రాజకీయాలనూ బాధ్యతగా స్వీకరిస్తా :గల్లా జయదేవ్
రాజకీయాలనూ బాధ్యతగా స్వీకరిస్తా :గల్లా జయదేవ్
Published Fri, Mar 14 2014 12:12 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :రాజకీయాలను కూడా బాధ్యతగా స్వీకరిస్తానని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను 25 ఏళ్లపాటు గుంటూరు నగరంలో ఉండేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. సినీ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం రాజకీయాల్లోకిగానీ, ఎన్నికల ప్రచారానికిగానీ రారని, కానీ ఆయన మద్ధతు తనకు ఎల్లవేళల ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరు తనకు అత్తగారి జిల్లాగా చూడకుండా సొంత జిల్లాగా భావిస్తున్నానన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని, అందరి సహకారంతో గుంటూరులో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించేలా చూస్తామని తెలపారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పట్లో ఉన్న నాయకులందరిలోకి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి గల్లా అరుణ మాట్లాడుతూ గుంటూరును గ్రీన్ సిటీగా మార్చగల శక్తి సామర్ధ్యాలు జయదేవ్‌కు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, కోవెలమూడి రవీంద్ర, కందుకూరి వీరయ్య, మద్దిరాల మ్యానీ, సిహెచ్ చిట్టిబాబు, ఎం.రాజేష్, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement