Samaradeeksha
-
ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
-
ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
గుంటూరు: అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే.. అత్తనే అడగాలని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలురహస్యాలను ఆమె 'సమర దీక్ష' వేదికగా ఆమె బయటపెట్టారు. 10 లక్షలు తీసుకుని ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని ఆమె చెప్పారు. ఒకటో తరగతిలో ఉండగానే పక్కన పిల్లాడి దగ్గర బలపం కొట్టేశాడని, అప్పుడు వాళ్ల టీచర్ కొట్టారని ఆమె తెలిపారు. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు. దీంట్లో 30 వేల కోట్లు మోదీకి పంపాలి, 4 వేల కోట్లు ఉంచుకుంటానన్నాడు. కానీ చివరికి 4 వేలకోట్లు గుజరాత్‌కి పంపి, 30 వేలకోట్లు తను ఉంచుకున్నాడని చెప్పారు. అల్లుడు చరిత్ర అత్తకే కదా తెలిసేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజున చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వెధవా నువ్వు చేస్తున్నది పనికిమాలిన పని అని టీచర్లు గానీ, తల్లి గానీ ఎవరో ఒక్కరైనా చెప్పి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు అని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ''ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నాకు తెలుసు. వీడు ఒకటో క్లాసు చదువుకునేటప్పుడే పక్క పిల్లల బలపాలు కాజేసి టీచర్ దగ్గర దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చాక క్లాస్మేట్ల జేబుల్లో డబ్బులు కాజేసి రెండుసార్లు పోలీసు స్టేషన్లకు వెళ్లాడు. తర్వాత ఎన్టీఆర్ 10 లక్షలిస్తే.. కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడు. ఈ వేదిక మీద ఆకలి కేకలున్నాయి.. ఆ వేదిక మీద అధికార కాంక్షలున్నాయి. ఈ వేదిక మీద సింహం ఉంది. అక్కడేమో నక్కలున్నాయి. మా అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నాను.. ఇంత మొద్దోడు అనుకోలేదు. ప్రజాబ్యాలెట్లో వందకి సున్నా మార్కులు తెచ్చుకున్నవాడిని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నాకైతే, రెండు మొట్టికాయలు మొట్టి వెధవా.. బాగా చదువు అని చెప్పాలనిపిస్తోంది. చంద్రబాబుకు జరిగిన అవమానానికి సంతాపం తెలియజేస్తున్నాను. మనవడైనా గట్టివాడు ఉంటాడేమో అనుకుంటే.. అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలింది. ఒబామాతో ఫొటో దిగడానికి 6 లక్షలు ఖర్చుపెట్టాడు. మా మనవడు లోకేశ్.. ఒబామాకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో చెప్పాడని బిల్డప్పిచ్చారు. తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడని అప్పుడు అనుకున్నాను.'' -
సమరదీక్షకు తరలిరండి
పట్నంబజారు(గుంటూరు) : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరదీక్షకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం తెనాలి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఇన్చార్జులు, ముఖ్యనేతలతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ పోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సమీక్షకు హాజరయ్యారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కత్తెర సురేష్‌కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. జూన్ 3, 4 తేదీల్లో జరగనున్న సమరదీక్ష కార్యక్రమానికి జన సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేరే వరకు జననేత వైఎస్ జగన్ పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మాట్లాడుతూ కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే అధికారంలోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, ఏ మొఖం పెట్టుకుని విజయోత్సవ యాత్రలు చేసేందుకు సిధ్దపడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అభివృధ్ధి పధంలో దూసుకుపోతోందని ప్రకటనలు చేయటమే తప్ప జరుగుతోందని ఏమి లేదని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్‌కుమార్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల, మండల, గ్రామ నేతలు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, మెట్టు వెంకటప్పారెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, కంది సంజీవరెడ్డి, యోగీశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, సుందర్‌రెడ్డి, అనిల్, తియ్యగూర బ్రహ్మారెడ్డి, హబీబుల్లా, కిషోర్, శివారెడ్డి వెంకటరెడ్డి, సిద్ధయ్య, ప్రకాష్, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయమ్మ దీక్ష భగ్నంలో పోలీసుల దాష్టీకం
* గుంటూరు ప్రభుత్వాస్పత్రికి విజయమ్మ తరలింపు * దీక్షా వేదికపై రణరంగం సృష్టించిన పోలీసులు * అడ్డుపడిన నేతల్ని, కార్యకర్తల్ని దీక్షా వేదికపై నుంచి విసిరేసిన వైనం * ఆపై విజయమ్మను అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ జీపులో ఎక్కించే యత్నం * జీజీహెచ్ ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి దింపి ఇబ్బంది పెట్టిన పోలీసులు.. నీరసంతో పడిపోయిన విజయమ్మ * ఆపై ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయింపు * ఐసీయూలో చేర్చినా వైద్యానికి నిరాకరణ... దీక్ష కొనసాగింపు * జగన్ ఫోన్ చేసి కోరడంతో దీక్ష విరమణ సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఐదు రోజులపాటు, వంద గంటలకు పైగా చేపట్టిన అకుంఠిత ఆమరణ నిరాహార దీక్షను వ్యూహాత్మకంగా భగ్నం చేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆమెను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సమర దీక్ష వేదికపై విజయమ్మను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడడం, పైకిలేవలేని స్థితిలో నీరసించిన ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ.. తోసుకుంటూ వేదికపై నుంచి దింపడం, అంబులెన్స్‌లో కాకుండా పోలీస్ సుమోలో ఎక్కించడం, ఆసుపత్రిలో రెండంతస్తుల మెట్లు ఎక్కించి, దించి ఇబ్బందిపెట్టడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుతో విజయమ్మ ఒక దశలో స్పృహ తప్పిపడిపోయారు కూడా. తెలుగుజాతి ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ఒక రాష్ట్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలు, ఒక ఎంపీకి తల్లి, ఎమ్మెల్యే అయిన విజయమ్మను నేరస్తురాలిని అదుపులోకి తీసుకున్న విధంగా పోలీసులు వ్యవహరించడంపై వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పక్కా ప్లాన్‌తో పోలీసులు.. దీక్ష భగ్నం చేసేందుకు ఆది నుంచీ పోలీసులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఎవరికీ అనుమానం రాకుండా దీక్షను భగ్నం చేసేది లేదని శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పార్టీ నేతలకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైద్యులు హెల్త్ బులెటిన్ల వివరాలను కనీసం బయటకు చెప్పనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీక్షకు విఘాతం కల్గించనీయబోమని వైఎస్సార్ సీపీ శ్రేణుల్ని తప్పుదోవ పట్టించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు శిబిరంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన పార్టీ శ్రేణుల్లో కలిసిపోయి మఫ్టీ పోలీసులు నెమ్మదిగా వేదికపైకి చేరుకున్నారు. తర్వాత యూనిఫామ్ దుస్తుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన పోలీసులకు పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వేదికపై ఉన్న విజయమ్మ వద్దకు పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించినా కొద్ది సేపు నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించి వేదికపై నుంచి ఎత్తి కింద పడేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెల్లా చెదురు చేశారు. అడ్డువచ్చిన వారిని మోచేతులతో కుళ్లబొడిచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులోని మహిళలు కొందరు వేదికపైకి చేరుకుని తమకు సహకరించాల్సిందిగా విజయమ్మను కోరారు. పక్కనే ఉన్న వై.వి.సుబ్బారెడ్డి, శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మలు దీక్ష భగ్నం చేస్తే ఊరుకునేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమన్యాయం చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తాను దీక్ష విరమించేది లేదని విజయమ్మ స్పష్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ విజయమ్మను ఓఎస్డీ వెలిశల రత్నతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు మహిళా బలగాలు వేదికపై నుంచి తీసుకుపోయారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విజయమ్మ ఆరోగ్యం విషమంగా ఉన్నా పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి నిరంకుశ వైఖరిపై పార్టీ నేతలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో కాకుండా సుమోలో.. విజయమ్మను పోలీసు ఎస్కార్టు జీపులో ఎక్కించేందుకు ఖాకీలు ప్రయత్నించారు. కనీసం అంబులెన్స్ కూడా తేకుండా, పోలీస్ జీప్‌లో ఎక్కించడం చూసి పార్టీ నేతలు అడ్డుకున్నారు. హైడ్రామాను నడిపించిన పోలీసులు చివరకు పోలీస్ డీఎస్పీ సుమోలో ఎక్కించారు. అడ్డుపడిన వారిపై ర్యాపిడ్ యాక్షన్ బలగాలు లాఠీచార్జి చేశారు. విజయమ్మను ఎక్కించిన పోలీసు వాహనాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వంగవీటి రాధాలతో పాటు కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని లాగిపారేసిన పోలీసులు ముందుకు కదిలారు. తమ వాహనాలు మంగళగిరి వైపు వెళ్తున్నట్లుగా పార్టీ నేతలను తప్పుదోవ పట్టించి కొత్తపేట మీదుగా జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)లో సైతం పోలీసులు విజయమ్మను అవమానించేలా వ్యవహరించారు. నేరుగా క్యాజువాల్టీ ముందు సుమోను ఆపగా, ఆమెను లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేదని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. కనీసం, వీల్‌చైర్ కూడా లేకపోగా.. కారులోనుంచి విజయమ్మను కిందికి దింపి ఆరుబయట రోడ్డుపై నిలబెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఐసీయూలోకి తరలించాలని, క్యాజువాల్టీలో పడకల్లేవని వైద్యులు చెప్పడంతో అక్కడ్నుంచి రెండో అంతస్తు వరకు నడిపించుకుని వెళ్లారు. ఐసీయూలో పరీక్షలు చేసేందుకు పరికరాలు, టెక్నీషియన్ సిబ్బంది లేరని పోలీసులు మళ్లీ ఆమెను బలవంతంగా కిందికి తెచ్చారు. క్యాజువాల్టీలో కనీసం బీపీ చూసే మెషీన్ లేదనగా.. ఏం చేయాలనే విషయంపై పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అప్పటికే సమయం తెల్లవారుజామున 2.30 గంటలైంది. విజయమ్మ నీరసంతో కింద పడిపోయారు. కాసేపటికి తేరుకుని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అప్పటికే అక్కడికి చేరిన పార్టీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తల నినాదాలతో ఆస్పత్రి మార్మోగింది. రాపిడ్యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీల్ని ఝళిపించాయి. అరగంటకు పైగా బైఠాయింపు.. దాదాపు అర్ధగంటకు పైగా విజయమ్మ ఇక్కడ బైఠాయించారు. చివరికి ఐసీయూలోనికే తీసుకెళ్తామంటూ పోలీసులు మరోమారు ఆమెను బలవంతంగా నెట్టుకుంటూ రెండు అంతస్తులు ఎక్కించారు. అప్పటికప్పుడు క్యాజువాల్టీ డ్యూటీలో ఉన్న వైద్యుడ్ని పిలిపించి బీపీ పరీక్షలు చేయించారు. తర్వాత ఐసీయూకి తరలించారు. ఐసీయూలో విజయమ్మకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నించినా, విజయమ్మ తాను దీక్ష విరమించేది లేదని, సమన్యాయంపై ప్రకటన వచ్చేంతవరకు దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఆరోగ్యం క్షీణిస్తుందని, సహకరించాలని వైద్యులు కోరినప్పటికీ వినలేదు. విజయమ్మను జీజీహెచ్‌కు తీసుకెళ్ళారనే వార్త తెల్లవారుజామున దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న జీజీహెచ్‌కు తరలివచ్చారు. ధర్నా, నిరసనలు చేపట్టారు. జగన్ సూచనతో దీక్ష విరమణ.. విజయమ్మను శనివారం ఉదయం కార్డియాలజీ విభాగంలోని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు జీజీహెచ్ మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల అనుమతితో జైలులోని ఫోన్‌బూత్ నుంచి తన తల్లి విజయమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు. దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అప్పుడు ఆమె దీక్ష విరమించడంతో వైద్యులు ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. విజయమ్మ మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేటు అంబులెన్స్‌లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ్నుంచి హైదరాబాద్ బయలుదేరారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యేలు.. విజయమ్మ సమర దీక్షను భగ్నం చేయాలన్న తాపత్రయంలో ఆమె పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరుపై శాసనసభ స్పీకర్ మనోహర్‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. విజయమ్మను దీక్షా స్థలి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించేటప్పుడు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా కనీసం అంబులెన్స్ సమకూర్చకుండా ఒక సాధారణ వాహనంలో తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పార్టీ శాసనసభా పక్ష నేత అయిన విజయమ్మను ప్రభుత్వాసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకున్న హక్కులకు భంగం కలిగించారని సోమవారం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
నాలుగోరోజుకు చేరిన విజయమ్మ దీక్ష
-
వారి ఫిక్సింగ్ జగమెరిగిన సత్యమే
* కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై వైఎస్ విజయమ్మ ధ్వజం * విభజన ప్రకటన తర్వాత సోనియాను కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ చంద్రబాబు విమర్శించారా? * 10-జన్‌పథ్‌తో ఎవరికి హాట్‌లైన్ ఉందో చిదంబరం పార్లమెంటు సాక్షిగా చెప్పారు కదా! * చంద్రబాబు ఎన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడారో అందరికీ తెలిసిన విషయమే * ఇప్పుడు న్యాయం జరగాలంటున్న వారు.. ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తున్నా * టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే సీడబ్ల్యూసీ నిర్ణయం వెనక్కుపోతుంది * బాబు వంచనను ఎవరూ నమ్మరు.. ఇప్పటికైనా రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలి * కాంగ్రెస్ విభజన నిర్ణయంపై మనల్ని ప్రశ్నిస్తున్న సీఎం ఏ పార్టీలో ఉన్నారో తెలియట్లేదు * సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేయటం దుర్మార్గం.. దీనిపై రాజకీయ పార్టీలన్నీ ఉద్యమించాలి * మూడో రోజు సమర దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపు సాక్షి, గుంటూరు: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌వి దొంగ నాటకాలని ఆ రెండు పార్టీలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎవరివి దొంగ నాటకాలో ప్రజలు గమనిస్తున్నారు. నిరంకుశ విభజన నిర్ణయం ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కానీ.. కాంగ్రెస్ పార్టీని కానీ ఒక్క మాటైనా విమర్శించారా? పరస్పరం కుమ్మక్కై మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నదెవరో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీల పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జగమెరిగిన సత్యమే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 10-జన్‌పథ్‌కు హాట్‌లైన్ ఉందని చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎవరికి హాట్‌లైన్ ఉందో.. చిదంబరం పార్లమెంటు సాక్షిగా చెప్పారు కదా! ‘మీ నాయకుడు మాతో మాట్లాడుతున్నారు’ అని ఆయన టీడీపీ ఎంపీలతో స్పష్టంగా చెప్పారు. అంటే హాట్‌లైన్ ఉన్నది మీకేనని స్పష్టమవుతోంది’’ అని చంద్రబాబు తీరును ఆమె ఎండగట్టారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ అధినాయకత్వం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన పది రోజులకు బయటకు వచ్చి.. ఆయన్ను మనం అడగాల్సిన ప్రశ్నలను మనల్నే ఆయన అడుగుతున్నారు. అసలు ఆయనే ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావటం లేదు’’ అని విజయమ్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేలా రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించాలని విజయమ్మ పిలుపునిచ్చారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని, బాధ్యతని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోరాదని.. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బుధవారం మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమర దీక్ష వేదికపై నుంచి ఆమె పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్తూ.. తన దీక్షను ఆశీర్వదిస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యాంశాలు విజయమ్మ మాటల్లోనే... కాంగ్రెస్‌ను బాబు ఎన్నిసార్లు కాపాడారో... ‘‘చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమయితే.. కాంగ్రెస్‌ది రెండు కాళ్ల సిద్ధాంతం. ఆ రెండు పార్టీల పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జగమెరిగిన సత్యం. చంద్రబాబు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడారో అందరికీ తెలిసిందే. ఎఫ్‌డీఐ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడేందుకు పార్లమెంటులో టీడీపీ ఎంపీలను చంద్రబాబు గైర్హాజరు చేయించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండోసారి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సందర్భంగా.. తన పార్టీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలని విప్ జారీ చేసి మరీ కాపాడారు. కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకే వస్తున్నానంటూ పాదయాత్ర చేసిన చంద్రబాబు.. అసెంబ్లీలో మాత్రం అవిశ్వాసం వీగిపోయేలా చేసి ప్రభుత్వాన్ని కాపాడారు. ఆ రోజు ఆయన అవిశ్వాసానికి మద్దతిచ్చి ఉంటే ఈ ప్రభుత్వం ఉండేది కాదు. ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంతో తన ఉనికి కోల్పోతున్న చంద్రబాబు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, జగన్‌బాబును తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. తనపై అవినీతి కేసులు విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడేదో ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటున్న చంద్రబాబు వంచనను ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసివ్వకుండా ఉండే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. నిర్ణయం వచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి, వారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిరంకుశ నిర్ణయం తీసుకోబుతున్నారని తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనగా ముందుగానే రాజీనామాలు చేశారు. కానీ.. రాజీనామాలు చేయకుండా విభజన నిర్ణయానికి వంతపాడుతున్న వారు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌వి దొంగనాటకాలు అంటూ దుష్ర్పచారానికి దిగారు. అందరూ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి... నిరంకుశ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు అన్ని పార్టీల వారూ అందరికీ న్యాయం జరగాలనే మాట మాట్లాడుతున్నారు. వట్టి మాటలు చెప్పటం కాదు.. చిత్తశుద్ధి ఉంటే అందరూ రాజీనామాలు చేసి ప్రజల ముందుకు రావాలని నేను కోరుతున్నా. ప్రజా విశ్వాసం పోగొట్టుకున్న పార్టీ కానీ, ప్రభుత్వం కానీ మనుగడ సాగించలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినపుడు కాంగ్రెస్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దిగివస్తుంది. ఇంతకుముందు రాజీనామాలు చేసినప్పుడు నిర్ణయం వెనక్కు తీసుకున్నారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారని నేను అన్ని పార్టీల వారిని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్ష టీడీపీకి కానీ ప్రజల బాగోగులు అవసరం లేదు. కోట్లాది మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా, ఉద్యోగులు సమ్మె చేస్తున్నా వారిలో చలనం లేదు. కానీ.. మనం ఉద్యమం చేసే కొద్దీ మన బలం పెరుగుతుంది. తప్పనిసరిగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది. నేను చేస్తున్న ఈ దీక్షను ఆశీర్వదిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రమంతటా ఈ దీక్షల్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. సర్పంచుల చెక్‌పవర్ రద్దుపై పోరాటం చేయాలి రాష్ట్రంలోని 21 వేలకు పైగా పంచాయితీల సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ రద్దు చేయటం అన్యాయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 ప్రకారం పంచాయతీలకు నిధులు, విధులు కేటాయించాలని.. అప్పుడే అవి బలపడతాయని రాజీవ్‌గాంధీ చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం జీవో నం. 385 జారీ చేసి సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేసింది. దీనిపై అన్ని పార్టీలు పోరాటాలు చేయాల్సిన అవసరముంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎటువంటి పెద్ద జబ్బు వచ్చినా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా దివంగత వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. ఈ రోజు ఆరోగ్యశ్రీని చూస్తే బాధాకరంగా ఉంది. ఆరోగ్యశ్రీ నుంచి 139 రోగాలు తొలగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలని దాదాపుగా 90 ప్రైవేటు ఆస్పత్రులనూ తొలగించారు. ఈ పథకం కింద వైద్యం కూడా అరకొరగానే అందుతోంది. ఈ రోజు పేపర్లో చదివా... ఎవరికైనా గుండె ఆపరేషన్‌లో స్టెంట్ వేయించుకోవాలంటే గతంలో ప్రభుత్వం రూ. 60 వేలు ఇచ్చేది. కానీ ఈ రోజు రూ. 37 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇవి సరిపోవని, తాము ఆపరేషన్లు చేయలేమని డాక్టర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితి బాధాకరం.’’ తగ్గిన సుగర్ లెవెల్స్ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విజయమ్మ రక్తంలో సుగర్ శాతం తగ్గిందని జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఒ.సునీత తెలిపారు. విజయమ్మకు వైద్యులు బుధవారం పలు పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు అదుపులో ఉందని చెప్పారు. అయితే సుగర్ లెవల్స్ తగ్గటంతో ఫ్లూయిడ్స్ (సెలైన్) ఎక్కించాలని సూచించారు. ఇదిలావుంటే.. సమర దీక్ష చేస్తున్న విజయమ్మను వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ, వై.ఎస్.జార్జిరెడ్డి భార్య భారతమ్మ బుధవారం దీక్షా శిబిరానికి వచ్చి కలిశారు. అండగా మేముంటాం... ‘‘ఎంతోమందికి మేలు చేసిన తల్లివి.. పుట్టెడు కష్టాల్లోనూ ప్రజలకోసం దీక్ష చేస్తున్నావమ్మా.. నువ్ దేవుడి దయ వల్ల చల్లగుండాలి...’’ అని వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో విజయమ్మను ఆశీర్వదిస్తున్నారు. అందరి మంచి కోసం పోరాడుతున్న ఆమెకు బాసటగా ఉంటామంటూ బుధవారం కూడా వివిధ జిల్లాల నుంచి మహిళలు, వృద్ధులు తండోపతండాలుగా లారీలు, బస్సులు, జీపుల్లో స్వచ్ఛందంగా తరలివచ్చారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వివిధ రైతు సంఘాలు గుంటూరుకు తరలివచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపాయి. విజయమ్మతో కరచాలనం చేసేందుకు సమైక్యవాదులంతా వరుసకడుతున్నారు. మూడు రోజుల నిరాహార దీక్షతో కొంత నిరసించినప్పటికీ.. విజయమ్మ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ చేతులెత్తి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. -
రాజకీయ కుట్రపై సమరం
* ప్రజలకు విజయమ్మ పిలుపు * గుంటూరులో ఆమరణ దీక్ష ప్రారంభం * విభజన.. కాంగ్రెస్ రాజకీయమే * ఆ పార్టీపై పోరాటానికి సమయం ఆసన్నమైంది * బాబు దన్నుతోనే విభజన నిర్ణయం * ప్రజాగ్రహానికి కేంద్రం నుంచి కాంగ్రెస్ దిగొస్తుంది * అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం చేసింది వైఎస్సే * శాంతియుతంగానే ముందుకెళ్దామని పిలుపు * జగనే ఆమరణ దీక్ష చేస్తానన్నారు.. కానీ ఆయన తరఫున తాను దీక్షకు దిగానని వెల్లడి సాక్షి, గుంటూరు: ఒక్క రోజుతో, ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల దుష్పరిపాలనను ప్రజలు మరిచిపోగలరా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ప్రాతిపదికంటూ ఏమీ లేకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం తమ హక్కు అని చెబుతున్న కాంగ్రెస్ పెద్దల తీరుపై న్యాయంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శాంతియుతంగానే ముందుకెళ్దామంటూ పిలుపునిచ్చారు. ప్రజాగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరని, కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి తప్పక దిగొస్తుందని చెప్పారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలనే డిమాండ్‌తో ఉద్యమాల పురిటిగడ్డ గుంటూరులో విజయమ్మ సోమవారం ‘సమరదీక్ష’కు శ్రీకారం చుట్టారు. దీక్షా ప్రాంగణంలో ముందుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత సమైక్య ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యమకారులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పావు గంటపాటు ప్రసంగించిన విజయమ్మ, కేవలం అవకాశవాదంతో కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందంటూ తూర్పారబట్టారు. దీని ప్రభావం ఎనిమిదిన్నర కోట్ల ప్రజలపై దశాబ్దాలు, శతాబ్దాల పాటు ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ ఇచ్చేయండంటూ పదేపదే లేఖలు రాసిన చంద్రబాబు సాయంతోనే కాంగ్రెస్ సులువుగా విభజన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు విజయమ్మ మాటల్లోనే.. మాటకు కట్టుబడి ఉన్నాం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, రాష్ట్ర విభజన జరిగిపోయిందని పదేపదే చెబుతున్న దిగ్విజయ్‌సింగ్... తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉండగా అక్కడి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం తర్వాతే ఛత్తీస్‌గఢ్ ఏర్పడిందనే విషయం మరిచిపోయినట్టున్నారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న తొలి ఎస్సార్సీ సిఫార్సు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నాగాలాండ్‌లో అతి తక్కువ జనాభా ఉన్నా భాషాప్రయుక్త ప్రాతిపదికనే రాష్ట్రం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో ఎస్సార్సీకి మొగ్గు చూపారు. ఆయన నాయకత్వంలో 2004లో ఎన్నికలకు వెళ్లేముందు కేసీఆర్ కూడా రెండో ఎస్సార్సీకి సంతకం చేసిన విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయింది. తెలంగాణ ఇవ్వాల్సి వస్తుందని వైఎస్‌తో సోనియాగాంధీ అంటే, అసలు తెలంగాణవాదం పెరగడానికి కారణాలేమిటో తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు. తెలంగాణలోని ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవికత ఎంతో తెలుసుకోవాలని భావించారు. ‘తెలంగాణలో మైనారిటీల మనోభావాలేమిటి? హైదరాబాద్‌లో స్థిరపడిన వారి సంగతేమిటి? తెలంగాణ అంతటా ఉన్న సెటిలర్లలో భయాందోళనలకు పరిష్కారమెలా చూపాలి? తెలంగాణలో మావోయిజం ఎలా ఉంది? విభజిస్తే సమస్యలేమిటి? నీటి పంపకాలెలా ఉంటాయి? రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ సంగతేమిటి? హైదరాబాద్‌లో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను ఎక్కడకు పంపుతాం?’ వంటి పలు అంశాలకు జవాబులు దొరికనప్పుడే విభజన గురించి ఆలోచిస్తామని సోనియాకు వైఎస్ చెప్పారు. వైఎస్సార్ వారసత్వంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. పార్టీ ప్లీనరీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ పరిస్థితేమిటి? ‘‘60 ఏళ్లుగా హైదరాబాద్‌ను మనదనే భావనతోనే అభివృద్ధి చేసుకున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. బీహెచ్ఈఎల్, హెచ్‌సీఐఎల్, హెచ్ఎంటీ, బీడీఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీఐఎల్, మిథానీ, ఎన్ఎండీసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, దానికి అనుబంధంగా నూరు సంస్థలు, ఎన్ఎఫ్సీ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడున్నాయి. రీసెర్చ్ ల్యాబ్‌లతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఫ్యాషన్ టెక్నాలజీ, నల్సార్, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నాయి. రాష్ట్ర ఆదాయంలో 45 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. రాయలసీమ, ఆంధ్రాల నుంచి ఎనభై, తొంభై శాతం మంది నగరంలో సంస్థలు ఏర్పాటు చేశారు. ఐటీలో రాష్ట్ర ఆదాయం రూ.55 వేల కోట్లయితే, అందులో రూ.54,800 కోట్లు ఒక్క హైదరాబాద్‌లోనే వస్తోంది. రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులను నగరంలో అభివృద్ధి చేశాం. నికర జలాలపై నీటి విడుదల ఉన్న జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ కూడా రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారి కేంద్రం చేతుల్లోకి పోతాయి. చారిత్రక కట్టడాలుగా మిగిలిపోతాయి. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి నుంచి ఏ విధంగా నీరిస్తారో చెప్పలేదు. సీమాంధ్రలో ఎలాంటి ఆదాయమూ వచ్చే పరిస్థితి లేదు. ఎన్జీవోలు పెన్ డౌన్ చేసినా తెలంగాణ ఇచ్చి తీరుతామంటున్నారు. ఉద్యోగులకు భద్రత ఇవ్వాల్సిన అవసరముంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం’’ తెలంగాణ వారిని అవమానించొద్దు సీమాంధ్రకు తెలంగాణ నుంచి నాయకులు వచ్చినా, ప్రజలు వచ్చినా వెనక్కు పంపొద్దు. అవమానించొద్దు. అన్నదమ్ముల్లా సంస్కారవంతంగా ప్రవర్తించాలి. పరస్పరం బాధపడుతూ, దూషించుకుంటున్న రాష్ట్రాన్ని చూసి బాధేస్తోంది. వైఎస్ కోరుకున్న రాష్ట్రం ఇది కాదు. సమన్యాయం చేసింది వైఎస్సే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేసింది వైఎస్ ఒక్కరే. మూడు ప్రాంతాలనూ ఆయన సమానంగా ప్రేమించారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఏ వర్గం, గ్రామం, ఏప్రాంతం వారైనా అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేశారు. సమానంగా సాయం చేశారు. రైతులు కరువుతో అల్లాడే సీమాంధ్ర జిల్లాల కోసం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను ప్రారంభించారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి కరువు జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య నివారణకు కృషి చేశారు. రాయలసీమలో వెలిగొండ, వెలిగల్లు, తెలుగుగంగ, హంద్రీ నీవా; తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి. బీమా, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు చేపట్టారు. ఏడు జిల్లాల్లో 16.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రాణహిత-చేవెళ్ల మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు తోటపల్లి, వంశధార-3 ఫేజ్, జంఝావతి మొదలు పెట్టారు. తెలంగాణకు అడ్డుపడేవాళ్లం కాదు తెలంగాణకు న్యాయం జరుగుతుందంటే, అక్కడి ప్రజలు మెరుగ్గా బతుకుతామంటే అడ్డుపడే వ్యక్తులం కాదు. అయితే భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం మంచిది కాదు. భావోద్వేగం చల్లారిన తర్వాత వాస్తవికత ప్రజలకు అనుభవం అవుతుంది. ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా మళ్లీ జీవన సమరం మొదలవుతుంది. సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. నీరు, ఆహారం, చదువు, విద్యుత్తు, ఉద్యోగం, రోడ్లు, ఉపాధి, ఆహారం, ఆవాసం, శాంతిభద్రతల వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాంగ్రెస్ నిర్ణయం ఏ ప్రాంతానికి ఏ మేరకు మేలుగా పరిణమిస్తుందో తెలియని పరిస్థితి! వాళ్లు రాజనీతిజ్ఞుల్లా న్యాయం చేయలేదు. సీట్లు, ఓట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దన్నుతోనే రాష్ట్ర విభజన... తెలంగాణ ఇచ్చేయండంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో లేఖలు రాసిచ్చారు. ఒక ఓటు, రెండు రాష్ట్రాలు సిద్ధాంతమున్న బీజేపీతో 1998లో కలిసి పోటీ చేశారు. తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి మరీ 2009లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వాలని 2008లో ప్రణబ్ కమిటీకి రాసిచ్చారు. ఇక 2013లో తెలంగాణపై కన్ఫర్మ్ చేసేశారు. నీటి సమస్య, హైదరాబాద్, ఉద్యోగాలు గురించి ఏమీ రాయకుండా రాజకీయం కోసం ఇలా చేశారు. బాబు సహకారంతో విభజన ను కాంగ్రెస్ సులభంగా ప్రకటించగలిగింది. విభజన ప్రక్రియ జరగబోతుందని తెలిపి, గత జూలై 25నే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బాబు చోద్యం చూడకుండా తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా రాజీనామా చేస్తే ఇంతదూరం రాదు. ఇప్పుడేమో రాజధాని నిర్మాణంపై కాకి లెక్కలు చెబుతున్నారు. ఎన్ని లక్షల కోట్లిచ్చినా హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడం అసాధ్యం. కేంద్రం వైఖరి ఉమ్మడి కుటుంబంలో తండ్రి తన కుమారుల్లో ఒకరికి ఇల్లు, ఆస్తుల వంటివన్నీ ఇచ్చి, మరొకరిని కట్టుబట్టలతో వెళ్లిపోయి ఇల్లు కట్టుకొమ్మనట్లు ఉంది. సమరదీక్ష సభకు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మేకపాటి, నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్సీపీ ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్లు బాలాజీ, ఉదయభాను, బాలరాజు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, భూమన, సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల నాని, తానేటి వనిత, కొడాలి నాని, జోగి రమేశ్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, పార్టీ నేతలు వంగవీటి రాధ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, జ్యోతుల నెహ్రూ, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పి.గౌతంరెడ్డి, కణితి విశ్వనాథం, జ్యేష్ట రమేశ్‌బాబు, మేకా ప్రతాప్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. జగన్‌ను చూస్తే గర్వంగా ఉంది ఏ ప్రాంతం వారైనా వైఎస్‌కు బిడ్డలతో సమానమే. అందుకే ఆయన రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నారు. పార్టీలో ఉండి అడ్డుకున్నారు. వైఎస్ వారసుడిగా జగన్ ఆ బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నాడు. రాజకీయాలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని జైల్లో నిరాహార దీక్ష చేయాలనుకున్నాడు. నేను వెళ్లినప్పుడు నాకు అదే విషయం చెప్పాడు. ‘ఇప్పటికే వారానికి రెండు ములాఖత్‌లు ఇస్తున్నారు. కేవలం ఆరుగురినే కలవగలుతున్నావు. నిరాహార దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దు చేసి, ఈ జైలు నుంచి వేరే రాష్ట్రానికి ఎక్కడికైనా పంపుతారేమో. నీ తరఫున నేను నిరాహార దీక్ష చేస్తా’నని చెప్పి వచ్చా. జైల్లో ఉండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న జగన్‌ను చూసి గర్వంగా ఉంది. జైల్లో ఉన్న ఈ 15 నెలల్లో జగన్ తనకు నిద్ర పట్టడం లేదని నాకెప్పుడూ చెప్పలేదు. విభజన ప్రక్రియ గురించి విన్నప్పట్నుంచీ మాత్రం మనసుకు ఎంతో కష్టంగా ఉందని చెబుతున్నాడు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటున్నాడు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నాడు. రెండు ప్రాంతాలూ కలిసుండే రోజు వస్తుందని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’’ బీఎస్ఎఫ్ దళాల భయోత్పాతం సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న మహిళలు, వృద్ధులు దీక్షా శిబిరం చేరుకోవడానికి నానాప్రయాస పడాల్సి వచ్చింది. భద్రత పేరుతో శిబిరానికి నలువైపులా దారుల్లో బీఎస్ఎఫ్ దళాలు మోహరించాయి. సాయుధ సిబ్బంది కవాతు చేస్తూ శిబిరానికి వచ్చే వారికి లాఠీలు చూపిస్తూ అడ్డుగా నిలిచారు. దీనిపై పలువురు ఆగ్రహించారు. ఇది ప్రభుత్వ కుట్రేనంటూ మండిపడ్డారు. విజయమ్మకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారిని ఖాకీల దన్నుతో తొలి రోజు నుంచే కట్టడి చేస్తున్నారంటూ ఆక్షేపించారు.