బొజ్జల వర్సెస్ గాలి
ఎత్తుకు పైఎత్తులు
డీఆర్‌వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు
చివరి నిమిషంలో చక్రం తిప్పిన బొజ్జల
ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు
తిరుపతి తుడా: అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. జిల్లా డీఆర్‌వో పోస్టు వ్యవహారం ఇందుకు వేదికైంది. తమకు నచ్చిన.. మెచ్చిన అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముందుగా డీఆర్‌వో పోస్టులోకి జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సఫలమయ్యారు. తాను మంత్రిగా ఉండగా జిల్లా ఉన్నతాధికారి నియామకం తాను చెప్పిన వారికే దక్కాలని మరో అధికారి ఎం.వెంకటేశ్వరరావు పేరును బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెరపైకి తీసుకొచ్చారు.
డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు
జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను డీఆర్‌వోగా దాదాపు పేరు ఖరారైందని మంగళవారం జోరుగా ప్రచారం సాగింది. స్థానికుడైన విజయ్‌చందర్‌ను జిల్లా పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళుతూ డీఆర్వోగా విజయ్‌చందర్ పేరును ఖరారు చేసి వెళ్లారు. మరుసటి రోజు బుధవారం కల్లా ఆ జీవోను పక్కన పెట్టించిన మంత్రి మరో జీవో సిద్ధం చేయించినట్టు సమాచారం.
సీఎం లేని సమయంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో గోపాలకృష్ణారెడ్డి ఈ పోస్టు కోసం చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తిరిగి వచ్చేవరకు డీఆర్వో నియామక జీవోను(పాత) పక్కన పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. తాను చెప్పిన ఎం.వెంకటేశ్వరరావు (తిరుపతి పూర్వ ఆర్డీవో) పేరుతో తయారు చేసిన జీవోను విడుదల చేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నిం చేయనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ముద్దుకృష్ణమకు తెలియడంతో మంత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి తిరిగి వచ్చాక ఎవరి మాట చెల్లుతుందో తేలనుంది.
అధికారుల బదిలీల్లోనూ..
జిల్లాకు చెందిన అధికారుల బదిలీల్లోనూ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ఎవరికి వారు పోటీ పడుతు పడుతున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల బదిలీల్లో తమకు అనుకూలమైన వారిని వారు కోరుకన్న స్థానాలకు బదిలీ చేయాలని ఇద్దరూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది.