహాత్మకంగా భగ్నం చేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆమెను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సమర దీక్ష వేదికపై విజయమ్మను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడడం, పైకిలేవలేని స్థితిలో నీరసించిన ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ.. తోసుకుంటూ వేదికపై నుంచి దింపడం, అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ సుమోలో ఎక్కించడం, ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి, దించి ఇబ్బందిపెట్టడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుతో విజయమ్మ ఒక దశలో స్పృహ తప్పిపడిపోయారు కూడా.
తెలుగుజాతి ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ఒక రాష్ట్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలు, ఒక ఎంపీకి తల్లి, ఎమ్మెల్యే అయిన విజయమ్మను నేరస్తురాలిని అదుపులోకి తీసుకున్న విధంగా పోలీసులు వ్యవహరించడంపై వైఎస్‌ఆర్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
పక్కా ప్లాన్‌తో పోలీసులు..
దీక్ష భగ్నం చేసేందుకు ఆది నుంచీ పోలీసులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఎవరికీ అనుమానం రాకుండా దీక్షను భగ్నం చేసేది లేదని శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పార్టీ నేతలకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైద్యులు హెల్త్ బులెటిన్ల వివరాలను కనీసం బయటకు చెప్పనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీక్షకు విఘాతం కల్గించనీయబోమని వైఎస్సార్ సీపీ శ్రేణుల్ని తప్పుదోవ పట్టించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు శిబిరంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు.
అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన పార్టీ శ్రేణుల్లో కలిసిపోయి మఫ్టీ పోలీసులు నెమ్మదిగా వేదికపైకి చేరుకున్నారు. తర్వాత యూనిఫామ్ దుస్తుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన పోలీసులకు పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వేదికపై ఉన్న విజయమ్మ వద్దకు పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించినా కొద్ది సేపు నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి వేదికపై నుంచి ఎత్తి కింద పడేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్..
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెల్లా చెదురు చేశారు. అడ్డువచ్చిన వారిని మోచేతులతో కుళ్లబొడిచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులోని మహిళలు కొందరు వేదికపైకి చేరుకుని తమకు సహకరించాల్సిందిగా విజయమ్మను కోరారు. పక్కనే ఉన్న వై.వి.సుబ్బారెడ్డి, శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మలు దీక్ష భగ్నం చేస్తే ఊరుకునేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమన్యాయం చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తాను దీక్ష విరమించేది లేదని విజయమ్మ స్పష్టం చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల నడుమ విజయమ్మను ఓఎస్‌డీ వెలిశల రత్నతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు మహిళా బలగాలు వేదికపై నుంచి తీసుకుపోయారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విజయమ్మ ఆరోగ్యం విషమంగా ఉన్నా పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి నిరంకుశ వైఖరిపై పార్టీ నేతలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు.
అంబులెన్స్‌లో కాకుండా సుమోలో..
విజయమ్మను పోలీసు ఎస్కార్టు జీపులో ఎక్కించేందుకు ఖాకీలు ప్రయత్నించారు. కనీసం అంబులెన్స్ కూడా తేకుండా, పోలీస్ జీప్‌లో ఎక్కించడం చూసి పార్టీ నేతలు అడ్డుకున్నారు. హైడ్రామాను నడిపించిన పోలీసులు చివరకు పోలీస్ డీఎస్పీ సుమోలో ఎక్కించారు. అడ్డుపడిన వారిపై ర్యాపిడ్ యాక్షన్ బలగాలు లాఠీచార్జి చేశారు. విజయమ్మను ఎక్కించిన పోలీసు వాహనాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వంగవీటి రాధాలతో పాటు కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని లాగిపారేసిన పోలీసులు ముందుకు కదిలారు. తమ వాహనాలు మంగళగిరి వైపు వెళ్తున్నట్లుగా పార్టీ నేతలను తప్పుదోవ పట్టించి కొత్తపేట మీదుగా జీజీహెచ్‌కు తరలించారు.
ఆస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం..
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)లో సైతం పోలీసులు విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు. నేరుగా క్యాజువాల్టీ ముందు సుమోను ఆపగా, ఆమెను లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేదని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. కనీసం, వీల్‌చైర్ కూడా లేకపోగా.. కారులోనుంచి విజయమ్మను కిందికి దింపి ఆరుబయట రోడ్డుపై నిలబెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఐసీయూలోకి తరలించాలని, క్యాజువాల్టీలో పడకల్లేవని వైద్యులు చెప్పడంతో అక్కడ్నుంచి రెండో అంతస్తు వరకు నడిపించుకుని వెళ్లారు.
ఐసీయూలో పరీక్షలు చేసేందుకు పరికరాలు, టెక్నీషియన్ సిబ్బంది లేరని పోలీసులు మళ్లీ ఆమెను బలవంతంగా కిందికి తెచ్చారు. క్యాజువాల్టీలో కనీసం బీపీ చూసే మెషీన్ లేదనగా.. ఏం చేయాలనే విషయంపై పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అప్పటికే సమయం తెల్లవారుజామున 2.30 గంటలైంది. విజయమ్మ నీరసంతో కింద పడిపోయారు. కాసేపటికి తేరుకుని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అప్పటికే అక్కడికి చేరిన పార్టీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తల నినాదాలతో ఆస్పత్రి మార్మోగింది. రాపిడ్‌యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీల్ని ఝళిపించాయి.
అరగంటకు పైగా బైఠాయింపు..
దాదాపు అర్ధగంటకు పైగా విజయమ్మ ఇక్కడ బైఠాయించారు. చివరికి ఐసీయూలోనికే తీసుకెళ్తామంటూ పోలీసులు మరోమారు ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ రెండు అంతస్తులు ఎక్కించారు. అప్పటికప్పుడు క్యాజువాల్టీ డ్యూటీలో ఉన్న వైద్యుడ్ని పిలిపించి బీపీ పరీక్షలు చేయించారు. తర్వాత ఐసీయూకి తరలించారు. ఐసీయూలో విజయమ్మకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నించినా, విజయమ్మ తాను దీక్ష విరమించేది లేదని, సమన్యాయంపై ప్రకటన వచ్చేంతవరకు దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఆరోగ్యం క్షీణిస్తుందని, సహకరించాలని వైద్యులు కోరినప్పటికీ వినలేదు. విజయమ్మను జీజీహెచ్‌కు తీసుకెళ్ళారనే వార్త తెల్లవారుజామున దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న జీజీహెచ్‌కు తరలివచ్చారు. ధర్నా, నిరసనలు చేపట్టారు.
జగన్ సూచనతో దీక్ష విరమణ..
విజయమ్మను శనివారం ఉదయం కార్డియాలజీ విభాగంలోని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు జీజీహెచ్ మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల అనుమతితో జైలులోని ఫోన్‌బూత్ నుంచి తన తల్లి విజయమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు. దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అప్పుడు ఆమె దీక్ష విరమించడంతో వైద్యులు ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. విజయమ్మ మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేటు అంబులెన్స్‌లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ్నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యేలు..
విజయమ్మ సమర దీక్షను భగ్నం చేయాలన్న తాపత్రయంలో ఆమె పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరుపై శాసనసభ స్పీకర్ మనోహర్‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. విజయమ్మను దీక్షా స్థలి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించేటప్పుడు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా కనీసం అంబులెన్స్ సమకూర్చకుండా ఒక సాధారణ వాహనంలో తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పార్టీ శాసనసభా పక్ష నేత అయిన విజయమ్మను ప్రభుత్వాసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకున్న హక్కులకు భంగం కలిగించారని సోమవారం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విజయమ్మ దీక్ష భగ్నంలో పోలీసుల దాష్టీకం
Published Sun, Aug 25 2013 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM
Advertisement
Advertisement