సభలో శవ రాజకీయం
⇒ అధికారపక్షం తీరుపై రాజకీయ వర్గాల విస్మయం
⇒ బాబు ప్రలోభాల వల్లే పార్టీ మారిన భూమా..
⇒ ఆ విషయాన్ని ప్రస్తావించలేకే ప్రతిపక్షనేత గైర్హాజరు
⇒ అయినా అదేదో తప్పు అన్నట్లు అధికారపక్షం రాజకీయం
⇒ సభలో లేని వ్యక్తిపై నిందలు.. సంప్రదాయం కాదు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమా నాగిరెడ్డి చేసిన మంచితో పాటు చివర్లో పార్టీ మారిన విషయం రికార్డులకు ఎక్కడం భావ్యం కాదన్న సదుద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు దూరంగా ఉంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం చూసి రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేం దుకు అధికారపక్షం ఈ చర్చను అవకాశంగా మార్చుకోవడం విచారకరమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సభకు వెళితే భౌతికంగా మన మధ్య లేని వ్యక్తి చరమాంకంలో చేసిన తప్పు గురించి మాట్లాడాల్సి వస్తుందన్న భావనతో ప్రతిపక్షనేత హుందాగా వ్యవహరించినా అందులో ఏదో రంధ్రాన్వేషణ చేసి విమర్శలకు దిగజారడం అధికారపక్షం కుటిల రాజకీయానికి అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అది సభ్యతేనా?
సభలో లేని వ్యక్తిపై ఇంతలా దుమ్మెత్తి పోయడం, దొరికిందే అవకాశం అన్నట్లుగా ఎగబడి తిట్టించడం అసెంబ్లీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. అంతే కాదు.. సభ్యులు చేసిన విమర్శలలో కనీస సభ్యత, సంస్కారం మచ్చుకైనా ఉన్నట్లు కనిపించడం లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తీర్మానంపై చర్చ వదిలేసి ప్రతిపక్షపై విమర్శలకు దిగజారడం శవరాజకీయం తప్ప మరొకటి కాదని విశ్లేషకులంటున్నారు. ఇంత నీచమైన దిగజారుడు రాజకీయం మున్నెన్నడూ ఎరగమని వారంటున్నారు. ప్రతిపక్షనేతపై అధికారపక్షం ఎంతలా కక్షగట్టిందంటే... సంతాపం తెలియజేయాల్సిన భూమా కన్నా జగన్నామస్మరణే ఎక్కువసార్లు చేశారట..
కేసులు పెట్టి హింసించినవారేగా...
ఇపుడు భూమాపై ప్రశంసలు కురిపిస్తున్న అధికారపార్టీ సరిగ్గా ఏడాది క్రితం ఏం చేసింది? బతికి ఉండగా భూమా నాగిరెడ్డిని దారుణంగా టార్గెట్ చేశారు. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అది ఇప్పటికీ అలాగే ఉండడం నిజం కాదా? ఆయనపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. చివరకు జైలుకు కూడా పంపించారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చివరకు కేసులు ఎత్తేస్తాం.. మంత్రి పదవి ఇస్తాం అంటూ ప్రలోభపెట్టి ఆయన్ను వశపరచుకున్నారు. మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారని భూమాయే చెప్పుకున్నారు. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి మరీ భూమాను ప్రలోభపెట్టారు. చివరకు గవర్నర్ ఒప్పుకోవడం లేదంటూ మొండిచేయి చూపించారు. ఈ వెన్నుపోటుతోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని సన్నిహితులు, అనుయాయులు వాపోవడం వాస్తవమే కదా! సొంత మామకు చంద్రబాబు ఇలాగే వెన్నుపోటు పొడిచి గుండెపోటుకు కారణమయ్యారన్న విమర్శలు నిజంకాదా?
అన్నిటికీ అఖిలే సాక్షి..
ఫిరాయింపునకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ సాగించిన నిర్బంధానికి అఖిల ప్రియ ప్రత్యక్ష సాక్షి. పగబట్టినట్లు అధికారపార్టీ ఎంతగా వేధించిందో అఖిలకు తెలియదా? తండ్రిపై పెట్టిన కేసుల గురించి ఆమెకు తెలియదా? పార్టీ మారగానే ఆ దారుణాలన్నీ మంచివైపోయాయా? పదవి ఇస్తామనగానే చంద్రబాబు సహా అందరూ పునీతులుగా కనిపిస్తున్నారా? తండ్రి ఎందుకు చనిపోయా డో ఆమెకు తెలియదా? చివరకు ఆమె కన్నతల్లి శోభానాగిరెడ్డి మరణించినపుడు ఇదే తెలుగుదేశం నాయకులు అసెంబ్లీలో సంతాపతీర్మానం పెట్టకుండా అడ్డుకున్నారన్న విషయం అఖిల మరచిపోయిందా? ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళనతర్వాతే సంతాప తీర్మానంలో శోభ పేరు చేర్చడం నిజం కాదా? కన్నతండ్రి దూరమై 24 గంటలన్నా గడవ లేదు. పుట్టెడు దుఃఖంతో ఉన్న అఖిలను అసెంబ్లీకి తీసుకొచ్చి ఆమెచేత పొగిడించుకో వడం చూసి జనం విస్తుపోతున్నారు. అలాం టి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని అసెంబ్లీకి తీసుకొచ్చి బలవంతంగా మాట్లాడించడం నీచరాజకీయానికి నిదర్శనమని విమర్శకులంటున్నారు.
భూమాను గౌరవంగా చూసింది వైఎస్సార్సీపీనే..
వైఎస్సార్సీపీలో ఉండగా సీనియర్ ఎమ్మెల్యేగా, రాయలసీమలో కీలకనేతగా భూమా నాగిరెడ్డిని కార్యకర్తలు, నేతలు ఎంతగానో గౌరవించారు. పార్టీలో ఉన్నతమైన, కీలకమైన పదవులలో మాత్రమే కాదు కేబినెట్ హోదా గలిగిన పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. భూమా మరణ వార్త తెలిసిన వెంటనే అఖిలప్రియకు విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేయడం నిజం కాదా? జగన్ కుటుంబం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి వెళ్లి భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించలేదా? అయినా ప్రతిపక్షనేతపై బురదజల్లడానికి అధికారపక్షం దీన్నొక సాకుగా చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్లేషకులంటున్నారు.