..అలా వద్దంటున్నారు !
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కమిషనర్...అధికారం మాది మేము చెప్పినట్లు జరగాలని మేయర్...దాదాపు వంద రోజుల పాలనలో ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గలేదు. తెగేదాకా లాగారు. ఇంకేముంది తమ మాట వినని కమిషనర్ వద్దనికలెక్టర్‌కు మేయర్ లేఖాస్త్రం సంధించారు. బదిలీ వచ్చినా సరే నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేది లేదని కమిషనర్ భీష్మించుకున్నారు.
సాక్షి, చిత్తూరు: ‘చిత్తూరు నగరపాలక కమిషనర్ రాజేంద్రప్రసాద్‌తో మేము వేగలేకపోతున్నాం.. తక్షణమే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయండి’ అంటూ చిత్తూరు మేయర్ కఠారి అనురాధ కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు విన్నవించారు. మంగళవారం కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు.
విభేదాలకు బీజం పడిందిలా..
చిత్తూరు కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించినప్పటి నుంచి కమిషనర్, మేయర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. కార్పొరేషన్‌లో పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వాలనే అంశాన్ని అజెండాలో కమిషనర్ చేర్చారు. దీన్ని మేయర్ తిరస్కరించారు. ప్రస్తుతం మూడు నెలలుగా కూలీ లంతా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాన్ని కమిషనర్ జీర్ణించుకోలేకపోయారు. పాత కాంట్రాక్టర్ పేరుతో వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ప్రస్తుతం శేఖర్‌బాబుకు కొత్త కాంట్రాక్టు ఇచ్చామని, కాబట్టి పాత వేతనాలు ఇప్పట్లో ఇచ్చేది లేదనే తీరుగా వారు వ్యవహరించారు. కాంట్రాక్టర్ పేరుతో కూలీల వేతనాలను రాజకీయం చేయడం తగదని మేయర్‌కు సూచించారు.
అలాగే తొలి పాలకమండలి సమావేశం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది బహిరంగ రహస్యం. ఎజెండాలోని అంశాలపై చర్చ జరిపి సభ్యుల ఆమోదం మేరకే అజెండాలోని అంశాలను పాస్ చేయాలి. అయితే సభ్యులు మధ్య చర్చ లేకుండా,వారు చేతులెత్తి అజెండాలోని అంశాలను ఆమోదించకుండానే ఏకపక్షంగా సమావేశాన్ని నిర్వహించారు. ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ సమావేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపించారు. దీన్ని కమిషనర్ సహించలేదు. అక్కడ మొదలైన విభేదాలు తారస్థాయికి చేరాయి.
ఇద్దరి మధ్య విభేదాలకు ఆజ్యంపోసిన కారణాలు ఇవే!
కార్పొరేషన్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఈ అంశాన్ని అజెండాలో పాస్ చేశారు. విగ్రహం ఏర్పాటుకు కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. వర్క్ ఆర్డర్ ఇవ్వకుండానే పనులు ప్రారంభించారు. దీనికి బిల్లులు ఇవ్వాలని మేయర్ సిఫార్సుచేస్తేఅనుమతి రానిదే బిల్లులు ఇవ్వలేమన్నారు.
కార్పొరేషన్ మీటింగ్‌హాలులో కమిషనర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ చాంబర్‌ను కుదించారు. ఇదేంటని కమిషనర్ ప్రశ్నిస్తే ‘వాస్తుదోషమని’ చెప్పారు. పాలకవర్గం మారినప్పుడల్లా వాస్తుదోషం పేరుతో ఇలా వ్యవహరించడం సరికాదని కమిషనర్ చెప్పారు.
నీటిసరఫరాకు 80 ట్యాంకర్లకు పాలకవర్గం ఆమోదించింది. కానీ 120 ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. దీనికి కమిషనర్ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడ్డాయని, కొన్నిచోట్ల బోర్లలో నీటిమట్టం కూడా పెరిగిందని, ఈ క్రమంలో ట్యాంకర్లను తగ్గించాలనుకుంటే ఇంకా పెంచడమేంటని కమిషనర్ ప్రశ్నిస్తున్నారు.
మేయర్ పుదుచ్చేరి రిజిస్ట్రేషన్‌తో పార్చూనర్ కారు తెప్పించుకున్నారు. దీనికి మూన్నెళ్లుగా బాడుగ బిల్లు ఇవ్వడంలేదు. టెండర్ పిలవకుండా బిల్లు ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్ చెబుతున్నారు.
ఎమ్మెల్యేతో తమకు విభేదాలు తలెత్తేలా కమిషనర్ వ్యవహరిస్తున్నారని కూడా మేయర్ పేర్కొన్నారు. చిత్తూరు ఆడిటోరియానికి చిత్తూరు నాగయ్యపేరు, పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే సత్యప్రభ సిఫార్సుచేస్తే దాన్ని పాలకవర్గం నిరాకరించింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. తిరిగి చిత్తూరు నాగయ్యపేరు మహతి కళాక్షేత్రానికి పెట్టడంతోపాటు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పనిచేసిన అన్నిచోట్లా మంచిపేరు తెచ్చుకున్న కమిషనర్
ప్రతి అంశంలోనూ కమిషనర్ నిబంధనల మేరకే కార్పొరేషన్ నడవాలని, అందుకు భిన్నంగా ఎలాం టి నిర్ణయం తాను తీసుకోలేనని తెగేసి చెబుతున్నా రు. ఈ అంశంలో రాజేంద్రప్రసాద్ పనిచేసిన చోట ఎక్కడా? ఎప్పుడూ రాజీపడలేదనే మంచిపేరు ఉం ది. పైగా రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు, నియమావళి తెలిసిన ఒకరిద్దరిలో ఈయన ఒకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరికి ఏ సందేహం వచ్చినా రాజేంద్రప్రసాద్‌కు ఫోన్‌చేసి చర్చిస్తా రు. అందుకే ఈయనను రాష్ట్ర మునిసిపల్ కమిషనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. ప్రస్తుతం ఈయనే కొనసాగుతున్నారు. తనకున్న మంచిపేరు పోకూడదానే కారణంతో కమిషనర్ ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల్లో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా కమిషనర్‌కు మద్దతుగా ఉన్నట్లు తెలిసింది.
నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటా
నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటాను. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది? నేనేంటి అనే విషయం అందరికీ తెలుసు. మేయర్ ఇచ్చిన లేఖపై నేను మాట్లాడదలచుకోలేదు.
-రాజేంద్రప్రసాద్, కమిషనర్, చిత్తూరు
నియంతలా వ్యవహరిస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో రాజేంద్రప్రసాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. నేను, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సూచిస్తున్న ప్రజా సమస్యలపై ఏమాత్రం స్పందించడంలేదు. నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారు. నాకు,ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు వచ్చే విధంగా చిచ్చు పెడుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు.
-కఠారి అనురాధ, చిత్తూరు మేయర్