పచ్చని కొండలకు చిచ్చు
విశాఖలోని ఎర్రకొండ, సీతకొండలపై పెద్దల కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో పచ్చని కొండలు, అటవీ భూములు అస్మదీయులకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం, సీఆర్‌జెడ్ నిబంధనలు, వుడా మాస్టర్‌ప్లాన్‌లను బేఖాతరు చేస్తూ భూ పందేరానికి సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి పేరిట దాదాపు 2వేల ఎకరాల అటవీ భూములు ఈ విధంగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది.
మొదటి విడతగా 1,105 ఎకరాల కొండలను అప్పగించేందుకు టెండర్లు పిలిచినా.. ఆ టెండర్లతో నిమిత్తం లేకుండా ముఖ్యనేతకు సన్నిహితులైన ముగ్గురికి కొండలు ధారాదత్తం చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే అటవీ భూములను డీనోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) లేఖ రాసింది. విశాఖ సముద్రతీరానికి సమీపంలో ఎర్రకొండ (893 ఎకరాలు), సీతకొండ (212 ఎకరాలు)లు ఉన్నాయి. పెద్దగంట్యాడలోని నరవ (275 ఎకరాలు), నాగుపూర (446 ఎకరాలు), మధురవాడలోని గుడ్లవానిపాలెం(28 ఎకరాలు)లో అటవీభూములు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీకి ఆర్థికంగా, ప్రచారపరంగా సహకరించిన పెద్దల కన్ను ఆ కొండలపై (అటవీ భూములే) పడింది. విశాఖను పర్యాటక కేంద్రంగా చేస్తామంటున్న ప్రభుత్వం ఆ ముసుగులో ముందుగా ఎర్రకొండ, సీతకొండలను పీపీపీ పద్దతిలో వారికి కట్టబెట్టాలని నిర్ణయించింది. వాటిపై క్లబ్‌హౌస్‌లు, రిసార్టులు, కాసినోలు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 70 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మించి విక్రయించనున్నట్లు సమాచారం.
డీ నోటిఫై చట్ట విరుద్ధం
పట్టణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన వుడా ప్రభుత్వ పెద్దల కోసం రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఆ కొండలపై నిర్మాణాలుగానీ, వ్యాపార కార్యకలాపాలుగానీ చేపట్టకూడదు. అలాగే వుడా మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న ఆ కొండలను పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చారు. వాటిని ఇతర అవసరాలకు కేటాయించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలోనే వుడా ఆ కొండలను డీనొటిఫై చేయాలని కేంద్రాన్ని కోరింది.
అయితే ఎర్రకొండ, సీతకొండలను డీనోటిఫై చేయడం కేంద్ర, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ చట్టానికి విరుద్ధం. అరుదైన ఔషధ మొక్కలతో పాటు జంతుజాలానికి ఈ కొండలు ఆవాసంగా ఉన్నాయి. ఆ కొండలను వ్యాపార కేంద్రాలుగా మారిస్తే ఆ జీవజాలం ఉనికికే ముప్పువాటిల్లుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ కొండలను డీనోటిఫై చేస్తే మరోచోట అంతకురెట్టింపు భూమి అటవీశాఖకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎక్కడ ఇస్తారన్నది మాత్రం చెప్పలేదు.
మరోవైపు ప్రభుత్వం సీఆర్‌జెడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలనూ ఉల్లంఘిస్తోంది. సీఆర్‌జెడ్ 1, సీఆర్‌జెడ్ 3 పరి ధిలో ఉన్న ఆ కొండల ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టంగానీ బోర్లు వేయడంగానీ చేయరాదు. దాదాపు 2వేల ఎకరాల డీనోటిఫై కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరినట్లు జిల్లా కలెక్టర్ యువరాజు ఇటీవల ప్రకటిం చగా.. వుడా కార్యదర్శి కిశోర్ కూడా ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయం ధ్రువీకరించారు.
కార్పొరేట్ శక్తులకు దాసోహం
హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖలో చెట్లు విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం పచ్చని ఎర్రకొండ, సీతకొండలను నాశనం చేయాలని చూస్తోంది. అవి రెండూ విశాఖవాసులకు ప్రకృతి కల్పించిన రక్షణ కవచం. అలాంటివాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం.
- ఈఏఎస్ శర్మ, రిటైర్డ్ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి