మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డిలతో సెల్ఫీలు తీసుకుంటున్న భక్తులు
రొట్టెల పండగలో కీలక ఘట్టమైన గంధోత్సవంతో బారాషహీద్ దర్గా ప్రాంగణం సుగంధ పరిమళమైంది. స్వర్ణాల తీరం పవిత్రమైంది. భక్త జనులతో రొట్టెల పండగ జన సంద్రంగా మారింది. రెండో రోజూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు నెరవేరిన వారు.. కోరికలతో వచ్చిన వారు భక్తితో సంప్రదాయబద్ధంగా రొట్టెలు ఇచ్చి పుచ్చుకున్నారు. తమ ఇచ్ఛలు నెరవేరాలని భక్తితో షహీదుల సమాధులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన గంధోత్సవంలో గంధం కోసం భక్తులు పోటీపడ్డారు.
సాక్షి, నెల్లూరు: నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో గంధ మహోత్సవంలో సుగంధపరిమళాలు వెదజల్లాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. కులాలకు అతీతంగా, మత సామరస్యంగా జరుగుతున్న రొట్టెల పండగకు రెండో రోజు బుధవారం భారీగా భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువు తీరాన పవిత్ర స్నానమాచరించి తీరిన కోర్కెలతో భక్తులు రొట్టెలు వదలగా.. కోర్కెలతో వచ్చిన భక్తులు రొట్టెలు పట్టుకున్నారు. అనంతరం బారాషహీద్‌లను భక్తితో దర్శించుకున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు.
భద్రత మరింత పటిష్టం
రొట్టెల పండగలో ముఖ్య ఘట్టమైన గంధోత్సవం బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి భక్తులు రాక ద్విగుణీకృతమైంది. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. భక్తజనంతో చెరువు కిటకిటలాడింది. ఇప్పటికే భక్తుల రాకను అంచనా వేసి నగర పాలక సంస్థ అధికారులు విస్తృతమైన వసతి ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భక్తుల రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలతో పాటు భక్తుల రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించారు.
షహీదులను దర్శించుకున్న రాష్ట్రమంత్రులు
బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండగ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వర్ణాలచెరువులో సంప్రదాయబద్ధంగా కోరికల రొట్టెలను పట్టుకున్నారు. అనంతరం షహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం ఇన్‌చార్జి గిరిధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు రూప్‌కుమార్‌యాదవ్, అధికారులు ఉన్నారు.
కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు
భక్తుల సౌకర్యార్థం దర్గా ప్రాంగణంలో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. భక్తులకు అన్నదానం, వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు.
వైభవంగా ‘గంధ’మహోత్సవం
బుచ్చిరెడ్డిపాళెం: రొట్టెల పండగలో భాగంగా బుధవారం అర్ధరాత్రి గంధమహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవానికి ఏర్పాట్లు మందుస్తుగానే జరిగాయి. తొలుత కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ప్రత్యేక గంధాన్ని కోటమిట్టలోని అమీనియా మసీదు వద్దకు చేర్చారు. ఖలీఫాలు, సూఫీ మత గురువులు తదితరులు అక్కడికి చేరారు. అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక బిందెల్లో గంధాన్ని నింపారు. సుగంధ ద్రవ్యాలను అందులో కలిపారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక వాహనంలో గంధం బిందెలను చేర్చారు. బాణసంచా, భక్తి గీతాలాపనల నడుమ వాహనం ముందుకు సాగింది. పురవీధుల మీదుగా ఈద్గా వద్దకు చేరింది. అక్కడ ఉంచి వాటికి ప్రార్థనలు జరిపారు. ఫకీర్లు అబ్బుర పరిచే విన్యాసాలు చేశారు. అనంతరం ఒక బిందెను గుర్రంపై చేర్చి, మిగతా 11 బిందెలను 11 మంది తీసుకుని బారాషహీద్ దర్గాకు చేరారు. అక్కడ కడప పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్‌షా అరీఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధాన్ని షహీద్‌ల సమాధులకు లేపనం చేశారు. అనంతరం భక్తులకు పంచిపెట్టారు. అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు పరమపవిత్ర గంధాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, మత గురువులు, సూఫీ మత గురువులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment