
పోలీస్ అయితే..
రాంగ్‌రూట్‌లో వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వెహికల్
వెంటపడి పట్టుకున్న ప్రజలు - బందరురోడ్డులో ఉద్రిక్తత
సాధారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనదారులను పోలీసులు చేజ్ చేసి పట్టుకుంటారు. ఇక్కడ సీన్ రివర్‌స అయింది. రాంగ్‌రూట్‌లో రావడమే కాకుండా ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టి పలాయనం చిత్తగించిన పోలీస్ వాహనాన్ని ప్రజలే చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. బందరురోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ప్రజలను అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. గాయపడిన కాశీ విశ్వేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
లబ్బీపేట : నిబంధనలు ప్రజలకే కానీ తమకేంటని అనుకున్నారో ఏమో కానీ,..రాంగ్ రూట్‌లో వెళ్తూ..ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టి ...ఆపకుంటూ పరారవుతున్న పోలీస్ వెహికల్‌ను ప్రజలు వెంటాడి పట్టుకున్నారు. ప్రజలు పట్టుకున్న వాహనాన్ని పోలీసు వాహనంగా గుర్తించిన అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు పంపించి వేయడంతో ప్రజల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. వందలాదిగా అక్కడకు చేరుకుని పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మహాత్మాగాంధీ రోడ్డులోని మాన్య షోరూమ్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన పోలీసు వాహనం బొలోరో (నంబరు ఏపీ 18పి 1064) డ్రైవరు పశువుల ఆస్పత్రి వైపు నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లేందుకు మాన్య షోరూమ్ వద్ద రాంగ్‌రూట్‌లో యూ టర్న్ తీసుకునే ప్రయత్నించాడు. అదే సమయంలో మరోవైపు ద్విచక్రవాహనదారులు నిబంధనలకు అనుగుణంగా యూటర్న్ తీసుకుంటుండగా, పోలీసులు వెహికల్ ఒక బైక్‌ను ఢీకొంది. దీంతో అతడి వాహనం వెళ్లి వెనుక వస్తున్న బీఎండబ్ల్యూ కారుపై పడింది.
కాగా బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వెహికల్ వెనక్కి వచ్చి బెంజిసర్కిల్ వైపు వెళ్లిపోతుండగా, ప్రజలు వెంబడించి దానిని పట్టుకున్నారు. ఈ ఘటన చూసిన పలువురు పోలీసు వాహనం డ్రైవర్‌పై దాడికి యత్నించడంతో అక్కడ వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వాహనాన్ని పంపించివేశారు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న వందలాది మంది ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడం, పెద్ద సంఖ్యలో యువత అక్కడకు చేరుకోవడంతో పోలీసు వాహనాన్ని పంపించిన కానిస్టేబుల్‌తో పాటు, అక్కడకు చేరుకున్న ఇతర ట్రాఫిక్ పోలీసులు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. కాగా బైక్‌పై వస్తూ గాయపడిన కాశీ విశ్వేశ్వరరావును 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆపకుండా వెళ్లడంపైనే ఆగ్రహం..
రాంగ్‌రూట్‌లో వెళ్లడం, ప్రమాదాలు చేయడం ఎవరికైనా జరుగుతుందని, కానీ బైక్‌ను ఢీకొట్టి గాయాలతో పడివున్న వ్యక్తిని వదిలి పారిపోయే ప్రయత్నం చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వాహనం అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నచ్చజెప్పిన సీఐలు..
కాగా వందలాది మంది ప్రజలు రోడ్డుపై ఆందోళన చేస్తుండగా, కృష్ణలంక సీఐ ఎస్‌వీవీఎస్‌మూర్తి, నాల్గవ ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. ప్రజల నుంచి ఘటన వివరాలను తెలుసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బైక్‌పడి దెబ్బతిన్న బీఎండబ్ల్యూ కారు యజమానితో సైతం చర్చించారు. దీంతో సుమారు ఆర్థగంటకు పైగా నెలకొన్న ఉద్రిక్తతకు తెరదించారు. కాగా ప్రమాదానికి కారణమైన వెహికల్ గుంటూరు జిల్లా పోలీసులకు సంబంధించినది కాగా, డ్రైవర్‌ను అరుణ్‌కుమార్‌గా గుర్తించామని తెలిపారు.