మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం.. కోర్కెల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కె›లు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జనసంద్రంగా మారింది. భక్తజనంతో బారాషహీద్ దర్గా పులికించింది.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నెల్లూరు సిటీ: ఎన్నెన్నో కోర్కెలతో రొట్టెల పండగకు వచ్చిన భక్తులతో బుధవారం బారాషహీద్ దర్గా పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నమ్మకానికి ప్రతీకగా ఉండే బారాషహీద్‌లను దర్శించుకునే భక్తులతో దర్గా దారులు జనప్రవాహమయ్యాయి. స్వర్గాల చెరువు జనసంద్రమైంది. విద్య, ఆరోగ్య, వివాహ, సౌభాగ్యం వరాలను పొందేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలు మార్చుకున్నారు. ఉద్యోగం, వివాహం, ఆరోగ్య ఇతర రొట్టెలను తీసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో నిరీక్షించి 12 మంది అమరవీరులను స్మరిస్తూ, దర్శించుకున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత రవాణా
బారాషహీద్ దర్గాకు వచ్చే భక్తుల్లో నడవలేని వృద్ధులు, దివ్యాంగులను కార్పొరేషన్ ఉన్నతాధికారుల కారుల్లో దర్గా వరకు తీసుకెళ్లి తీసుకువస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు దర్గాను సందర్శించేందుకు, రొట్టెలు మార్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీల్‌చైర్‌లను సైతం ఏర్పాటు చేసి భక్తులకు దర్గాను సందర్శించేందుకు అవకాశం కల్పించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ విజయారావు, కమిషనర్ హరిత, ఇతర అధికారులు దర్గా ప్రాంగణంలో పర్యటించారు.
ధనం రొట్టె వదిలాను
మేము ఐదేళ్లు గా ఇక్కడకు వస్తున్నాం. కోరిన కోరి కలు మాకు తీరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా రాలేదు. ఇప్పుడు ధనం రొట్టెను వదిలాను. ప్రస్తుతం ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. మాతో పాటు మా బంధువులు కూడా వచ్చారు.
– సుల్తానా బేగం, హైదరాబాద్
ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నాం. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. నా ఆరోగ్యం చాలా బాగోలేదు. రొట్టెను పట్టుకున్నాక.. కుదుట పడింది. అందుకే ఇప్పుడు కూడా ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు దొరికింది.
– హసీనా, కోలార్
భక్త సుగంధమై..
రొట్టెల పండగలో కీలక ఘట్టం గంధమహోత్సవం. బుధవారం అర్ధరాత్రి దాటాక కోటమిట్టలోని అమీనియా మసీదులో సంప్రదాయంగా మతపెద్దలు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో అత్తర్లు.. సుగం«ధ «ద్రవ్యాలు.. పన్నీరుతో పవిత్ర గంధాన్ని 12 బిందెల్లో భక్తిశ్రద్ధలతో కలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, నమాజు అనంతరం గంధం నింపిన బిందెలను తీసుకుని విశేషంగా అలంకరించిన వాహనంపైకి చేర్చారు. ముందు నిషాని జెండా వెళ్తుండగా అశేష భక్తజనం వెంటరాగా భారీ బందోబస్తు నడుమ గంధమహోత్సవం కోటమిట్ట, జెండావీధి, పెద్దబజారు, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోలు బంక్, జిల్లా పోలీసు కార్యాలయం, డీకేడబ్ల్యూ కళాశాల మీదుగా బారాషహీద్‌ల దర్గా వద్దకు చేరింది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో ముజావర్లు, ఫకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 12బిందెలలో తెచ్చిన గంధాన్ని బారాషహీద్‌లకు లేపనం చేశారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంచారు. గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్యక్రమాలను దర్గా ఫెస్టివల్ కమిటీ, దర్గా పరిరక్షణ కమిటీ, వక్ఫ్‌బోర్డు పర్యవేక్షించారు.
– నెల్లూరు (బృందావనం)
Comments
Please login to add a commentAdd a comment