తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు.. ప్రణాళిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్.. వర్షాలు వెలిశాక చకచకా పునరుద్ధరణ పనులు.. ఇదీ ఫొని తుపాను సందర్భంగా అధికారులు అనుసరించిన వ్యూహం. ‘తిత్లీ’ నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సాధారణ పరిస్థితులు చాలా త్వరగా నెలకొన్నాయి. తుపాను తీవ్రతలో తేడా ఉన్నప్పటికీ.. అధికారుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రజలు అంటున్న మాట. మరి అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి సీఎం చంద్రబాబు అడుగుపెట్టకపోవడమే ఇందుకు కారణమా?
అరసవల్లి:‘నేనొస్తేనే అంతా జరుగుతుంది... అంతా నేనే చేశాను... ప్రకృతిని ఎదిరించాను... సముద్రాన్ని ఆపేస్తాను...’ అనే ప్రకటనలే లేవు... అధికారుల్లో ఆందోళన, హడావుడి లేదు... ఆర్భాటం అస్సలే లేదు! ఒకటో రెండో ఉన్నత స్థాయి సమీక్షలు... క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు... అప్రమత్తత... తత్ఫలితంగా మన అధికారులు పెను తుపానునే జయించారు. తుపాన్ కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణనష్టం లేకుండా, భారీగా ఆస్తినష్టం సంభవించకుండా జిల్లావాసులను గట్టెక్కించారు. గతంలో తుపాన్ల సమయాల్లో వారా ల తరబడి విద్యుత్ సరఫరా లేక, తాగునీరు లేక అల్లాడిపోయే పరిస్థితులు ఉండేవి. హుద్‌హుద్.. తిత్లీ.. తర్వాత ఫొని.. ఈ మూడు పెను తుపాన్లు జిల్లాలో తీర, ఉద్దాన ప్రాంతాన్నే కుదిపేసినప్పటికీ ఈసారి మాత్రం ప్రజలు అతి త్వరగానే సాధారణ స్థితికి చేరుకున్నారు.
ఇదంతా ఆయన వస్తే సాధ్యమయ్యేనా...? అన్న విషయమై ఇప్పు డు జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని ఓ ఉన్నతాధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావిస్తే....‘నిజమే... వాళ్లంతా వస్తే వారికి మర్యాదలు చేసుకోవడానికి, వాళ్ల సమీక్షల్లో పాల్గొనడానికి గంటల కొద్దీ సమయం వృథా అయ్యేది.. మా విధులు సక్రమంగా చేయలేకపోయేవాళ్లం’ అని అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏమేరకు ఒత్తిడి ఉండేదో అర్థమవుతోంది. విస్తృత పబ్లిసిటీ, ఆర్భాటాల కోసం రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలను కూడా వాడేసుకునే చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన జిల్లాకు వచ్చి వుంటే... ఫొని తుపాన్ బీభత్సం నుంచి జిల్లా వాసులు ఇంత త్వరగా కోలుకునేవారు కారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రుల గణం రాకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం మిగిలిందని, ఆ మొత్తంతో ప్రజా వసరాలు తీరే అవకాశముందని ఓ అధికారి ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వచ్చుంటే...
ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సీఎం చంద్రబాబు తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కుదరలేదు. తర్వాత సిక్కోలు సహా నాలుగు జిల్లాలను కోడ్ నుంచి మినహాయించినప్పటికీ ఆ ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధులు విడుదల చేసేంతవరకే పరిమితం. ప్రజాప్రతినిధుల కదలికలపై కొంతమేర ఆంలు కొనసాగుతాయి. ఫొని తుపాను మరికొద్ది రోజుల్లో జిల్లాను అతలాకుతలం చేస్తుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లా కలెక్టర్ జె.నివాస్ బృందానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
దీనిని తూచా తప్పకుండా పాటించడంతో పూర్తి స్థాయి రక్షణ చర్యలు, పునరావాస కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించివుంటే... ఇక్కడి పరిస్థితులు వేరేలా ఉండేవని చర్చ సాగుతోంది. ఆయన వచ్చుంటే... ప్రొటోకాల్ అంటూ జిల్లా కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ఉద్యోగులంతా ఆయన వెంటే పరుగులు పెట్టుండేవారు. ఇది చాలక ప్రతి రెండు మూడు గంటలకు ఓ సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి హడావుడి మొదలయ్యేది. దీనికితోడు ఈ ప్రాంతాల్లోనే పండుగలు, సంబరాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగేది. ఇది చాలదన్నట్లుగా తిత్లీని జయించామంటూ విజయవాడలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రచారాలతో ఆయనకు కావాల్సిన ప్రచారం బాగా వచ్చేది కానీ బాధితులకు సాయం అందదు... ప్రణాళిక ప్రకారం ఆదుకునే పరిస్థితులుండవు.
ఐదేళ్ల క్రితం చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే హుద్‌హుద్ విరుచుకుపడగా, గతేడాది తిత్లీ జిల్లాలో ఉద్దానం రూపురేఖలను ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఈ రెండు తుపాన్లలో సీఎం తనదైన శైలిలో ప్రచార ఆర్భాటాలు ఎలా చేసారో ప్రజలందరికీ తెలిసిందే. తిత్లీ సమయంలో పలాస ప్రాంతంలో నాలుగైదు రోజులపాటు అక్కడే మకాం వేయడంతో పునరుద్ధరణ పనులన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 రోజుల వరకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందించలేని పరిస్థితి ఎదురైంది. ఈసారి జిల్లా యంత్రాంగా నికి తోడుగా పనులను పర్యవేక్షించేందుకు సీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.ఎస్.జవహర్‌రెడ్డి, కె.ధనంజయరెడ్డి తదితరులను నియమించారు. విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన సుమారు 3 వేల మంది కార్మికులతో పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. 14 మండలాల్లోని 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మర్నాడే పూర్తి స్థాయిలో విద్యుత్ అందించగలగడం విశేషం. ఒక్క విద్యుత్ శాఖ విషయంలోనే కాకుండా... నష్టం అంచనాలు, పారిశుద్ధ్యం, పునరావాసం, ఆహార సహాయ కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment