ఎండ తీవ్రతకు వేములపల్లిలోని పౌల్ట్రీలో చనిపోయిన కోళ్లు
తూర్పుగోదావరి ,మండపేట: జిల్లాలోని పౌల్ట్రీల్లో వివిధ దశల్లో సుమారు 2.4 కోట్ల కోళ్లు ఉండగా వీటిలో గుడ్లు పెట్టేవి 1.30 కోట్లు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. రోజుకు 25 నుంచి 28 వేల వరకూ కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. ఐదు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో కోళ్ల మరణాలు ముందెన్నడూ లేనంతగా పెరిగాయని రైతులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 1.5 లక్షల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ.100 వరకు నష్టం వాటిల్లుతుంది.
ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు ఆరు రోజులుగా రూ. తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎండలు మరింత ముదిరితే మరణాల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళనలో కోళ్ల రైతులు ఉన్నారు. మరోపక్క నాలుగు రోజులుగా గుడ్లు ఉత్పత్తి 15 శాతం మేర పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.3.4 పైసలు ఉండగా రోజుకు రూ.దాదాపు రూ.56 లక్షలు చొప్పున ఆరు రోజుల్లో రూ.3.36 కోట్ల మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. ఆయా రూపాల్లో ఆరు రోజుల్లోను పౌల్ట్రీ పరిశ్రమకు రూ.12.36 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, ఒడిశాలలో వినియోగం తగ్గడంతో గుడ్డు ధర పతనం బాట పట్టనుందని కోళ్ల రైతులు అంటున్నారు.
నిర్వహణ భారం తడిసి మోపెడు
అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇటీవల ఈదురుగాలుల ప్రభావం పరిశ్రమకు అపారనష్టాన్ని కలుగజేసింది. అర్తమూరు, ద్వారపూడి, అనపర్తి ఏరియాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో షెడ్ల రేకులు ఎగిరిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గోదాముల్లోని కోడిమేతలు తడిసిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, జనరేటర్లు సరిగా పనిచేయకపోవడం తదితర కారణాలతో విద్యుత్ సమస్యలు తోడవుతున్నాయి. ఈ తరుణంలో కోళ్ల మరణాలు, ఉత్పత్తి పడిపోవడం, గుడ్డు ధర తగ్గడం పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుముందు ఎండలు మరింత ముదరనుండటంతో పరిశ్రమ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులను ఆదుకోవాలి
ఎండల తీవ్రతతో కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి కుదేలైపోయిన కోళ్ల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది బతుకులు రోడ్డున పడే ప్రమాదముంది. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
– పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్,పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు
Comments
Please login to add a commentAdd a comment