పొన్నాల...పువ్వులు
- మాటల మంత్రి లక్ష్మయ్య
- వెక్కిరిస్తున్న సమ్మక్క వెబ్‌సైట్
- ఆవిష్కరించినా ఓపెన్ కాని పోర్టల్
- అదే తీరుగా మడికొండ ఐటీ పార్కు
చెప్పుడెక్కువ... చేసుడు తక్కువ... నానుడి రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చక్కగా సరిపోతుంది. ఏదో చేసినట్లుగా ప్రకటించుకోవడం... తీరా అది తుస్సుమనడం ఆయన విషయంలో తరచుగా జరగడమే ఇందుకు నిదర్శనం. మేడారం మహా జాతరపై మంత్రి పొన్నాల ఆవిష్కరించిన వెబ్‌సైట్ ఒక్కరోజు కూడా పనిచేయకపోవడం.. ఆయన శైలిని మరోసారి తేటతెల్లం చేసింది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతరకు ముందు రోజున (ఫిబ్రవరి 11) రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ వెబ్‌సైట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. www.sammakkasarakka.co.in పేరు తో రూపొందించిన ఈ వెబ్‌సైట్ (పోర్టల్) ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటిం చారు.
సమ్మక్క-సారలమ్మ తల్లుల విశిష్టతను తెలిపే అంశాలు, ప్రభుత్వపరంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు, వనదేవతలను దర్శనార్థం వచ్చే వారికి అవసరమైన సమాచారం, గూగుల్ రూట్ మ్యాప్‌లు, అత్యవసర ఫోన్ నంబర్లను ఈ పోర్టల్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సమస్త సమాచారాం ఇందులో ఉందని ఢంకా భజాయించారు. కానీ... అది అందుబాటులోకి రాకుండానే తుస్సుమంది.
అవాక్కైన భక్తులు
మేడారం జాతర విశేషాలు, జాతర విధుల్లో ఉన్న అధికారులు, రూట్‌మ్యాప్ తదితర అంశాలతో ప్రభుత్వ వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చిందనే వార్త విని భక్తులు సంతోషించారు. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మేడారం జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇంత మంది వచ్చిన జాతరపై ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ కావడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో లక్షలాది మంది దీన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. మేడారం జాతరపై కొత్త అంశాలు ఉండవచ్చని ఆశించారు. కానీ.. వారి ఆశలు అడియూసలయ్యూరుు. మంత్రి పొన్నాల వెబ్‌సైట్ తుస్సుమంది. అసలు విషయం ఏమీ కనిపించలేదు.
ఒకరోజు కాకపోతే మరుసటి రోజైనా పోర్టల్ అందుబాటులోకి రాకపోతుందా అని వేచి చూశారు. జాతర జరిగిన నాలుగు రోజులతోపాటు ఇప్పటివరకూ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. పైగా పొన్నాల ఇచ్చిన అడ్రస్‌తో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే ఈ సైట్ అసలు ప్రారంభం కాలేదని, పైగా ఇది అమ్మకానికి ఉందని అందులో పేర్కొన్నారు. మంత్రి ఆవిష్కరించిన వెబ్‌సైట్ కావడంతో మేడారం జాతర సమాచారం తెలుస్తుందనుకుంటే... అసలు ఓపెన్ కూడా కాకపోవడం చాలా మందిని నిరుత్సాహ పరిచింది ఎవరో రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించడం... అది బాగుంటందని చెప్పుకోవడం... తీరా అందులో విషయం లేకపోవడంతో ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.
ఆది నుంచి అంతే...
తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో ఐటీ రంగం పురోగతికి పొన్నాల లక్ష్మయ్య ఏమీ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మడికొండలో 33 ఎకరాల్లో ఆయన ఆర్భాటంగా ఐటీ పార్కును ప్రారంభించారు. మార్కెట్ పరంగా సామర్థ్యం ఉన్నా...ఈ ప్రాజెక్ట్ వైపు కంపెనీలు కనీసం కన్నెత్తి కూడా చూడ లేదు. ఐటీ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఇంకా మూలుగుతూనే ఉంది.