
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గాలో కుల, మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం కష్టపడుతూనే ఉంది. భక్తులకు రక్షణ కల్పించి పండగను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసుశాఖ శ్రమిస్తోంది. అయితే కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ భక్తుల మనోభావాలను దెబ్బతిస్తోంది. పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తోంది. గురువారం దర్గా ప్రాంగణంలో కొందరు పోలీసు సిబ్బంది, అధికారులు ఓవర్‌యాక్షన్ చేయడంపై భక్తులు తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు.
ఓ దశలో ఎస్సై స్థాయి అధికారి అనుచిత ప్రవర్తనతో విసిగిపోయిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో కూడా మహిళలను చేతులతో నెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మహిళలని కూడా చూడకుండా చేతులతో నెట్టడంపై భక్తులు అసహనానికి గురయ్యారు. అలాగే దర్గా నుంచి వెలుపలకు వెళ్లే దారిలో ఉన్న ఎస్సై స్థాయి అధికారి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. భక్తులను ఏరా..పోరా..అంటూ అతిగా ప్రవర్తించడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి కూడా భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా వారిపైనే కన్నెర్ర చేయడం గమనార్హం.
ప్రశంసలు ఉన్నాయి.
గుంటూరు రేంజ్ పరిధిలోని సివిల్ పోలీసులు, సాయుధ దళాలు రొట్టెల పండగ విజయవంతానికి కృషి చేసి భక్తుల మన్ననలు పొందుతున్నారు. పోలీసు కంట్రోలు రూం ఏర్పాటు చేసి తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో పాటు ఎన్నో సేవలు అందిస్తూ్త ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ వల్లే ఆ శాఖకు చెడ్డపేరు వస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు ఓవర్‌యాక్షన్ చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment