ఇది ఓట్ల ‘ప్లాన్’! | political leaders are planning for votes | Sakshi
Sakshi News home page

ఇది ఓట్ల ‘ప్లాన్’!

Published Sat, Jan 25 2014 3:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

political leaders are planning for votes

 ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రచారానికే పరిమితం  
 చట్టం చేసి ఏడాది పూర్తయినాఒక్క పైసా విడుదల చేయని పరిస్థితి
 అభివృద్ధికి నోచుకోని ఎస్సీ, ఎస్టీ గ్రామాలు
  ఎన్నికల్లో లబ్ధికే అంటున్న ఆయా వర్గాలు
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వెక్కిరిస్తోంది. నీటి బుడగ మాదిరిగా మారిపోయింది. బయటకు బాగా కనిపిస్తున్నా లోపలంతా శూన్యమే. చట్టం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నా దళిత, గిరిజనులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. కేవలం ప్రచారానికే పరిమితమైంది. ఇదిగో అదిగో అంటూ సర్కార్ ఊరించడమే తప్ప నిధులు విదిల్చిన దాఖల్లాలేవు. కోట్లాది రూపాయలతో చేసిన ప్రచారం వృథా ప్రయాసే అయ్యింది. గతంలో ఉన్న స్పెషల్ కాంపోనెట్ ప్లాన్‌నే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌గా మార్చిన సర్కార్ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. చట్టం పేరుతో పరిహాసమాడిందే గానీ ఏ ఒక్కరికీ లబ్ధి చేకూర్చలేదు. కనీసం అమలుకు సంబంధించి నియమ నిబంధనల్ని  రూపొందించలేదు. ఈ నెపంతో సాధారణ నిధులను కూడా విడుదల చేయకుండా దళిత, గిరిజనుల సంక్షేమానికి తూట్లు పొడిచింది.
 
 ఆదరణ కోల్పోతున్న వేళ...
  రోజు రోజుకూ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఓట్ల రాజకీయాల కోసం ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసింది.  ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం, వివిధ ప్రభుత్వ శాఖలకు జరిగే కేటాయింపుల్లో నిర్దిష్ట శాతంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు ఈ సబ్‌ప్లాన్‌ను రూపొందించింది. ఏ రాష్ర్టంలో ప్రవేశపెట్టని విధంగా చట్టాన్ని తీసుకొచ్చామని కిరణ్ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. ఈ ఘటన తనదంటే, తనదని ఇటు ముఖ్యమంత్రి, అటు ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు గుప్పించుకుని, వందిమాగదులతో జేజేలు కొట్టించుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి జిల్లాలో ప్రచార రథాలు, కళాకారులతో ప్రచారార్భాటాలు చేశారు. కానీ 27 శాఖలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఒక్క రూపాయి కూడా నేటికీ విడుదల చేయలేదు.  ఫలితంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గ్రామాలు కనీసం సౌకర్యాలకు నోచుకోలేదు.
 
 నిధులెక్కడ...?
 ఈ చట్టం వచ్చి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఇంతవరకు ఏ ఒక్క శాఖకు నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర స్థాయిలో మాత్రం 26 శాఖలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కాగితాల్లో  పేర్కొన్నారు. సోషల్ వె ల్ఫేర్‌కు రూ.2,170.28 కోట్లు, గ్రామీణాభివద్ధికి రూ.వెయ్యి కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.1050 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.600 కోట్లు, హౌసింగ్‌కు రూ.600 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.350 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.200 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు, కుటుంబ  సంక్షేమానికి రూ.311 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.198 కోట్లు, విద్యుత్‌కు రూ.100 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.210 కోట్లు, ప్లానింగ్‌కు రూ.120 కోట్లు ఇలా 26 శాఖలకు మొత్తంగా 7927.45 కోట్లు కేటాయింపులు చేసింది. కానీ జిల్లా స్థాయిలో ఒక్క శాఖకీ నిధులు విడుదల చేయలేదు. ఎంత దారుణమంటే సబ్‌ప్లాన్ వచ్చిన తొమ్మిది నెలలు తరువాత అంటే నవంబర్‌లో  చట్టం అమలు, నిధుల కేటాయింపులు, వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి వంటి విషయాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా ఐటీడీఏ పీఓ, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేర్చింది. కానీ చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికీ ఖరారు చేయలేదు.
 
 అభివృద్ధికి నోచుకోని ఎస్సీ, ఎస్టీ గ్రామాలు
  జిల్లాలో ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీలున్నారు. వీరుంటున్న అత్యధిక గ్రామాలకు రోడ్డు, విద్యుత్, తాగునీటి, డ్రైనేజీ సౌకర్యాలు లేవు.  ఇక ఎస్సీ, ఎస్టీ హేబిటేషన్లయితే కనీసం సదుపాయాలకు నోచుకోకుండా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయింపులు జరిగితే అభివృద్ధికి అవకాశం ఉండేది. ప్లాన్ రూపొందించి ఏడాది కావస్తున్నా నిధులు కేటాయించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాల ముందుకు సాగడం లేదు.  ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లతో లబ్ధిపొందడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
 ప్రచారానికే పరిమితం
 ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రచారానికే పరిమితైంది. దీనికోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. చట్టం చేశారే గానీ నిధులు మంజూరు చేయలేదు. స్పెషల్ కాంపోనెట్ ప్లాన్‌ను సబ్ ప్లాన్‌గా మార్చి చట్టం చేశారే తప్ప ప్రయోజనం లేదు.
 -  ఆతవ ఉదయభాస్కర్, దళిత సంఘాల
 జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement