కాకినాడ జెఎన్‌టీయూలో స్ట్రాంగ్ రూమ్‌కు కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమక్షంలో సీలు వేస్తున్న సిబ్బంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై, అభ్యర్థుల భవితవ్యం అందులో భద్రంగా ఉంది. ఇక ఫలితాలే మిగిలాయి. ఈ నేపథ్యంలో గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జరిగిన పోలింగ్ సరళిపై బూత్‌ల వారీగా సమీక్ష ప్రారంభించారు. కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఈసారి అనూహ్యంగా పోలింగ్ శాతం పెరగడంతో ఆయా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుంది. జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంది. కొన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ, జనసేన, టీడీపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే ఓటర్లు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ.. ఓటర్లు తమవైపు ఉన్నారని టీడీపీ నేతలు, తమకు గౌరవప్రదమైన ఓట్లు పడ్డాయని జనసేన నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
పెరిగిన ఓట్ల శాతం...
జిల్లాలో ఎన్నడూలేని విధంగా 80 శాతం పోలింగ్ అయింది. గత ఎన్నికల్లో 77 శాతం పోలవ్వగా ఈసారి 3 శాతం పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో 42,04,436 ఓటర్లుండగా వారిలో 33,63,352 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లలో 78.63 శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో అత్యధికంగా అనపర్తిలో 87.48 శాతం, రాజానగరంలో 87.47, రామచంద్రపురంలో 87.11, జగ్గంపేటలో 85.86 శాతం, మండపేటలో 85.52 పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా రాజమహేంద్రవరం సిటీలో 66.34 శాతం, కాకినాడ సిటీలో 66.38 శాతం, రాజమహేంద్రవరం రూరల్‌లో 73.45, కాకినాడ రూరల్‌లో 74.12, రంపచోడవరంలో 77.73, రాజోలులో 79.44 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదయ్యాయంటే తప్పకుండా మార్పునకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కూడికలు, తీసివేతల్లో నిమగ్నం
గత నెల రోజులుగా మండువేసవిలో ఎన్నికల కోసం విరామం లేకుండా పనిచేసిన నాయకులంతా ప్రస్తుతం సేద దీరుతున్నారు. హమ్మయ్యా ఎన్నికలు ముగిశాయని ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇదే సమయంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న టెన్షన్ వారిలో మొదలైంది. నాయకులంతా తమ తమ అభ్యర్థుల వద్దకు వచ్చి పోలింగ్ ఎలా జరిగిందో చెబుతున్నారు. బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్ అయిందో తెలుసుకుంటున్నారు. గెలుపు తమదంటే తమదని అంచనాలకు వచ్చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment