యువతకు గాలం
యువతీ యువకులపైనే రాజకీయపార్టీల దృష్టి
మునిసిపల్ ఎన్నికల నుంచే మచ్చిక చేసుకునే యత్నం
6,70,564 మంది ఓటర్లలో సగం మంది 25 ఏళ్లలోపు వారే
తాయిలాల ఎర వేస్తున్న రాజకీయ పార్టీల నేతలు
తమ ప్రతినిధి జగన్ అంటున్న నేటి యువతరం
సాక్షి, గుంటూరు
మున్సిపల్ ఎన్నికల్లో మొదటి అంకం ముగిసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీలన్నీ యువత ఓట్లకు గాలం వేసేందుకు పోటీలు పడుతున్నాయి. పట్టణాల్లో యువజన సంఘాలకు తాయిలాల ఎర వేస్తున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా వీరిని తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ నేతలు నానా తంటాలు పడుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి గుంటూరు జిల్లా చుక్కాని అయింది. అన్ని పట్టణాల్లో ప్రధానంగా యువత కదం తొక్కింది. కళాశాలల విద్యార్థులు గళమెత్తి నినదించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై యువతలో ఏహ్యాభావం గూడు కట్టుకుంది.
చైతన్యవంతమైన పట్టణాల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణబద్ధులయ్యారు. లేఖ ఇచ్చి చంద్రబాబు విభజనకు కారణమయ్యారని యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్ కుదేలు కాగా, టీడీపీ యువతను ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతోంది. యువత ఓట్లు మున్సిపాలిటీలలో కీలకం కావడంతో తాయిలాల ఎర వేస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో యువతను తమవైపునకు తిప్పుకుంటే, సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చనే
ఆలోచనతో టీడీపీ నేతలు వున్నారు. దీంతో యువజన సంఘాలను క్రికెట్ కిట్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లతో ఆకట్టుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తరహా వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. టీడీపీకి ప్రధాన మద్దతుదారుగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కళాశాలల్ని ఎంచుకుని యువత ఓట్లకు గాలమేస్తున్నారు.
రాష్ట్ర విభజనకు టీడీపీ కారణం కాదని చెప్పుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు వయస్సు 65కి చేరడంతో యువతపై ఆయనకున్న విజన్ ఏంటని పలు కళాశాలల్లో ప్రశ్నించడం గమనార్హం. యువత ఓట్లను ఆకర్షించడానికి గతంలోనే చంద్రబాబు కళాశాలల వెంట తిరిగినప్పుడు ఆయనకు తలంటిన సందర్భాలు గుర్తు చేస్తున్నారు. యువతరానికి ప్రతినిధి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, చంద్రబాబుకు, జగన్‌కు మధ్య వయస్సు తేడాను ఈ సందర్భంగా యువత గుర్తు చేయడం పరిశీలనాంశం.
25 ఏళ్లలోపు వారే మున్సిపల్ ఓటర్లలో అధికం
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 6,70,564 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వీరిలో 3 లక్షలకు పైగా యువత ఉన్నట్లు అంచనా. - తెనాలిలో 1,28,234 మంది ఓటర్లుంటే, 18-19 సంవత్సరాల ఓటర్లు 3,653 మంది, 20-29 సంవత్సరాల ఓటర్లు 33,693 మంది, 35 ఏళ్ల లోపు ఓటర్లు 30,974 మంది ఉన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 70,684 మంది ఓటర్లుంటే, 20 ఏళ్ల లోపు 6,552 మంది, 30 ఏళ్ల లోపు 27,904 మంది వున్నారు.
ఇక 30 ఏళ్లలోపు ఓటర్లు...
నరసరావుపేటలో 81,250 మంది ఓటర్లుకు 30 ఏళ్ల లోపు ఓటర్లు 42 వేల వరకు ఉన్నారు. బాపట్లలో 50,321 మంది ఓటర్లకు 22,119 మంది, పొన్నూరులో 47,108 మంది ఓటర్లకు 19,076 మంది, రేపల్లెలో 32,866 మంది ఓటర్లకు 14,098 మంది, మాచర్లలో 44,894 మంది ఓటర్లకు 13,789,మంగళగిరిలో 51,614 మంది ఓటర్లకు 25 వేలకు పైగా, సత్తెనపల్లిలో 41,038 మందికి 21,022 మంది, వినుకొండలో 41,038 మందికి 17,157, పిడుగురాళ్లలో 46,852 మందికి 23వేలు, తాడేపల్లిలో 34,665 మందికి 14,919 మంది యువ ఓటర్లున్నారు.