ఆదివారం ఉదయం... బంకు జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉంది. గోపాలపట్నం ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మళ్ల మహేష్ పోలీసు సిబ్బందితో ట్రాఫిక్‌ను చక్కదిద్దే పని మొదలు పెట్టారు.
రాంగ్‌రూట్‌లో కారొస్తోంది. ట్రాఫిక్ సీఐ వాహనాన్ని ఆపారు. మిర్రర్ కిందకు దిగింది. కారు నడుపుతున్న వ్యక్తి ‘నేను మంత్రి తాలూకా. కావాలంటే ఫోన్ కలుపుతా...మాట్లాడతా’ అన్నాడు. సీఐ అదరలేదు...బెదరలేదు... మొహమాటపడలేదు. మౌనంగా చేయాల్సింది చేసేశారు. ఫైన్ రాసి బిల్లు చేతిలో పెట్టేశారు. కారు నడిపిన వ్యక్తి మాట్లాడకుండా కట్టేశాడు. ఆ తర్వాత మరో కారొచ్చింది. ‘హోం మంత్రి తాలూకా’ అన్నాడు... మళ్లీ అదే దృశ్యం. సీఐ ఫైను రాశారు... నిబంధనలు పాటించకపోతే ఎవరైనా ఒకటేనని గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్ రుజువు చేశారు. బంక్ జంక్షన్‌లో రాంగ్‌రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై నిర్మొహమాటంగా ఫైన్ విధించారు.
⇒ రాంగ్‌రూట్లో దూసుకొచ్చిన వీఐపీలు
⇒ అడ్డుకున్న ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్
⇒ మంత్రులు తెలుసంటూ వాగ్వాదం
⇒ పట్టించుకోని సీఐ...ఫైన్ వసూలు
గోపాలపట్నం: ఆదివారం ఉదయం... బంకు జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉంది. గోపాలపట్నం ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మళ్ల మహేష్ పోలీసు సిబ్బందితో ట్రాఫిక్‌ను చక్కదిద్దే పని మొదలు పెట్టారు. రాంగ్‌రూట్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులు, డ్రయివింగ్ పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బస్ కారిడార్ నుంచి బడాబాబులు దూసుకొస్తుండటాన్ని అంతా గమనించారు.
నిషేధిత మార్గంలో వస్తున్న వాహనాలపై సీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా గమనించారు. బస్సులు రాకపోకలు సాగించే మార్గంలో ఇతర వాహనాలు రావడంపై సీఐ అభ్యంతరం చెప్పారు. తొలుత నేవీ చీఫ్ ఇంజనీరు వాహనం, తర్వాత నేవీ అధికారి వాహనం ఒకదాని వెనుక వచ్చాయి. ఈ వాహనాలను ఆపి రూ.300 చొప్పున జరిమానా విధించారు. ఆ తర్వాత దూసుకొచ్చిన మరో కారును సీఐ ఆపారు. దీంతో కారు యజమాని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. తాను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి తాలూకా అని... కావాలంటే ఫోన్ కలుపుతా... మాట్లాడండని కారులోంచి దిగకుండా చెప్పినా సీఐ మొహమాటం లేకుండా ఫైన్ విధించారు.
‘నిజానికి మంత్రుల కుటుంబీకులు తప్పు చేయరని...వారు ఏనాడూ తప్పు చేసేవారిని సమర్ధించబోరని’ కారు యజమానితో సీఐ అన్నారు. ఇక్కడ ఫైన్ కడితే తప్ప వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేయడంతో కారు యజమానితో పాటు మరో మహిళ చెల్లించి కదిలారు. దాని వెనుక దూసుకొచ్చిన మరో కారునీ సీఐ అడ్డుకున్నారు. తాను హోం మంత్రి తాలూకా అంటూ చెప్పబోయాడా యజమాని. అయినా ఫైన్ కట్టాల్సిందేనని సీఐ ఫైన్ రాసి పంపించారు. ఇక ఇదే దారిన రాంగ్ రూట్లో వచ్చిన గోపాలపట్నానికి చెందిన మరో కానిస్టేబుల్‌కి కూడా ఫైన్ రాశారు. ఇలా ఎవరు అధికారం చెలాయించినా వెనక్కి తగ్గకుండా నిబంధనల్ని గుర్తు చేసిన సీఐని అంతా అభినందించారు.