సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.
ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
నిఘా నీడలో...
రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment